సాక్షి, సిటీబ్యూరో: ప్రయాణికులను ఎంతో ఊరించిన ఎంఎంటీఎస్ కొత్త రూట్ అరకొర కనెక్టివిటీతో ఉస్సూరుమనించే అవకాశం కనిపిస్తోంది. మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వరకే ఇది పరిమితం కానుంది. ఈ నెల 8న ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ రూట్‌లో ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. అలాగే ఉందానగర్–ఫలక్‌నుమా మధ్య కూడా రైళ్లను ప్రారంభించనున్నారు.
కానీ మేడ్చల్, మల్కాజిగిరి వాసులు హైటెక్‌సిటీ, లింగంపల్లి వైపు వెళ్లాలంటే సికింద్రాబాద్‌లో మరో రైలు మారాలి. ఇది కొంతవరకు ఇబ్బందిగానే ఉంటుంది. సాఫీగా వెళ్లేందుకు అవకాశం ఉండదు. మరో ట్రైన్ కోసం సికింద్రాబాద్‌లో పడిగాపులు కాయాల్సి ఉంటుంది. మేడ్చల్ నుంచి నేరుగా లింగంపల్లి వరకు నడిపేందుకు అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతం సికింద్రాబాద్ వరకే పరిమితం చేసినట్లు సమాచారం.
ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు మేడ్చల్, సుచిత్ర, కొంపల్లి, అల్వాల్, నేరేడ్‌మెట్, సైనిక్‌పురి, బొల్లారం, మల్కాజిగిరి తదితర ప్రాంతాల నుంచి హైటెక్ సిటీ వైపు రాకపోకలు సాగిస్తున్నారు. వారంతా సిటీ బస్సులు, సొంత వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారు. మేడ్చల్ వాసులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఎంఎంటీఎస్ సర్వీస్ అందుబాటులోకి వచ్చినప్పటికీ అరకొర కనెక్టివిటీ వల్ల పాక్షిక సదుపాయంగానే మిగలనుందనే భావన కలుగుతోంది.
ఉందానగర్ నుంచి ఉన్నా...
● పాలు, కూరగాయలు తదితర వస్తువులను విక్రయించే చిరువ్యాపారులు ఉందానగర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. మేడ్చల్, మల్కాజిగిరి వైపు రాకపోకలు సాగించేవారు ఉన్నారు. ఉందానగర్, ఫలక్‌నుమా నుంచి వచ్చేవారు. లేదా మేడ్చల్, మల్కాజిగిరి ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారు సికింద్రాబాద్‌లో దిగి మరో రైలు మారాలి. దీంతో ఈ రూట్‌లోనూ ఇది అరకొర సదుపాయమే కానుంది.
● అలాగే ఉందానగర్ నుంచి నేరుగా లింగంపల్లి వరకు ఇప్పట్లో రైళ్లు అందుబాటులోకి రాకపోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఎంఎంటీఎస్ రెండో దశలో కొత్తగా రెండు రూట్‌లలో ఏకంగా ప్రధాని చేతుల మీదుగా రైళ్లను ప్రారంభించనున్నప్పటికీ వందశాతం కనెక్టివిటీ లేకపోవడంతో ప్రయాణికులకు పెద్దగా ప్రయోజనం ఉండకపోగా, అలంకారప్రాయంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెల్లాపూర్ రూట్ తెల్లారినట్టే..
ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా తెల్లాపూర్– బీహెచ్‌ఈఎల్ మధ్య కొత్తగా లైన్‌లను నిర్మించి రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. కానీ లింగంపల్లి నుంచి తెల్లాపూర్ మీదుగా ఉదయం ఒకటి, రాత్రి ఒకటి చొప్పున రెండు సర్వీసులు మాత్రమే నడిపారు. దీంతో ప్రయాణికులు పెద్దగా వినియోగించుకోలేకపోయారు. ప్రస్తుతం ఆ రూట్‌లో రైళ్లు తిరగడం లేదు.
ఇలా అయితే ఎంతో మేలు..
ఉత్తరం వైపు ఉన్న మేడ్చల్ నుంచి పడమటి వైపున ఉన్న లింగంపల్లి వరకు సుమారు 50 కిలోమీటర్ల వరకు రైళ్లను నడపడం వల్ల ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది.
దక్షిణం వైపున ఉన్న ఉందానగర్ నుంచి నేరుగా లింగంపల్లికి రైళ్లను నడిపితే ఈ రూట్‌లో కనెక్టివిటీ పెరుగుతుంది. నగరంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలను పడమటి వైపు ఉన్నప్రాంతాలతో పూర్తిస్థాయిలో అనుసంధానం చేసినట్లవుతుంది.మేడ్చల్ నుంచి ఉందానగర్ వరకు నేరుగా రైళ్లను ఏర్పాటు చేస్తే ఉత్తర– దక్షిణ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment