సాక్షి, సిటీబ్యూరో: ఎంఎంటీఎస్ కొత్త సొబగులను అద్దుకుంది. సరికొత్త సదుపాయాలతో, మరిన్ని భద్రతా ప్రమాణాలతో ప్రయాణికుల ముందుకు రానుంది. గులాబీ, తెలుపు రంగుల్లో రూపొందించిన సరికొత్త ఎంఎంటీఎస్ రైళ్లను బుధవారం ప్రారంభించనున్నారు. మెట్రో తరహా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కంప్యూటరైజ్డ్ కంట్రోలింగ్ వ్యవస్థ కలిగిన కొత్త మెట్రో రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. మహిళల కోసం కేటాయించిన బోగీల్లో సీసీటీవీలను ఏర్పాటు చేశారు.
సమయపాలన పాటించండి..
బుధవారం నుంచి కొత్త రైళ్లను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దక్షిణ మధ్య జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా రైళ్ల నిర్వహణపై మంగళవారం రైల్‌నిలయంలో సమీక్ష నిర్వహించారు. సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజనల్ మేనేజర్‌లు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎంఎంటీఎస్ రైళ్ల సమయపాలనకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని ఆయన ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైళ్ల జాప్యానికి తావు ఉండరాదన్నారు. రైళ్ల నిర్వహణ, సమయపాలనపైన క్షేత్రస్థాయి పరిశీలన కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. బుధవారం ఉదయం 4.30 గంటలకు, తిరిగి ఉదయం 6 గంటలకు కొత్త ఎంఎంటీఎస్ రైళ్లు ఫలక్‌నుమా–సికింద్రాబాద్–లింగంపల్లి మార్గం లో అందుబాటులోకి రానున్నాయి.
ఆధునిక హంగులతో..
ఆటోమేటిక్ అనౌన్స్‌మెంట్ వ్యవస్థ, జీపీఎస్ ఆధారిత రూట్ మ్యాపింగ్, రైల్వేస్టేషన్‌ల సమాచారం, ఎల్‌ఈడీ డిస్‌ప్లే వంటి ఆధునిక హంగులతో ఈ 12 బోగీల రైళ్లు అతి తక్కువ చార్జీలతో అత్యధిక దూరం రవాణా సదుపాయాన్ని అందజేయనున్నాయి. ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రస్తుతం 1.5 లక్షల మంది పయనిస్తున్నారు. అందుబాటులోకి రానున్న కొత్త రైళ్ల వల్ల ప్రయాణికుల సంఖ్య 2.5 లక్షల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. 30 శాతానికి పైగా ప్రయాణికుల భర్తీ రేషియో పెరుగుతుందన్నారు.
ఆధునాతన నియంత్రణ వ్యవస్థ..
కొత్త ఎంఎంటీఎస్ రైళ్లు పూర్తిస్థాయి ట్రైన్ కంట్రోల్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (టీసీఎంఎస్) ద్వారా నడుస్తాయి. దీనివల్ల పట్టాలపైన పరుగులు పెట్టే రైళ్ల కదలికలను మరింత కచ్చితంగా అంచనా వేసేందుకు అవకాశం ఉంటుంది. ఎక్కడ ఏ చిన్న అవాంతరం ఎదురైనా అధికార యంత్రాంగం సత్వరమే స్పందించి తగిన చర్యలు చేపడుతుంది. ఆధునాతన రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. దీనివల్ల విద్యుత్ బాగా ఆదా అవుతుంది. అన్ని బోగీల్లో వీఆర్‌ఎల్‌ఏ బ్యాటరీలను ఏర్పాటు చేశారు. దీంతో లైటింగ్ పుష్కలంగా ఉంటుంది. అలాగే గాలి, వెలుతురు బాగా వచ్చే విధంగా కోచ్‌ల లోపలి భాగాలను రూపొందించారు.
భద్రత పటిష్టం..
ఫలక్‌నుమా, ఉప్పుగూడ, యాఖుత్‌పురా తదితర స్టేషన్‌లలో రైళ్లపై తరచుగా రాళ్ల దాడులు జరుగుతున్నాయి. ఇది ప్రయాణికుల భద్రతకు పెద్ద సవాల్‌గా మారింది. గుర్తు తెలియని వ్యక్తులు, అసాంఘిక శక్తులు ఈ తరహా దాడులకు పాల్పడుతున్నాయి.
ఈ నేపథ్యంలో కొత్త రైళ్లకు ప్రత్యేకంగా గ్రిల్స్ ఏర్పాటు చేశారు. రాళ్లు విసిరినా ప్రయాణికులకు తాకకుండా జాగ్రత్తలు చేపట్టారు. మరోవైపు మహిళల బోగీల్లో సీసీటీవీలను ఏర్పాటు చేశారు. దీంతో మహిళల బోగీల్లోకి మగవారు ప్రవేశించడం, పోకిరీలు, ఈవ్‌టీజర్ల బెడద నుంచి రక్షణ లభించనుంది.
ఎల్‌ఈడీ డిస్‌ప్లే..
కొత్త ఎంఎంటీఎస్ రైళ్లలో లోపల, బయట ఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. ఎప్పటికప్పుడు స్టేషన్‌ల వివరాలు ప్రదర్శితమవుతాయి. మెట్రో రైళ్ల తరహాలో ఆటోమేటిక్ అనౌన్స్‌మెంట్ ఉంటుంది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో స్టేషన్ అనౌన్స్‌మెంట్ ఉంటుంది. అలాగే తరువాత రాబోయే స్టేషన్ అనౌన్స్‌మెంట్ కూడా వినిపిస్తుంది.
ఒక్కో ట్రైన్ ధర రూ.4 కోట్ల వరకు..
ప్రస్తుతం నగరంలోని ఫలక్‌నుమా–సికింద్రాబాద్–లింగంపల్లి, ఫలక్‌నుమా–నాంపల్లి–లింగంపల్లి, తదితర మార్గాల్లో 9 కోచ్‌లు ఉన్న 10 ఎంఎంటీఎస్ రైళ్లు ప్రతి రోజు 121 ట్రిప్పులు నడుస్తున్నాయి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు వివిధ మార్గాల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. 2003లో కేవలం 6 కోచ్‌లతో ప్రారంభించిన రైళ్లను 2010లో 9 కోచ్‌లకు పెంచారు. ఇప్పుడు 12 కోచ్‌లతో తయారు చేసిన 4 కొత్త రైళ్లు వచ్చేశాయి. ఒక్కో ట్రైన్ ధర రూ.4 కోట్ల వరకు ఉంటుంది. మరో 4 రైళ్లు త్వరలో నగరానికి రానున్నాయి. దీంతో 8 కొత్త రైళ్ల వల్ల ట్రిప్పుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ఎంఎంటీఎస్ రైళ్లలో 700 సీట్లు మాత్రమే ఉన్నాయి. మరో 2,000 మంది నిల్చొని ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంది. కొత్త రైళ్లలో 1150 సీట్లు ఉంటాయి. మరో 4,000 మంది నిల్చొని ప్రయాణం చేయవచ్చు.. అంటే ఒక ట్రిప్పులో ప్రయాణికుల సంఖ్య 2700 నుంచి ఏకంగా 5150 వరకు పెరిగే అవకాశం ఉంది. ఎంఎంటీఎస్ రెండో దశ సికింద్రాబాద్–బోయిన్‌పల్లి, పటాన్‌చెరు–తెల్లాపూర్, సికింద్రాబాద్–ఘట్కేసర్ మార్గాల్లో ఈ కొత్త రైళ్లను నడుపుతారు. దీంతో ప్రయాణికుల సంఖ్య కూడా ఇప్పుడు ఉన్న 1.5 లక్షల నుంచి 2.5 లక్షలకు పైగా పెరిగే అవకాశం ఉంది.
రూ.10 చార్జీ.. 40 కి.మీ ప్రయాణం..
కొత్త ఎంఎంటీఎస్ రైళ్లతో ప్రయాణికులకు మరింత మెరుగైన, నాణ్యమైన రవాణా సదుపాయం లభిస్తుంది. ఒకేసారి ఎక్కువ మంది ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంటుంది. ట్రిప్పులు కూడా బాగా పెరుగుతాయి. కేవలం రూ.10 గరిష్ట చార్జీలతో 40 కిలోమీటర్‌లకు పైగా రవాణా సదుపాయాన్ని అందజేస్తున్న రైళ్లు కేవలం ఎంఎంటీఎస్ రైళ్లే. – సీహెచ్ రాకేష్, సీపీఆర్వో, దక్షిణ మధ్య రైల్వే
Comments
Please login to add a commentAdd a comment