కాంగ్రెస్‌ను తప్పుపట్టవద్దన్న జైపాల్ | Jaipal reddy to suggest not to blame congress party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ను తప్పుపట్టవద్దన్న జైపాల్

Published Fri, Nov 6 2015 1:13 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

కాంగ్రెస్‌ను తప్పుపట్టవద్దన్న జైపాల్ - Sakshi

కాంగ్రెస్‌ను తప్పుపట్టవద్దన్న జైపాల్

పార్లమెంట్‌లో ఏం జరిగింది -5
ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదం పొందిన ఫిబ్రవరి 18, 2014న లోక్‌సభలో జరిగిన సన్నివేశాల కొనసాగింపును ఇప్పుడు చూద్దాం. సీమాంధ్రకు చెందిన భారతీయ జనతా పార్టీ కార్య కర్తలూ, నాయకులూ హైదరాబాద్‌తో సహా తెలంగాణ వేర్పాటు కోరుకుంటున్నారని, మరే పార్టీ కోరుకోవటం లేదని సుష్మాస్వరాజ్ గారు చెప్పారు.‘‘హోంమంత్రిగారు మాట చెప్తే కాదు. లోటు భర్తీకి కేటాయింపు జరపాలి’’ అని కూడా అన్నారు. అంతకు ముందు రోజే ‘ఓట్ ఆన్ అకౌంట్’ చేసేసి దుకాణం మూసేశాక, కొత్త కేటాయింపులు జరపలేరని ఆవిడకు తెలియక చెప్పింది కాదు ‘ఇన్‌టర్మ్ బడ్జెట్’ అంటూ మరోమాట కూడా అన్నారు.
 
 21వ తారీఖున 15వ లోక్‌సభే కాలం చెల్లిపోతుంటే... ఎందుకీ మాట అన్నట్లు...?
 పోలవరం ప్రాజెక్టు గురించి, మండలాల గురించి జైరాం రమేష్ గారికి వెంకయ్య నాయుడు గారికి ఒప్పందం కుదిరిందని సంబంధిత ఉత్తరం కూడా ఉందని సుష్మా స్వరాజ్ గారు అన్నారు!
 తప్పుడు బిల్లు ఎందుకు పాస్ చేయిస్తున్నారంటూ ప్రశ్నించారు కూడా... రండి రాజ్యాంగ సవరణ చేసి సరైన బిల్లు పాస్ చేద్దాం అని కూడా అన్నారు. నిజంగా రాజ్యాంగ సవరణ బిల్లు తెస్తే, మూడింట రెండొంతులు మెజారిటీతో అది ‘పాస్’ అవు తుందా? సాధారణ మెజారిటీతోనే పాసయ్యే పరిస్థితి లేకే టెలికాస్ట్ ఆపుచేసి తలుపులు మూసేసి, ‘డివిజన్’ చేయకుండా ‘మాయ’ చేస్తున్నారని ఆవిడకి తెలియదా!?
 పాపం షానవాజ్ హుస్సేన్ గారికి ఈ ‘కుట్ర’ తెలిసుండదు.
 
- టీవీ ప్రసారాలు ఎందుకాపేశారు... ఎందుకాపేశారు అంటూ విరుచుకుపడ్డారు! ‘ఇదీ కథ’ అని బీజేపీ అగ్రనాయకులు చెప్పి ఉంటారు... మళ్లీ నోరిప్పలేదాయన!!
- ప్రతిపక్షంలోని మిగిలిన అన్ని పార్టీలూ వ్యతిరేకిస్తున్నాయని, అయినా బీజేపీ ఒక్కటే ఈ బిల్లును సపోర్టు చేస్తున్నదని సాక్షాత్తూ ప్రతిపక్ష నాయకురాలైన సుష్మా స్వరాజ్ గారే ప్రకటించటం గమనార్హం!
- 15.10: జైపాల్‌రెడ్డి: ఈ డిమాండ్ గత 60 సంవత్సరాలుగా లేవనెత్తబడుతోందని గుర్తు చేస్తున్నాను. దేశచరిత్రలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఇంతటి దీర్ఘకాలిక అలజడితో కూడిన డిమాండ్ మరొకటి లేదనుకుంటా. ఈరోజు, ఇంతటి పవిత్రమైన, ఆనంద దాయకమైన సందర్భంలో మనమంతా ఇలాంటి క్రమశిక్షణ లేని దృశ్యంలో ఉండటం, ఆశ్చర్యం-బాధాకరం.
- మిత్రులారా! 2004 యూపీఏ మేనిఫెస్టోలో ఈ డిమాండ్ ఉల్లేఖించబడింది. 2004 అధ్యక్షోపన్యాసంలో ఒప్పుకోబడింది. నేను నా ఆంధ్ర మిత్రులని అడుగుతున్నా. ఇన్నాళ్లూ ఏం చేశారు? కుంభకర్ణుల్లా నిద్రపోతున్నారా...
 సుష్మాస్వరాజ్ గారికి, మద్దతిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూనే కాంగ్రెస్‌ను తప్పు పట్టవద్దని కోరుతున్నా. ఈ గొప్ప సందర్భం కోసం కాంగ్రెస్ పునాదులు తయారు చేస్తూ వచ్చింది. ఎన్నికల్లో లబ్ధి కోసం వారు చేస్తున్నారని మీరంటున్నారు.
- మేడమ్, 2009 డిసెంబర్ 9న నిర్ణయం తీసుకున్నప్పుడు ఎన్నికలున్నాయా? అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో ఉన్న సీమాంధ్ర మంత్రులు ఏం చేస్తున్నారు.... నిరసన వ్యక్తం చేశారా? ఇప్పుడెందుకు తొందరపాటు నిరసనలు?
- గత 45 సంవత్సరాలుగా బీజేపీ తెలంగాణ డిమాండ్‌ను సమర్థించింది. నేను మొట్టమొదటిసారి 1969లో ‘కాడెద్దులు’ గుర్తుతో ఎన్నికలో గెలిచాను. నేనా ఒరిజినల్ కాంగ్రెస్‌లో ఒకడిని. 1969లోనే తెలంగాణ ఉద్యమం కూడా ప్రారంభమయ్యింది. బీజేపీ, పూర్వజన్మలో భారతీయ జనసంఘ్, అప్పుడూ తెలంగాణను సపోర్టు చేసింది. అప్పట్నుంచీ సపోర్టు చేస్తూనే వచ్చింది. బీజేపీలోనే కాక, దేశంలోనే అతి పెద్ద రాజ నీతిజ్ఞుడు అయిన అద్వానీ గారి వ్యతిరేక స్వరం విని నేను నిశ్చేష్టుడనయ్యాను.  ఏది ఏమైనప్పటికీ సుష్మాస్వరాజ్‌గారు వ్యక్తిగత హోదాలోనైనా మద్దతుగా మాట్లాడినం దుకు ధన్యవాదాలు.
- ‘విశాలాంధ్ర’ అనే పత్రిక ఉన్నప్పటికీ, మునుపటి రోజుల్లో రాష్ట్ర విభజనను వ్యతిరేకించినప్పటికీ,ఇప్పుడు తెలంగాణకు  మద్దతు తెలుపుతున్న కమ్యూనిస్టు పార్టీ వారికి అభినందనలు.
- ఈ అద్భుతమైన ప్రయోజనం సిద్ధించడానికి ప్రధాన కారకులు ఒకే వ్యక్తి, ఒకే మహిళ, సోనియా గాంధీ. నేను సోనియాజీతో సన్నిహితంగా 15 ఏళ్లు పనిచేశాను.
 
 స్పీకర్: ఆల్‌రైట్ జైపాల్‌రెడ్డిగారూ... దయచేసి ముగించండి!
 జైపాల్: ఆమెకు అంతర్జాతీయ అవగాహన ఉంది. ఆమె ఏనాడు సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించారు? ఈ సందర్భంలో నేను తెలంగాణ ప్రజల తరఫున ఒకమాట చెప్తున్నా. ప్రత్యేక తెలంగాణ రాష్ర్టంలో మేము ఏనాడూ సీమాంధ్ర ప్రజలను వివక్షతో చూడం.
 మనందరికీ తెలిసిందే... చివరాఖరికి మనమంతా తెలుగువాళ్లం. మనమంతా భారతీయులం. భారత రాజ్యాంగం చేత పాలించబడుతున్న వాళ్లం.
 స్పీకర్: ఆల్‌రైట్...ఓకే... దయచేసి ముగించండి!
 జైపాల్: ఈ సందర్భంగా సోనియాగాంధీ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియ చేస్తూ సీమాంధ్ర ప్రజలకు నమ్మకంగా చెప్తున్నా... హైదరాబాద్‌లో సీమాంధ్ర వారిని ఎవరైనా వేరుగా చూస్తే తలదించుకునేవాళ్లలో నేను మొదటివాడినవుతా.
 స్పీకర్: జైపాల్‌రెడ్డిగారూ! దయచేసి ముగించండి!
 స్పీకర్: ఆల్‌రైట్ థ్యాంక్యూ. జైపాల్: నేనింకెంతో కాలం ఉండను. ఉన్నకాలంలో నాకి వ్వబడిన సమయంలో సీమాంధ్ర ప్రజల రక్షణ కోసం నన్ను నేను అంకితం చేసుకుంటున్నా. థ్యాంక్‌యూ. స్పీకర్: థ్యాంక్యూ సో మచ్. ఎవరైనా మాట్లాడాలనుకున్నవాళ్లు రాసుకొచ్చిన ఉపన్యాసాలను ‘టేబుల్’ చెయ్యండి. ఇక ప్రొసీడ్ అవుతాను. పార్లమెంటులో అన్ని పార్టీల సభ్యులూ సమానంగా  గౌరవించే మేధావి జైపాల్ రెడ్డి గారు. ఆయన మాట్లాడుతుంటే స్పీకర్ గారు ‘ఇక ముగించండి, ఇక ముగించండి’ అంటూ అడ్డుతగలడం - బహుశా ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఇదే మొదటి సారి అయి ఉంటుంది.
 
ఇన్నాళ్లూ ‘కుంభకర్ణుల్లా నిద్రపోతున్నారా’ అని ఆంధ్రా మిత్రుల్ని ప్రశ్నించారు జైపాల్‌రెడ్డిగారు. నిజానికి 2004 ఎన్నికల మేనిఫెస్టోలో రెండవ ఎస్సార్సీ (స్టేట్స్ రి-ఆర్గనైజేషన్ కమిషన్) వేస్తామని చెప్పింది కాంగ్రెస్. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మొదటి ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి చేత తెలంగాణ విషయమై ఈ కింది మాటలు చెప్పించింది యూపీఏ ప్రభుత్వం. ‘‘సరైన సమయంలో, తగు సంప్రతింపుల తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది’’.

ఇక 2009లో చిదంబరం తెలంగాణ ప్రకటన తర్వాత సీమాంధ్ర భగ్గుమంది. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుని శ్రీకృష్ణ కమిషన్‌ను నియమించింది. ‘అద్వానీగారు వ్యతిరేక స్వరం విని నిశ్చేష్టుడనయ్యాను’ అన్నారు జైపాల్‌రెడ్డి. ‘‘రాష్ట్ర విభజన రాబోయే ప్రభుత్వం నిర్ణయిస్తుంది. మూడు నెలల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరగబోతోంది. ఎందుకీ అల్లకల్లోలంలో హడావిడి నిర్ణయం. ఓట్ ఆన్ ఎకౌంట్ పూర్తి చేసి 15వ లోక్‌సభను ముగించండి’’ అని అద్వానీ గారు కోరిన విషయం సర్వ విదితమే. దీనినే జైపాల్‌రెడ్డి ప్రస్తావిస్తూ ‘వ్యతిరేక స్వరం’ అన్నారు.        
                                                                       
 అరవై ఏళ్లుగా నలుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన మీద చర్చ ముగిసి పోయింది. ఇద్దరే ఇద్దరు పాల్గొన్నారు. సుష్మా స్వరాజ్, జైపాల్‌రెడ్డి. ఇంకెవ్వరైనా మాట్లాడాలనుకుంటే, వారి ఉపన్యాసాల వ్రాతప్రతులు ‘టేబుల్’ చెయ్యండి... (అంటే స్పీకర్ ముందు కూర్చునే సెక్రటరీకి అందచెయ్యమని) అన్నారు.

బోడో ఫ్రంట్‌కు చెందిన సంసుమకునగ్గర్  బిశ్వమూర్రియర్ , శైలేంద్రకుమార్, దారాసింగ్, సౌగత్‌రాయ్ పునియా, సుదీప్ బందోపాధ్యాయ, మహేంద్రసింగ్ చౌహాన్, కిరీటి ప్రేమ్‌జీ భాయ్ సోలంకి, అర్జునరామ్ మేఘవాల్, గురుదాస్ దాస్ గుప్తాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పనబాక లక్ష్మి, బొత్స ఝాన్సీ, మధు యాష్కీ, సురేశ్ షట్కర్, పొన్నం ప్రభాకర్, జి. వివేకానందలు కూడా తమ స్పీచ్‌లు ‘టేబుల్’ చేశారు.

ఇవన్నీ పార్లమెంట్ రికార్డుల్లో నమోదు చేయబడ్డాయి. 12-11-1962న డాక్టర్ జీఎస్ మేల్కోటే అనే లోక్‌సభ సభ్యుడు తను వ్రాసు కొచ్చిన ‘స్పీచ్’ని టేబుల్ చేస్తానంటే అప్పటి స్పీకర్ ‘అలా చేయటానికి వీలులేదని రూలింగ్ ఇచ్చారు! ఆ రూలింగ్ కూడా ‘బ్రేక్’ చేయబడింది.
- వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు
 - ఉండవల్లి అరుణ్‌కుమార్
  a_vundavalli@yahoo.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement