సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశపై కేంద్రం చేతులెత్తేయడం తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వ పక్షపాత ధోరణికి నిదర్శనమని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత రద్దీ కలిగిన హైదరాబాద్‌లో మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశ సాధ్యం కాదంటోందని పేర్కొన్నారు. మంగళవారం ‘సాక్షి’లో ‘మెట్రో రెండోదశ దూరమే! ’శీర్షికన ప్రచురితమైన కథనంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు.
మెట్రో రెండోదశపై కేంద్రం తీరును తప్పుపడుతూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరీకి కేటీఆర్ లేఖ రాశారు. గాం«దీనగర్, కొచ్చి, బెంగళూరు, చెన్నై వంటి నగరా లతోపాటు చాలా తక్కువ జనాభా కలిగిన లక్నో, వారణాసి, కాన్పూర్, ఆగ్రా, ప్రయాగ్‌రాజ్, మీరట్ వంటి ఉత్తరప్రదేశ్‌లోని చిన్న పట్టణాలకు కూడా మెట్రో ప్రాజెక్టులను కేటాయించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.
జనాభారద్దీ తక్కువగా ఉన్న ఇలాంటి నగరాలకు మెట్రో రైల్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని పేర్కొన్న కేంద్రం, హైదరాబాద్‌కి మాత్రం మెట్రోరైల్ విస్తరణార్హత లేదని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఇది కచ్చితంగా తెలంగాణ, హైదరాబాద్ నగరం పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్న పక్షపాతమేనని, కేంద్రానిది సవతి తల్లి ప్రేమ అని కేటీఆర్ విమర్శించారు.
పూర్తి సమాచారంతో డీపీఆర్ ఇచ్చాం
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు మెట్రో రైల్ రెండవ దశకు అవసరమైన అన్ని రకాల సమాచారాన్ని డీటెయిల్డ్ ప్లానింగ్ రిపోర్ట్(డీపీఆర్)ను అందించినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ, పీహెచ్‌డీటీ గణాంకాలు, ఇతర అర్హతలు, సానుకూలతలను కేంద్రం దృష్టికి తీసుకువచ్చామన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి అవసరమైన అన్ని రకాల సమాచారం అందించినా, తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెబుతున్న నేపథ్యంలో మరోసారి సమగ్ర సమాచారాన్ని, అన్ని రకాల పత్రాలను నివేదికలను కేంద్రానికి పంపుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు వాటిని జతచేశారు.
కేంద్ర మంత్రి స్పందన నిరాశాజనకం
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండవ దశ ప్రాధాన్యతను కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పూరీని వ్యక్తిగతంగా కలిసి వివరించేందుకు తాను ప్రయత్నించానని కేటీఆర్ వివరించారు. కాగా, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు.
అయితే కేంద్రమంత్రి పూరీ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌పై సాధ్యమైనంత త్వరలో సరైన నిర్ణయం తీసుకొంటారని, తెలంగాణకు ప్రాజెక్టులు కేటాయిస్తారని ఆశించానని కేటీఆర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment