పలు రూట్లలో ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు | MMTS Trains Canceled Some Areas in Hyderabad | Sakshi
Sakshi News home page

నేడు, రేపు పలు రూట్లలో ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

Published Sat, Sep 15 2018 9:02 AM | Last Updated on Sat, Sep 15 2018 9:23 AM

MMTS Trains Canceled Some Areas in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నాంపల్లి రైల్వేస్టేషన్‌లో  సిగ్నలింగ్‌ పనుల వల్ల  ఈ నెల 15, 16 తేదీల్లో  పలు ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేయనున్నట్లు  దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో  ఎం.ఉమాశంకర్‌కుమార్‌  ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేయనున్నారు. ఈ మేరకు 15వ తేదీన లింగంపల్లి –నాంపల్లి రైల్వేస్టేషన్‌ల మధ్య  10 ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేయనున్నారు. అలాగే  16వ తేదీన లింగంపల్లి– ఫలక్‌నుమా, నాంపల్లి–లింగంపల్లి మధ్య 3 ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు కానున్నాయి. 

పూర్ణ–హైదరాబాద్‌  ప్యాసింజర్‌ 15వ తేదీన పూర్ణ నుంచి లింగంపల్లి వరకే నడుస్తుంది.తిరుగు ప్రయాణంలోనూ లింగంపల్లి నుంచే బయలుదేరుంది.  
హైదరాబాద్‌–కొచువెలి స్పెషల్‌ ట్రైన్‌  నాంపల్లి స్టేషన్‌ నుంచి కాకుండా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి 15వ తేదీ రాత్రి 9.40 కి బయలుదేరుతుంది. తాండూరు–హైదరాబాద్‌ ప్యాసింజర్‌ను లింగంపల్లి వరకే నడుపుతారు. హైదరాబాద్‌–పర్భని ప్యాసింజర్‌ సికింద్రాబాద్‌ నుంచి  రాత్రి  11.10 కి బయలుదేరుతుంది.   

హుస్సేన్‌సాగర్‌ చుట్టూ ట్రాఫిక్‌ ఆంక్షలు :
నగరంలో గురువారం నుంచి గణేష్‌ ఉత్సవాల సందడి మొదలైంది. విగ్రహాల నిమజ్జనం మూడో రోజు నుంచి ప్రారంభమవుతుంది.  శనివారం నుంచి 22 వరకు హుస్సేన్‌సాగర్‌ చుట్టూ నిమజ్జనం కోలాహలం నెలకొననున్న నేపథ్యంలో సాగర్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ కొత్వాల్‌ అంజనీ కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.  

ఆంక్షలు, మళ్లింపులు ఇలా...
హోటల్‌ మారియట్‌ ‘టి’ జంక్షన్‌ వద్ద: కర్బాలామైదాన్‌ నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు అనుమతించరు. వీటిని కవాడిగూడ చౌరస్తా మీదుగా పంపిస్తారు. లిబర్టీ వైపు వెళ్లే వాహనచోదకులు కవాడీగూడ చౌరస్తా, గాంధీనగర్‌ టి జంక్షన్, డీబీఆర్‌ మిల్స్, ఇందిరాపార్క్, దోమలగూడ మీదుగా వెళ్లాలి. ఖైరతాబాద్, పంజగుట్ట వైపు వెళ్లే వాహనచోదకులు రాణిగంజ్, నల్లగుట్ట, సంజీవయ్య పార్క్, నెక్లెస్‌రోడ్, ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌ మీదుగా వెళ్లాలి.  

నెక్లెస్‌ రోటరీ వద్ద:ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌ వైపు నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు అనుమతించరు. వీటిని నెక్లెస్‌ రోడ్‌ లేదా మింట్‌ కాంపౌండ్‌ మీదుగా పంపిస్తారు.

తెలుగుతల్లి చౌరస్తా వద్ద:ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ఇక్బాల్‌ మీనార్‌ వైపు పంపిస్తారు. సికింద్రాబాద్‌ వైపు వెళ్లే ట్రాఫిక్‌ తెలుగుతల్లి ఫ్లైఓవర్, కట్టమైసమ్మ టెంపుల్, డీబీఆర్‌ మిల్స్, చిల్డ్రన్‌ పార్క్, సెయిలింగ్‌ క్లబ్, కర్బాలామైదాన్‌ మీదుగా వెళ్లాలి.  

డీబీఆర్‌ మిల్స్‌ వద్ద:గోశాల వైపు నుంచి అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లే వాహనాలను డీబీఆర్‌ మిల్స్, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ మీదుగా పంపిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement