అడుగు గడప దాటకపోతే ఇక అంతే...!
మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యపై విపక్షాలుగా విడివిడిగా నిర్వహిస్తున్న ఉద్యమాలు ఆయా పార్టీలకు కొత్త సవాళ్లను తెచ్చిపెడుతున్నాయట. కేంద్రంలో భూసేకరణ చట్టం 2013ను తీసుకొచ్చిన ప్రభుత్వంగా... ఆ తర్వాత బీజేపీ పాలనలో పార్లమెంట్‌లో ఆ చట్టానికి సవరణలు తెచ్చే ప్రయత్నాలను అడ్డుకున్న ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యేకతను చాటుకునేందుకు ప్రయత్నిస్తోందట. అయితే రాష్ట్రంలో మాత్రం కేంద్ర భూసేకరణ చట్టం అమలయ్యేలా చూడడంలో జీవో 123ను అడ్డుకోవడంలో టీపీసీసీ ముఖ్యనేతలు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడిని తేలేకపోతున్నారని ఆ పార్టీ నాయకులు తెగ వాపోతున్నారట.
మరోవైపు మల్లన్నసాగర్ నిర్వాసితుల సమస్యలపై సీపీఎం, ఇతర పార్టీలు ముందుండి రిలే నిరాహారదీక్షలు, పాదయాత్రలంటూ జోరుగా నిరసనలతో ముందుకు సాగుతున్నాయని గుర్తుచేసుకుని లోలోపల బాధపడుతున్నారట. గాంధీభవన్ నుంచి ‘చలో మల్లన్నసాగర్’ అంటూ మొదలెట్టి... కనీసం పార్టీ కార్యాలయం గేటు కూడా దాటకుండానే నేతలంతా అరెస్ట్ కావడం ఏమిటని ముక్కున వేలేసుకుంటున్నారట! రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాడే మార్గాలను పార్టీ నాయకత్వం తక్షణం మార్చుకోవాల్సిన అవసరం ఉందని కొందరు నాయకులు పనిలో పనిగా సలహాలిస్తున్నారట!