సాక్షి, హైదరాబాద్: ఎంఎంటీఎస్ సర్వీసుల సంఖ్య పెరిగింది. ప్రయాణికుల రద్దీకనుగుణంగా ప్రతి అరగంటకో రైలు చొప్పున అందుబాటులోకి రానుంది. మొదట్లో కోవిడ్ కారణంగా ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశారు. ఆ తర్వాత పునరుద్ధరించినప్పటికీ ప్రయాణికుల ఆదరణ లేకపోవడంతో సర్వీసులు రద్దయ్యాయి. కొద్దిరోజులుగా నగరంలోని అన్ని మార్గాల్లో ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఎంఎంటీఎస్ సర్వీసులను గణనీయంగా పెంచారు.
ఐటీ సంస్థలు చాలా వరకు పునరుద్ధరించడంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హైటెక్ సిటీకి రాకపోకలు సాగించే సాఫ్ట్‌వేర్ నిపుణులు, ఐటీ ఉద్యోగుల రద్దీ పెరిగింది. ప్రయాణికుల డిమాండ్ మేరకు సర్వీసులను పెంచినట్లు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరోవైపు ఎంఎంటీఎస్ రైళ్ల నిర్వహణపై ఇన్‌చార్జి జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ సైతం ప్రత్యేక దృష్టి సారించారు. అతి తక్కువ చార్జీలతో రవాణా సదుపాయాన్ని అందజేసే ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అర్ధరాత్రి వరకూ సర్వీసులు..
కోవిడ్ కారణంగా రద్దు చేసిన ఎంఎంటీఎస్ రైళ్ల సమయపాలనను కూడా పునరుద్ధరించారు. ఇక నుంచి తెల్లవారుజామున 4.30 గంటల నుంచి అర్ధరాత్రి 12.30 గంటల వరకు ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తాయి. గతేడాది జూన్ 21 నుంచే దశలవారీగా ఎంఎంటీఎస్ రైళ్లను ప్రవేశపెట్టారు. కొన్ని రూట్‌లలో ప్రయాణికుల డిమాండ్ లేకపోవడంతో తరచూ సర్వీసులను రద్దు చేశారు. ప్రస్తుతం పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకొని యథావిధిగా అర్ధరాత్రి వరకూ నడపాలని అధికారులు నిర్ణయించారు.
► ప్రస్తుతం ప్రతి రోజు 86 సర్వీసులు నడుస్తున్నాయి. ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్ వరకు, నాంపల్లి నుంచి లింగంపల్లి వరకు, లింగంపల్లి మీదుగా తెల్లాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు 29 రైల్వే స్టేషన్లను కవర్ చేస్తూ 50 కిలోమీటర్లకు పైగా సర్వీసులను విస్తరించారు.
చార్జీలు తక్కువ...
►ప్లాట్‌ఫాం చార్జీల కంటే తక్కువ చార్జీలతో ఎంఎంటీఎస్ సదుపాయం లభించనుంది. సాధారణంగా సిటీ బస్సుల్లో సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు రూ.40 వరకు చార్జీ ఉంటే ఎంఎంటీఎస్ రైళ్లలో కేవలం రూ.15. బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు తదితర వాహనాల కంటే తక్కువ చార్జీలతో ఎక్కువ వేగంతో నగరం నలువైపులా అందుబాటులో ఉన్న సర్వీసులను వినియోగించుకోవాలని జనరల్ మేనేజర్ కోరారు. టికెట్ బుకింగ్ కౌంటర్లతో పాటు ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లు, యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా కూడా టికెట్లను తీసుకోవచ్చని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment