ప్రధాని రేసులో ఉంటా!: కేసీఆర్‌ | BRS Leader KCR About His National Politics | Sakshi
Sakshi News home page

ప్రధాని రేసులో ఉంటా!: కేసీఆర్‌

Published Sun, May 12 2024 4:40 AM | Last Updated on Sun, May 12 2024 4:40 AM

BRS Leader KCR About His National Politics

జాతీయ స్థాయిలో ప్రాంతీయ శక్తుల కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తా: కేసీఆర్‌

నాకున్న రాజకీయ సంబంధాలు, శక్తిని, తెలివిని రంగరిస్తా.. 

జాతీయ పార్టీలు ర్టీప్రాంతీయ కూటమికి మద్దతిచ్చే పరిస్థితిని సృష్టిస్తా.. 

జాతీయ రాజకీయాలు కొనసాగిస్తాం 

మహారాష్ట్ర అసెంబ్లీ బరిలో నిలుస్తాం 

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ 12 నుంచి 14 స్థానాల్లో గెలిచి తీరుతుంది 

రాష్ట్రంలో రెండో స్థానంలో బీజేపీ, మూడో స్థానంలో కాంగ్రెస్‌ ఉంటాయి 

రేవంత్‌ ‘ఓటుకు నోటు’ దొంగ.. ఆయన అసమర్థతతో రాష్ట్రానికి కష్టాలు

మీడియాతో బీఆర్‌ఎస్‌ అధినేత

సాక్షి, హైదరాబాద్‌: దేశ ప్రధానిగా పనిచేసే అవకాశం వస్తే వంద శాతం రేసులో ఉంటానని.. అవకాశం వస్తే వదులుకునేంత అమాయకుడిని కాదని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ జాతీయ రాజకీయాలను కొనసాగిస్తామని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత అందరినీ సంప్రదించి.. తనకున్న రాజకీయ సంబంధాలు, శక్తి, తెలివిని రంగరించి ప్రాంతీయ కూటమి కోసం ప్రయత్నాలు చేస్తానని చెప్పారు. 

ఏదో ఒక జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీల కూటమికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితిని సృష్టిస్తామన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ 12 నుంచి 14 ఎంపీ స్థానాల్లో గెలిచితీరుతుందని చెప్పారు. కాంగ్రెస్‌ 9 చోట్ల మూడో స్థానంలో ఉందని.. బీజేపీ రెండో స్థానంలో ఉన్నా బీఆర్‌ఎస్‌కు చాలా దూరంలో ఉందని పేర్కొన్నారు. 16 రోజుల పాటు నిర్వహించిన ఎన్నికల ప్రచార బస్సుయాత్ర ముగియడంతో శనివారం బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ నేత కె.కేశవరావు పార్టీని వీడటంతో ఆయన స్థానంలో రాజ్యసభ ఎంపీ కేఆర్‌.సురేశ్‌రెడ్డిని పార్లమెంటరీ పార్టీ నేతగా నియమిస్తూ రాజ్యసభ చైర్మన్‌కు లేఖ ఇస్తున్నా. జాతీయ రాజకీయాల్లో మా పార్టీ తరఫున ఆయన కీలక ప్లేయర్‌గా ఉంటారు. ఈ అక్టోబర్‌లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేయాలని అక్కడి నేతలు కోరుతున్నారు. మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి ఉంది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అక్కడా అమలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌ పేరిట పోటీచేసి గెలుస్తాం. 

హైదరాబాద్‌ గొంతు కోస్తే సహించరు.. 
కేంద్ర పాలిత ప్రాంతం పేరిట హైదరాబాద్‌ గొంతు కోస్తే తెలంగాణ ప్రజలు సహించరు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే వంటివారు కూడా దేశానికి రెండో రాజధాని కావాలని అంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ వంటి పిచ్చివాళ్లకు స్థానమిస్తే హైదరాబాద్‌ను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తారు. హైదరాబాద్‌ తెలంగాణ సొంతం.. ఎన్నటికీ వదులుకోబోం. ఓటుకు నోటు కేసులో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన రేవంత్‌ బీజేపీలో చేరతాడని కాంగ్రెస్‌ నేతలే అనుమానిస్తున్నారు. 26 నుంచి 33 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఏర్పాటుకు రెడీగా ఉన్నామని మాతో అంటున్నారు. కారు షెడ్డుకు వెళ్లిందంటున్న రేవంత్‌రెడ్డి.. మా ధాటికి రేపు ఎక్కడికి పోతాడో చూద్దాం. పనులు, పైరవీల కోసమే కొందరు కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ ప్రళయ గర్జన చూస్తారు. 

ఫోన్‌ ట్యాపింగ్‌తో సంబంధం లేదు.. 
ప్రభుత్వంలో వందల మంది అధికారులు ఉంటారు. అందులో ఒకరైన రాధాకిషన్‌రావు ఎవరు? ఫోన్‌ ట్యాపింగ్‌కు సీఎంకు ఏం సంబంధం? గూఢచార వ్యవస్థ లేని ప్రభుత్వం ఉండదు. నిఘా విభాగం నుంచి ప్రభుత్వం కేవలం సమాచారం మాత్రమే కోరుతుంది. ట్యాపింగ్‌ పూర్తిగా పోలీసు విభాగం అంతర్గత విషయం. టెలిగ్రాఫ్‌ యాక్ట్‌ ప్రకారం.. హోంశాఖ కార్యదర్శి అనుమతితోనే ట్యాపింగ్‌ జరుగుతుంది. 

రేవంత్‌వి చిల్లర రాజకీయాలు 
రైతు భరోసా, ఉద్యోగులకు 51 శాతం ఫిట్‌మెంట్, నాలుగు విడతల డీఏ విడుదల వంటివి ఉండగా రైతులకు రూ.40 వేల కోట్ల రుణమాఫీ సాధ్యం కాదు. ప్రజలను భ్రమల్లో పెట్టేందుకు రేవంత్‌ చేస్తున్న ప్రయత్నం సఫలం కాదు. మేం ఎంతో ఆలోచించి ఏర్పాటు చేసిన జిల్లాలను రద్దు చేస్తే.. ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదు. భాష విషయంలో రేవంత్‌ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. రేవంత్‌ ఓటుకు నోటు దొంగ, బ్లాక్‌ మెయిలర్, భూ కబ్జాకోరు. ఆయన చేతకానితనంతోనే రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి. ప్యారగాన్‌ చెప్పులు లేని కుటుంబం ఎవరిదో ప్రజలకు తెలుసు. రేవంత్‌వి చిల్లర రాజకీయాలు. ఆరు నెలల పాలనలో ఆరోగ్యం, విద్యుత్, వ్యవసాయ, చేనేత తదితర రంగాల్లో కాంగ్రెస్‌ పూర్తిగా విఫలమైంది. ఇదే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీని ముంచుతుంది..’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.  

లక్ష మంది రేవంత్‌లు వచ్చినా బీఆర్‌ఎస్‌ను తుడిచిపెట్టలేరు.. 
కేసీఆర్‌ అంటే తెలంగాణ చరిత్ర. నా రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రం తెచ్చా. కేసీఆర్‌ గుండెల్లో తెలంగాణ.. తెలంగాణ గుండెల్లో కేసీఆర్‌ ఉంటరు. గెలుపోటములు పక్కన పెడితే తెలంగాణ ఎమోషన్‌ కేసీఆర్‌. 65 లక్షల మంది సభ్యత్వం కలిగిన మహా సముద్రం లాంటి బీఆర్‌ఎస్‌ను తుడిచిపెట్టడం లక్ష మంది రేవంత్‌లు వచ్చినా సాధ్యం కాదు. కేసీఆర్‌ను గిల్లి పడేస్తం అనుకునే వాళ్లు పిచ్చివాళ్లు.  

మోదీ దుర్మార్గాలు పెరిగాయ్‌..
ప్రధాని మోదీ దుర్మార్గాలు పెరిగిపోయాయి. ఆయన గోబెల్స్‌ మాదిరిగా అవసరాన్ని బట్టి మాట్లాడుతారు. నాలుక మడతేయడం ఆయనకు వచ్చినంతగా ఎవరికీ రాదు. మత విద్వేషాలను రెచ్చగొట్టి దేవుడి పేరిట ఓట్లు కొల్లగొట్టే పార్టీ బీజేపీ. హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా.. అసమానతకు గురైన ఎస్సీ, ఎస్టీ, ఎస్టీ, ఎంబీసీ, మైనారిటీలు అందరికీ న్యాయం జరగాలి. ఎస్సీ రిజర్వేషన్లు 15% నుంచి 19 శాతానికి పెంచాలి. అల్పాదాయం ఉన్న ముస్లింలకు కూడా రిజర్వేషన్లు ఉండాలి. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ మోదీ సృష్టించిన రాజకీయ కుట్ర. నేనూ, కేజ్రీవాల్‌ మోదీకి కంటిలో నలుసులా తయారయ్యాం. మోదీ కుడి భుజం బీఎల్‌ సంతో‹Ùను అరెస్టు చేసేందుకు వెళ్లినందునే.. నా కూతురు కవితను టార్గెట్‌ చేశారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మేం ఈ కుట్రలను ఎదుర్కొంటాం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement