సాక్షి, హైదరాబాద్:నగరంలో ఇక రైల్వే మాల్స్ రాబోతున్నాయి. ఇప్పటివరకు ప్రయాణికుల రాకపోకలకు మాత్రమే పరిమితమైన రైల్వే స్టేషన్లలో షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, మల్టీప్లెక్స్ థియేటర్లు, హోటళ్లు, ఎంటర్‌టైన్‌మెంట్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా పలు రైల్వే జోన్లలో రైళ్లు, రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణకు కేంద్రం రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నగరంలోని ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లు, ఎంఎంటీఎస్ సర్వీసుల నిర్వహణను పూర్తిగా ప్రైవేటీకరించేందుకు రైల్వే బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీంతో ప్రస్తుతం మెట్రో రైళ్లను ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్న తరహాలోనే ఎంఎంటీఎస్ నిర్వహణ ఉంటుంది.
మెట్రో స్టేషన్లు, సంబంధిత స్థలాల్లో మాల్స్ ఏర్పాటు చేసినట్లుగానే ఎంఎంటీఎస్ స్టేషన్లలోనూ రైల్వే మాల్స్ అందుబాటులోకి రానున్నాయి. రానున్న మూడేళ్లలో ఈ ప్రైవేటీకరణ పూర్తి చేయాలని రైల్వే నిర్ణయించింది. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన రవాణా సదుపాయాలను కల్పించడంతో పాటు ప్రైవేట్ సంస్థలు టికెట్టేతర ఆదాయాన్ని ఆర్జించేందుకు షాపింగ్‌మాల్స్, మల్లీప్లెక్స్ వంటి వాటిపై దృష్టి సారిస్తాయి. నగరంలో ప్రస్తుతం 26 ఎంఎంటీఎస్ స్టేషన్లు ఉన్నాయి. రెండో దశ పూర్తయితే 5 స్టేషన్లు ప్రారంభం కానున్నాయి.
వీటిలో హైటెక్‌సిటీ, లింగంపల్లి, లక్డీకాపూల్, సంజీవయ్య పార్కు, బేగంపేట్, మలక్‌పేట్ వంటి స్టేషన్ల పరిధిలోని రైల్వే స్థలాల్లో ఈ తరహా షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్లు నిర్మించనున్నారు. ప్రస్తుతం నగరంలోని వివిధ మార్గాల్లో ప్రతిరోజూ 121 ఎంఎంటీఎస్ సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతిరోజూ 1.5 లక్షల మంది ప్రయాణికులు ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకుంటున్నారు.
చార్జీలు పెరిగే అవకాశం..
ఎంఎంటీఎస్ సేవలను ప్రైవేటీకరించడం వల్ల ప్రయాణ చార్జీలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. రైల్వే స్థలాలను కమర్షియల్‌గా అభివృద్ధి చేయడం వల్ల టికెట్టేతర ఆదాయం లభిస్తుంది. 40 శాతం ఆదాయం టికెట్లపైన, మిగతా 60 శాతం టికెట్టేతర రూపంలో లభించే విధంగా ప్రైవేటీకరణ చర్యలు ఉంటాయి.
స్థలాలను, రైళ్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల రైల్వేలపైన నిర్వహణ భారం తగ్గుతుంది. పైగా ప్రైవేట్ సంస్థల నుంచి లీజు రూపంలోనూ, అద్దెల ద్వారా ఆదాయం లభిస్తుంది. ఈ వ్యూహంతో పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ చర్యలను ప్రోత్సహిస్తున్నారు. కానీ రైల్వే కార్మిక, ఉద్యోగ సంఘాలు ఈ చర్యలను గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి.
నిధులు విడుదలలో జాప్యం..
నగర శివార్లను కలుపుతూ చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో ఫేజ్ చివరి దశకి చేరుకుంది. సికింద్రాబాద్–బొల్లారం, సికింద్రాబాద్–ఘట్కేసర్, మౌలాలి–సనత్‌నగర్, తెల్లాపూర్–పటాన్‌చెరు తదితర మార్గాల్లో రైల్వే లైన్ల విద్యుదీకరణ, లైన్ల డబ్లింగ్ పూర్తయింది. పలు చోట్ల ప్లాట్‌ఫామ్‌ల ఎత్తు పెంపు పనులను పూర్తి చేశారు. కొత్త స్టేషన్ల నిర్మాణం కూడా చివరి దశకు చేరుకుంది.త్వరలో రెండో ఫేజ్ కూడా అందుబాటులోకి రానుంది. రెండో దశ కోసం కొత్త రైళ్లు రావాల్సి ఉంది.
కొత్త రైళ్లు వస్తే తప్ప రెండో దశ పట్టాలపైకి ఎక్కే అవకాశం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర సర్కార్ నుంచి అందాల్సిన సుమారు రూ.450 కోట్లకు పైగా నిధులు ఇంకా అందకపోవడం వల్లనే జాప్యం చోటుచేసుకుంటున్నట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.ఎంఎంటీఎస్ మొదటి, రెండో దశ ప్రాజెక్టుల్లో రైల్వే శాఖ 1/4 చొప్పున, రాష్ట్రం 2/3 చొప్పున నిధులను అందిస్తున్నాయి. ప్రైవేటీకరణ తప్పనిసరైతే ఈ ఒప్పందం ఎలా ఉంటుందనే అంశంపైనా స్పష్టత రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment