సాక్షి ప్రతినిధి, కరీంనగర్/సాక్షి, మహబూబాబాద్: రాష్ట్రంలో బీజేపీ గాలి వీస్తోందని, రాబోయేది తమ ప్రభుత్వమేనని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తెలంగాణలో పరివర్తన కనిపిస్తోందని, ఇక్కడ మార్పు నిశ్చయమని స్పష్టం చేశారు. ‘‘మోదీ ఏం చెబితే అదే చేస్తారు.. మోదీ మాట అంటే గ్యారంటీలకే గ్యారంటీ.. గ్యారంటీ అంటేనే మోదీ.. చెప్పినవి కచ్చితంగా చేస్తారు. చేసే పనులనే చెబుతారు’’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారుతోనే సాధ్యమని చెప్పారు.
తాము గెలిస్తే బీసీనే సీఎం అవుతారని, అన్ని వర్గాల వారి అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు. పొరపాటున కాంగ్రెస్ గానీ వస్తే.. వారికి తెలంగాణ ఏటీఎం అవుతుందని, ఒక రోగాన్ని తగ్గించేందుకు మరొక రోగాన్ని తెచ్చుకోవద్దని వ్యాఖ్యానించారు. సోమవారం కరీంనగర్, మహబూబాబాద్‌లలో నిర్వహించిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలలో ప్రధాని మోదీ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘కేసీఆర్ నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని పక్కనపెట్టి.. ప్రజలకు కన్నీళ్లు, మోసాలు మిగిల్చారు. తెలంగాణకు రాబోయే ఐదేళ్లు చాలా కీలకం. ఇప్పుడు తెలంగాణలో ప్రయోగం చేయలేం. పొరపాటు చేయలేం. అందుకే బీజేపీ ప్రభుత్వం చాలా అవసరం. బీజేపీ ప్రభుత్వం వచ్చాక లిక్కర్ స్కాం దర్యాప్తు వేగవంతం అవుతుంది. వాళ్లు దోచుకున్న సొమ్ము కక్కిస్తాం. కాళేశ్వరం, లిక్కర్ స్కాం, ఈడీ కేసులు ఎదుర్కొంటున్న నిందితులకు జైలు తప్పదు. ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని కేసీఆర్ కూడా తెలుసు. అందుకే మోదీ పేరు వింటేనే ఉలిక్కిపడుతున్నారు.
ఆ పార్టీలను ఎప్పుడూ నమ్మొద్దు
కుటుంబ పార్టీలను ఎప్పుడూ నమ్మకండి. అవి చట్టాన్ని దుర్వినియోగం చేస్తాయి. కుటుంబవాదంతో ప్రతిభకు అన్యాయం జరుగుతుంది. బీఆర్‌ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా.. మీ పిల్లల భవిష్యత్తును దెబ్బతీసేందుకు ఏమాత్రం వెనుకాడవు. పీవీ నరసింహారావు వంటి గొప్ప వ్యక్తిని కూడా కాంగ్రెస్ తీవ్రంగా అవమానించింది. కాంగ్రెస్ ఉన్నప్పుడు బాంబు పేలుళ్లు జరిగాయి. కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాల్లో పీఎఫ్‌ఐ వంటి దేశ వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తుంది. వారి హయాంలోనే నక్సల్స్ హింస చెలరేగింది. బీజేపీ ఉగ్రవాదంపై, వామపక్ష తీవ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంది.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒక్కటే..
బీఆర్‌ఎస్ కాంగ్రెస్ రెండూ ఒకటే. రెండు పార్టీలూ తెలంగాణకు అన్యాయం చేశాయి. అవినీతి, కుటుంబ పాలన కొనసాగించాయి. బుజ్జగింపు రాజకీయాలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాయి. అవి ప్రజలను మోసం చేసేందుకు ఎలాంటి అవకాశాన్నీ వదిలిపెట్టవు. కాంగ్రెస్ సభ్యులకు గ్యారంటీ లేదు. వాళ్లు ఎప్పుడైనా బీఆర్‌ఎస్‌లో చేరుతారు. కాంగ్రెస్‌కు ఓటేయడం అంటే మళ్లీ కేసీఆర్‌ను గద్దె ఎక్కించడమే.
డబుల్ ఇంజన్ సర్కారుతోనే అభివృద్ధి
కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఏర్పడితే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. కరీంనగర్ స్మార్ట్‌సిటీ కోసం మోదీ సర్కారు నిధులు ఇచ్చింది. కానీ కేసీఆర్ సర్కార్ అడ్డుకుంది. కేసీఆర్ కరీంనగర్‌ను లండన్ చేస్తానని తప్పుడు వాగ్దానం చేశారు. కానీ బీజేపీ సర్కారు కరీంనగర్‌ను సిల్వర్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుంది. బీజేపీ అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం.
కేసీఆర్ కలుస్తానంటే తిరస్కరించా..
కేసీఆర్ ఢిల్లీ వచ్చి బీజేపీతో కలుస్తామని అడిగారు. కానీ నేను, మా పార్టీ ఒప్పుకోలేదు. దానిని మనసులో పెట్టుకుని బీజేపీని తిట్టడమే పనిగా పెట్టుకొన్నారు. మేం ప్రజల మనోభావాలకు ప్రాధాన్యత ఇస్తాం. అందుకోసమే బీఆర్‌ఎస్‌ను దగ్గరికి రానివ్వలేదు. ఇకముందు కూడా బీఆర్‌ఎస్‌ను బీజేపీ దగ్గరకు రానివ్వదు.
సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం
దేశంలో సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం. గిరిజనులు, ఆదివాసీలకు ప్రాధాన్యత ఇస్తుంది. సంచార జాతులకోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేశాం. సేవాలాల్ మహరాజ్‌కు గౌరవం వచ్చి జయంతి వేడుకలు నిర్వహించాం. రాంజీ గోండు, కుమురంభీం వంటి నాయకుల స్మారకంగా మ్యూజియం నిర్మిస్తున్నాం. సమ్మక్క–సారక్క జాతరకు ప్రపంచ గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తాం. ఇంతకాలం అన్యాయానికి గురైన మాదిగ సమాజానికి ఊరటనిస్తాం. ఎస్సీ వర్గీకరణ కోసం కృషి చేస్తాం..’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ మునిగిపోతోందని, డిసెంబర్ 3న వారి కరెంట్ కట్ అవుతుందని వ్యాఖ్యానించారు.
తెలుగులో మాట్లాడుతూ.. బీజేపీనే వస్తుందంటూ..
ప్రధాని మోదీ తన ప్రసంగాల్లో తరచూ తెలుగులో మాట్లాడుతూ ఆకట్టుకున్నారు. కరీంనగర్ సభలో.. ‘‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ శుభాభినందనలు. వేములవాడ రాజన్నకు, శాతవాహన, కాకతీయ, మౌర్యుల కర్మభూమి అయిన ఈ గడ్డకు నమస్కారాలు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఫాంహౌజ్ సీఎం కేసీఆర్‌కు ప్రజలు ట్రైలర్ చూపించారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఖేల్ ఖతం. యావత్ తెలంగాణ అంతా ఒక్కటే మాట వినిపిస్తోంది. మొదటిసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది..’’ అని మోదీ పేర్కొన్నారు.
కరీంనగర్‌కు రక్షణ కవచం అవుతా: బండి సంజయ్
కరీంనగర్‌లో మోదీ ప్రసంగం అనంతరం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మాట్లాడారు. ‘‘కరీంనగర్ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రంలో అన్ని వర్గాలు మీ తీర్పు కోసం ఎదురుచూస్తున్నాయి. ఒక్క చాన్స్ ఇస్తే ఐదేళ్లు మీకు సేవ చేసుకుంటా.. కరీంనగర్‌కు రక్షణ కవచంగా నిలుస్తా..’’ అని పేర్కొన్నారు. తాను ఎంపీగా జిల్లాకు తొమ్మిది వేల కోట్ల నిధులు తీసుకొచ్చానని.. స్మార్ట్‌సిటీ, గ్రామీణ సడక్ యోజన, జాతీయ రహదారులకు కేంద్ర నిధులు మంజూరు చేయించానని తెలిపారు. కరీంనగర్‌లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో భూకబ్జాదారులు ఎవరో, ప్రజల కోసం పోరాడేదెవరో ఆలోచించి ఓటువేయాలని కోరారు.
ఒక రోగానికి మందు వేస్తే.. మరో రోగం వచ్చినట్టు..
ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వంపై నమ్మకం పోయింది. కాంగ్రెస్ విషయంలో అయోమయంలో ఉన్నారు. ఒక రోగానికి మందు వేద్దామని.. మరో రోగం తెచ్చుకోవద్దు. బీఆర్‌ఎస్ దుర్మార్గ పాలనకు చెక్‌పెడదామని.. కాంగ్రెస్ అవినీతి పాలన తెచ్చుకోవద్దు. ఇంతకాలం తెలంగాణను కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలకులు నాశనం చేశారు. వారి పాపపు పాలన ప్రజలకు శాపంగా మారింది. విసిగిపోయిన ప్రజలు బీజేపీపై విశ్వాసంతో ఉన్నారు. ఇప్పుడు కొత్త శకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. వారు బీఆర్‌ఎస్‌ను పరుగెత్తిస్తారు, కాంగ్రెస్‌ను అడ్డుకుంటారు. బీజేపీని ఎన్నుకుంటారు.
– ప్రధాని మోదీ
Comments
Please login to add a commentAdd a comment