MMTS stations
-
సాగర తీరంలో.. కోచ్ రెస్టారెంట్
హైదరాబాద్: రెస్టారెంట్ ఆన్ వీల్స్‌లో భాగంగా దక్షిణమధ్య రైల్వే ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్డు ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద అద్భుతమైన రైల్ కోచ్ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఉత్తర, దక్షిణాది వంటకాలతో అన్ని వర్గాల పర్యాటకులను ఆకట్టుకొనేవిధంగా దీన్ని తీర్చిదిద్దారు. ఈ రెస్టారెంట్‌కి వెళితే కదులుతున్న ట్రైన్లో కూర్చొని నచ్చిన రుచులను ఆస్వాదిస్తున్న అనుభూతి కలుగుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో హుస్సేన్‌సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన ఈ కోచ్ రెస్టారెంట్ సందర్శకులకు సరికొత్త అనుభూతిని కలుగజేస్తుందని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. టూరిస్ట్ హబ్‌గా నెక్లెస్‌రోడ్డు... ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు ప్రాంతాలు అంతర్జాతీయ పర్యాటక హంగులను సంతరించుకున్నాయి. ప్రతి రోజు వేలాది మంది సందర్శకులు, వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు తరలివస్తున్నారు. వీకెండ్స్, సెలవు రోజుల్లో పర్యాటకుల రద్దీ లక్షల సంఖ్యలో ఉంటుంది. నెక్లెస్‌రోడ్డులో ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన కోచ్ రెస్టారెంట్ సైతం పర్యాటకప్రియులను ఆకట్టుకోనుంది. వినియోగంలో లేని ఒక కోచ్‌లో ఈ కొత్త రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ రైల్ కోచ్ రెస్టారెంట్‌ను ఐదు సంవత్సరాల కాలానికి నగరానికి చెందిన మెసర్స్ బూమరాంగ్ సంస్థకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఐదేళ్లపాటు వీరే నిర్వహిస్తారు. -
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అరగంటకో ఎంఎంటీఎస్
సాక్షి, హైదరాబాద్: ఎంఎంటీఎస్ సర్వీసుల సంఖ్య పెరిగింది. ప్రయాణికుల రద్దీకనుగుణంగా ప్రతి అరగంటకో రైలు చొప్పున అందుబాటులోకి రానుంది. మొదట్లో కోవిడ్ కారణంగా ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశారు. ఆ తర్వాత పునరుద్ధరించినప్పటికీ ప్రయాణికుల ఆదరణ లేకపోవడంతో సర్వీసులు రద్దయ్యాయి. కొద్దిరోజులుగా నగరంలోని అన్ని మార్గాల్లో ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఎంఎంటీఎస్ సర్వీసులను గణనీయంగా పెంచారు. ఐటీ సంస్థలు చాలా వరకు పునరుద్ధరించడంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హైటెక్ సిటీకి రాకపోకలు సాగించే సాఫ్ట్వేర్ నిపుణులు, ఐటీ ఉద్యోగుల రద్దీ పెరిగింది. ప్రయాణికుల డిమాండ్ మేరకు సర్వీసులను పెంచినట్లు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరోవైపు ఎంఎంటీఎస్ రైళ్ల నిర్వహణపై ఇన్చార్జి జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ సైతం ప్రత్యేక దృష్టి సారించారు. అతి తక్కువ చార్జీలతో రవాణా సదుపాయాన్ని అందజేసే ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్ధరాత్రి వరకూ సర్వీసులు.. కోవిడ్ కారణంగా రద్దు చేసిన ఎంఎంటీఎస్ రైళ్ల సమయపాలనను కూడా పునరుద్ధరించారు. ఇక నుంచి తెల్లవారుజామున 4.30 గంటల నుంచి అర్ధరాత్రి 12.30 గంటల వరకు ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తాయి. గతేడాది జూన్ 21 నుంచే దశలవారీగా ఎంఎంటీఎస్ రైళ్లను ప్రవేశపెట్టారు. కొన్ని రూట్లలో ప్రయాణికుల డిమాండ్ లేకపోవడంతో తరచూ సర్వీసులను రద్దు చేశారు. ప్రస్తుతం పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకొని యథావిధిగా అర్ధరాత్రి వరకూ నడపాలని అధికారులు నిర్ణయించారు. ► ప్రస్తుతం ప్రతి రోజు 86 సర్వీసులు నడుస్తున్నాయి. ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్ వరకు, నాంపల్లి నుంచి లింగంపల్లి వరకు, లింగంపల్లి మీదుగా తెల్లాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు 29 రైల్వే స్టేషన్లను కవర్ చేస్తూ 50 కిలోమీటర్లకు పైగా సర్వీసులను విస్తరించారు. చార్జీలు తక్కువ... ►ప్లాట్‌ఫాం చార్జీల కంటే తక్కువ చార్జీలతో ఎంఎంటీఎస్ సదుపాయం లభించనుంది. సాధారణంగా సిటీ బస్సుల్లో సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు రూ.40 వరకు చార్జీ ఉంటే ఎంఎంటీఎస్ రైళ్లలో కేవలం రూ.15. బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు తదితర వాహనాల కంటే తక్కువ చార్జీలతో ఎక్కువ వేగంతో నగరం నలువైపులా అందుబాటులో ఉన్న సర్వీసులను వినియోగించుకోవాలని జనరల్ మేనేజర్ కోరారు. టికెట్ బుకింగ్ కౌంటర్లతో పాటు ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లు, యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా కూడా టికెట్లను తీసుకోవచ్చని పేర్కొన్నారు. -
ఎంఎంటీఎస్ మాల్స్..మల్టీప్లెక్స్
సాక్షి, హైదరాబాద్:నగరంలో ఇక రైల్వే మాల్స్ రాబోతున్నాయి. ఇప్పటివరకు ప్రయాణికుల రాకపోకలకు మాత్రమే పరిమితమైన రైల్వే స్టేషన్లలో షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, మల్టీప్లెక్స్ థియేటర్లు, హోటళ్లు, ఎంటర్టైన్మెంట్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా పలు రైల్వే జోన్లలో రైళ్లు, రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణకు కేంద్రం రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నగరంలోని ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లు, ఎంఎంటీఎస్ సర్వీసుల నిర్వహణను పూర్తిగా ప్రైవేటీకరించేందుకు రైల్వే బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీంతో ప్రస్తుతం మెట్రో రైళ్లను ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్న తరహాలోనే ఎంఎంటీఎస్ నిర్వహణ ఉంటుంది. మెట్రో స్టేషన్లు, సంబంధిత స్థలాల్లో మాల్స్ ఏర్పాటు చేసినట్లుగానే ఎంఎంటీఎస్ స్టేషన్లలోనూ రైల్వే మాల్స్ అందుబాటులోకి రానున్నాయి. రానున్న మూడేళ్లలో ఈ ప్రైవేటీకరణ పూర్తి చేయాలని రైల్వే నిర్ణయించింది. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన రవాణా సదుపాయాలను కల్పించడంతో పాటు ప్రైవేట్ సంస్థలు టికెట్టేతర ఆదాయాన్ని ఆర్జించేందుకు షాపింగ్‌మాల్స్, మల్లీప్లెక్స్ వంటి వాటిపై దృష్టి సారిస్తాయి. నగరంలో ప్రస్తుతం 26 ఎంఎంటీఎస్ స్టేషన్లు ఉన్నాయి. రెండో దశ పూర్తయితే 5 స్టేషన్లు ప్రారంభం కానున్నాయి. వీటిలో హైటెక్‌సిటీ, లింగంపల్లి, లక్డీకాపూల్, సంజీవయ్య పార్కు, బేగంపేట్, మలక్‌పేట్ వంటి స్టేషన్ల పరిధిలోని రైల్వే స్థలాల్లో ఈ తరహా షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్లు నిర్మించనున్నారు. ప్రస్తుతం నగరంలోని వివిధ మార్గాల్లో ప్రతిరోజూ 121 ఎంఎంటీఎస్ సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతిరోజూ 1.5 లక్షల మంది ప్రయాణికులు ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకుంటున్నారు. చార్జీలు పెరిగే అవకాశం.. ఎంఎంటీఎస్ సేవలను ప్రైవేటీకరించడం వల్ల ప్రయాణ చార్జీలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. రైల్వే స్థలాలను కమర్షియల్‌గా అభివృద్ధి చేయడం వల్ల టికెట్టేతర ఆదాయం లభిస్తుంది. 40 శాతం ఆదాయం టికెట్లపైన, మిగతా 60 శాతం టికెట్టేతర రూపంలో లభించే విధంగా ప్రైవేటీకరణ చర్యలు ఉంటాయి. స్థలాలను, రైళ్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల రైల్వేలపైన నిర్వహణ భారం తగ్గుతుంది. పైగా ప్రైవేట్ సంస్థల నుంచి లీజు రూపంలోనూ, అద్దెల ద్వారా ఆదాయం లభిస్తుంది. ఈ వ్యూహంతో పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ చర్యలను ప్రోత్సహిస్తున్నారు. కానీ రైల్వే కార్మిక, ఉద్యోగ సంఘాలు ఈ చర్యలను గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. నిధులు విడుదలలో జాప్యం.. నగర శివార్లను కలుపుతూ చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో ఫేజ్ చివరి దశకి చేరుకుంది. సికింద్రాబాద్–బొల్లారం, సికింద్రాబాద్–ఘట్కేసర్, మౌలాలి–సనత్‌నగర్, తెల్లాపూర్–పటాన్చెరు తదితర మార్గాల్లో రైల్వే లైన్ల విద్యుదీకరణ, లైన్ల డబ్లింగ్ పూర్తయింది. పలు చోట్ల ప్లాట్‌ఫామ్‌ల ఎత్తు పెంపు పనులను పూర్తి చేశారు. కొత్త స్టేషన్ల నిర్మాణం కూడా చివరి దశకు చేరుకుంది.త్వరలో రెండో ఫేజ్ కూడా అందుబాటులోకి రానుంది. రెండో దశ కోసం కొత్త రైళ్లు రావాల్సి ఉంది. కొత్త రైళ్లు వస్తే తప్ప రెండో దశ పట్టాలపైకి ఎక్కే అవకాశం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర సర్కార్ నుంచి అందాల్సిన సుమారు రూ.450 కోట్లకు పైగా నిధులు ఇంకా అందకపోవడం వల్లనే జాప్యం చోటుచేసుకుంటున్నట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.ఎంఎంటీఎస్ మొదటి, రెండో దశ ప్రాజెక్టుల్లో రైల్వే శాఖ 1/4 చొప్పున, రాష్ట్రం 2/3 చొప్పున నిధులను అందిస్తున్నాయి. ప్రైవేటీకరణ తప్పనిసరైతే ఈ ఒప్పందం ఎలా ఉంటుందనే అంశంపైనా స్పష్టత రావాల్సి ఉంది. -
ఎంఎంటీఎస్ స్టేషన్లలో షాపింగ్ కాంప్లెక్స్‌లు
⇒ మల్టీప్లెక్స్‌లు,ఎంటర్టైన్మెంట్ సెంటర్లు ⇒ వాణిజ్య సముదాయాలపై దృష్టి ⇒ రైల్వే ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని ఎంఎంటీఎస్ స్టేషన్లు కొత్త సోకులు అద్దు కోనున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రతిపాదించిన తరహాలో వాణిజ్య భవన సముదాయాలు అంతరించనున్నాయి. వీటి తోపాటు మల్టీప్లెక్స్ థియేటర్లు, ఎంటర్ టైన్మెంట్, షాపింగ్ కేంద్రాలు అందు బాటులోకి రానున్నాయి. రైల్వే సొంత స్థలా లను వాణిజ్య కార్యకలాపాల కోసం లీజుకు ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించాలనే లక్ష్యంతో అధికారులు ప్రతిపాద నలు సిద్ధం చేశారు. జంటనగరాల్లోని రైల్వే స్థలాలపై గతంలోనే సమగ్ర సర్వే చేసిన రైల్వే ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ ఈ దిశగా ప్రణాళికలను రూపొందించింది. నగరంలోని ప్రధానమైన ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లను ఆనుకొని ఉన్న స్థలాలను లీజుకు ఇవ్వడం ద్వారా ఏటా రూ.250 కోట్లకు పైగా ఆదాయం లభిస్తుందని అంచనా వేసింది. అదనపు ఆదాయమే లక్ష్యం... నిత్యం పర్యాటకులు, సందర్శకులతో రద్దీగా ఉండే నెక్లెస్‌రోడ్డు, సంజీవయ్య పార్కు, బేగంపేట్, ఖైరతాబాద్, లకడీకపూల్ ఎంఎంటీఎస్ స్టేషన్లలోని రైల్వే స్థలాలను వాణిజ్య సముదాయాలుగా అభివృద్ధి చేయవచ్చునని రైల్వే ల్యాండ్స్ డెవలప్మెంట్ అథారిటీ సూచించింది. ఈ సంస్థ అందజేసిన వివరాల ప్రకారం సంజీవయ్య పార్కు స్టేషన్‌కు ఆనుకొని సుమారు ఎకరం ఉంది. దీన్ని లీజుకిస్తే ఏటా రూ.45 కోట్ల ఆదాయం లభిస్తుందని భావిస్తోంది. నెక్లెస్‌రోడ్డు స్టేషన్ వద్దనున్న ఎకరం పైన మరో రూ.60 కోట్ల వరకు ఆర్జించవచ్చని ఆశిస్తోంది. అలాగే బేగంపేట్ రైల్వేస్టేషన్ వద్ద రెండు వేల గజాలుంది. ఖైరతాబాద్, లకడీకపూల్ స్టేషన్లలో ఒకటిన్నర ఎకరం ఉన్నట్లు అంచనా. ఒక్కో స్టేషన్లో లీజుకు ఇవ్వడం ద్వారా ఏటా రూ.40 నుంచి రూ.50 కోట్ల చొప్పున ఆదాయం లభిస్తుంది. ఈ ఐదు స్టేషన్‌న్లలోని స్థలాల లీజు ద్వారా సుమారు రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని తేల్చింది. రెండో దశలో మరిన్ని... రెండో దశలో సనత్‌నగర్, హైటెక్‌సిటీ, లింగంపల్లి, బోరబండ, నేచర్‌క్యూర్ తదితర రైల్వే స్టేషన్ల స్థలాలను కూడా వాణిజ్య పరంగా అభివృద్ధి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇతర స్థలాల్లోనూ... ఇవే కాకుండా... నగరంలోని వివిధ ప్రాంతాల్లో రైల్వేకు ఉన్న స్థలాలను కూడా వాణిజ్యపరంగా వినియోగంలోకి తేవాలని దక్షిణమధ్య రైల్వే భావిస్తోంది. సంగీత్ చౌరస్తాలో 2 ఎకరాలు, సికింద్రాబాద్ బ్లూ సీ హోటల్ ఎదురుగా ఉన్న 2 వేల గజాలు, కాచిగూడ రైల్వేస్టేషన్ పార్శిల్ విభాగం పక్కనున్న మరో 1,000 గజాల స్థలాన్ని ఇదే తరహాలో మల్టీప్లెక్స్‌లు, బడ్జెట్ హోటళ్ల వంటి వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించడం ద్వారా ఏటా రూ.500 కోట్ల వరకు ఆదాయం వస్తుందన్నది అధికారుల అంచనా. పరిశీలన దశలోనే ఉన్న ఇవి కార్యరూపం దాల్చేందుకు సమయం పట్టవచ్చు. -
రెల్వేస్టేషన్లలో ‘స్వైపింగ్’
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్లు, ఎంఎంటీఎస్ స్టేషన్లలో నగదు రహిత సేవలు మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. అన్ని రకాల క్రెడిట్, డెబిట్, రూపీ కార్డుల ద్వారా రైల్వే రిజర్వేషన్ టిక్కెట్లు పొందేందుకు దక్షిణమధ్య రైల్వే పరిధిలో మొత్తం 109 పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లు (స్వైప్ మిషన్లను) సోమవారం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నగరంలో 30 స్టేషన్లలో ఈ సదుపాయాన్ని కల్పించారు. సికింద్రాబాద్, నాంపల్లి, బేగంపేట్, కాచిగూడ రైల్వేస్టేషన్లతో పాటు లింగంపల్లి, చందానగర్, హఫీజ్‌పేట్, హైటెక్‌సిటీ, బోరబండ, భరత్‌నగర్, ఫతేనగర్, నేచర్‌క్యూర్ హాస్పిటల్, సంజీవయ్యపార్కు, జేమ్స్ స్ట్రీట్, సీతాఫల్మండి, ఆర్ట్స్ కాలేజ్, జామై ఉస్మానియా, విద్యానగర్, మలక్‌పేట్, డబీర్‌పురా, యాకుత్‌పురా, ఉప్పుగూడ, ఫలక్‌నుమా, లక్డికాఫూల్, ఖైరతాబాద్, నెక్లెస్‌రోడ్డు స్టేషన్లలో ప్రయాణికులు నగదు రహిత సేవలను వినియోగించుకోవచ్చు. అలాగే హై కోర్టు, తెలంగాణ అసెంబ్లీ, మెహిదీపట్నం, మౌలాలీ జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లోని ప్యాసింజర్ రిజర్వేషన్ కౌంటర్లలో కూడా ఈ మిషన్లను ఏర్పాటు చేశారు. -
‘మల్టీ’ టాస్క్!
► ఎంఎంటీఎస్ స్టేషన్లలో బహుళ అంతస్థుల భవనాలు ► మల్టీప్లెక్స్ థియేటర్లు, షాపింగ్ మాల్స్ ► ఏటా రూ.250 కోట్లకు పైగా ఆదాయం ► రైల్ డెవలప్మెంట్ అథారిటీ ప్రణాళికలు సాక్షి, సిటీబ్యూరో: ఎంఎంటీఎస్ స్టేషన్లు ఇక వాణిజ్య భవన సముదాయాలుగా అవతరించనున్నాయి. రవాణాతో పాటు సినిమాలు, ఎంటర్టైన్మెంట్, షాపింగ్ కేంద్రాలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. రైలు ప్రయాణికులతో పాటు సందర్శకులకు చక్కటి వినోదం, షాపింగ్ సదుపాయాన్ని అందజేయనున్నాయి. ప్రయాణికుల టిక్కెట్లపై వచ్చే ఆదాయం మాత్రమే కాకుండా... రైల్వే స్థలాలను వాణిజ్య కార్యకలాపాలకు లీజుకు ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించాలని దక్షిణ మధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని రైల్వే స్థలాలపై సమగ్ర సర్వే చేసిన రైల్ డెవలప్మెంట్ అథారిటీ వీటి అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించింది. నగరంలోని ప్రధాన ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లకు ఆనుకొని ఉన్న స్థలాల లీజుతో ఏటా రూ.250 కోట్లకు పైగా ఆదాయం లభించగలదని అంచనా వేసింది. అధికారులు ఈ దిశగా కార్యాచరణకు సన్నద్ధమవుతున్నారు. అంతా లీజు బేరమే... ఒక్కొక్క రైల్వే స్టేషన్లో దక్షిణ మధ్య రైల్వేకు అందుబాటులో ఉన్న స్థలాన్ని గుర్తించి వ్యాపార సంస్థలకు 45 ఏళ్లకు లీజుకు ఇవ్వాలని రైల్వే ల్యాండ్స్ డెవలప్మెంట్ అథారిటీ సూచిం చింది. దేశవ్యాప్తంగా రైల్వే స్థలాలపై సర్వేలు నిర్వహించి, వాటి అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించే ఈ సంస్థ (రైల్వేకు అనుబంధంగా పని చేస్తుంది.) ప్రతినిధుల బృందం ఇటీవల నగరంలో విస్తృతంగా పర్యటించింది. నిత్యం పర్యాటకులు, సందర్శకులతో రద్దీగా ఉండే నెక్లెస్ రోడ్డు, సంజీవయ్య పార్కు రైల్వేస్టేçషన్లతో పాటు, బేగంపేట్, ఖైరతాబాద్, లకిడీకాపూల్ ఎంఎంటీఎస్ స్టేషన్లలోని రైల్వే స్థలాలను వాణిజ్య సముదాయాలుగా అభివృద్ధి చేయవచ్చునని సూచించింది. రైల్వే ల్యాండ్స్ డెవలప్మెంట్ అథారిటీ అందించినlవివరాల ప్రకారం సంజీవయ్య పార్కు స్టేషన్‌కు ఆనుకొని సుమారు ఎకరా స్థలం ఉంది. దీన్ని లీజుకు ఇవ్వడం ద్వారా ఏటా రూ.45 కోట్లు లభిస్తుంది. నెక్లెస్ రోడ్డు స్టేషన్ వద్ద ఉన్న ఎకరంపై మరో రూ.60 కోట్లు ఆర్జించవచ్చు. బేగంపేట్ రైల్వేస్టేషÙన్ ప్రాంతంలో 2 వేల గజాలు ఉంది. ఖైరతాబాద్, లకిడీకాపూల్ స్టేషన్లలో ఒకటిన్నర ఎకరం ఉన్నట్లు అంచనా. ఒక్కో స్టేషన్లో రైల్వే స్థలాలను లీజుకు ఇవ్వడం ద్వారా ఏటా రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు లభిస్తుంది. ఈ ఐదు స్టేషన్లలోని స్థలాలను లీజుకు ఇవ్వగలిగితే రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు లభించగలదని రైల్వే ల్యాండ్స్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాథమిక అంచనా. రెండో దశలో సనత్ నగర్, హైటెక్ సిటీ, లింగంపల్లి, బోరబండ, నేచర్‌క్యూర్ తదితర స్టేషన్లను ఆనుకొని ఉన్న స్థలాలను వాణిజ్యపరంగా అభివృద్ధి చేయాలని అధికారులు భావిస్తున్నారు.