
కలకలం సృష్టిస్తున్న జైపాల్ రెడ్డి వ్యాఖ్యలు
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం సృష్టిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సిద్ధమన్న ఆయన వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలే తీవ్రంగా విభేదిస్తున్నారు. పొత్తులపై మాట్లాడే అధికారం జైపాల్ రెడ్డికి ఎవరిచ్చారని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పుడు పొత్తులు ఎందుకని అన్నారు. పొత్తులు అనేవి పార్టీ విధాన నిర్ణయం ప్రకారం ఉంటుందన్నారు.
పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో బలహీనపరిచే మాటలు చేయడం సరికాదని, జైపాల్ రెడ్డి మాటలు అప్రస్తుతమని పొంగులేటి పేర్కొన్నారు. బీజేపీతో భాగస్వామ్యంగా ఉన్న టీడీపీతో పొత్తు ఎలా సాధ్యమని ఆయన సూటిగా ప్రశ్నించారు. కాగా టీడీపీ అంటరాని పార్టీ కాదని, ఆ పార్టీతో పొత్తుకు తాము సిద్ధమని జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పొత్తుల విషయంలో టీడీపీ తీసుకునే నిర్ణయాన్ని బట్టి తాము కూడా నిర్ణయం తీసుకుంటామన్నారు. కలిసి వచ్చే వారందరినీ కలుపుకుపోతామని అన్నారు.