multiplexs
-
రూ. 88 కోట్లకు పెరిగిన ఐనాక్స్ లీజర్ నష్టం
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో మల్టిప్లెక్స్ స్క్రీన్ల ఆపరేటింగ్ సంస్థ ఐనాక్స్ లీజర్ నికర నష్టం మరింత పెరిగి, రూ. 88 కోట్లకు చేరింది. కోవిడ్–19 సెకండ్ వేవ్ కట్టడిపరమైన ఆంక్షల కారణంగా సినిమా ప్రదర్శన వ్యాపారం దెబ్బతినడమే ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో నష్టం రూ. 68 కోట్లు. సమీక్షాకాలంలో కంపెనీ మొత్తం వ్యయాలు రూ. 95 కోట్ల నుంచి రూ. 170 కోట్లకు పెరిగాయి. ఐనాక్స్ లీజర్‌కు దేశవ్యాప్తంగా 70 నగరాల్లో 156 మల్టీప్లెక్స్‌ల్లో 658 స్క్రీన్లు నిర్వహిస్తోంది. 2021 జూలై నుంచి వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి అనుమతులు వచ్చే కొద్దీ క్రమంగా మల్టిప్లెక్స్‌లను తెరుస్తున్నట్లు తెలిపింది. క్యూ2లో కొత్తగా ఆరు స్క్రీన్లతో రెండు ప్రాపర్టీలు జతయినట్లు ఐనాక్స్ గ్రూప్ డైరెక్టర్ సిద్ధార్థ్ జైన్ తెలిపారు. అనిశ్చితితో కూడుకున్న పలు త్రైమాసికాల తర్వాత ఈ క్వార్టర్లో తిరిగి కార్యకలాపాల పునరుద్ధరణ దిశగా ప్రయాణం ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. సుమారు 10 శాతం ఆక్యుపెన్సీ రేటు, సగటు టికెట్ ధర రూ. 178, ఒక్కో వ్యక్తి చేసే వ్యయం (ఎస్‌పీహెచ్) రూ. 92గా నమోదైందని, ఇది కోవిడ్ పూర్వ స్థాయికి దాదాపు సమానమని జైన్ చెప్పారు. -
ఎంఎంటీఎస్ మాల్స్..మల్టీప్లెక్స్
సాక్షి, హైదరాబాద్:నగరంలో ఇక రైల్వే మాల్స్ రాబోతున్నాయి. ఇప్పటివరకు ప్రయాణికుల రాకపోకలకు మాత్రమే పరిమితమైన రైల్వే స్టేషన్లలో షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, మల్టీప్లెక్స్ థియేటర్లు, హోటళ్లు, ఎంటర్టైన్మెంట్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా పలు రైల్వే జోన్లలో రైళ్లు, రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణకు కేంద్రం రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నగరంలోని ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లు, ఎంఎంటీఎస్ సర్వీసుల నిర్వహణను పూర్తిగా ప్రైవేటీకరించేందుకు రైల్వే బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీంతో ప్రస్తుతం మెట్రో రైళ్లను ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్న తరహాలోనే ఎంఎంటీఎస్ నిర్వహణ ఉంటుంది. మెట్రో స్టేషన్లు, సంబంధిత స్థలాల్లో మాల్స్ ఏర్పాటు చేసినట్లుగానే ఎంఎంటీఎస్ స్టేషన్లలోనూ రైల్వే మాల్స్ అందుబాటులోకి రానున్నాయి. రానున్న మూడేళ్లలో ఈ ప్రైవేటీకరణ పూర్తి చేయాలని రైల్వే నిర్ణయించింది. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన రవాణా సదుపాయాలను కల్పించడంతో పాటు ప్రైవేట్ సంస్థలు టికెట్టేతర ఆదాయాన్ని ఆర్జించేందుకు షాపింగ్‌మాల్స్, మల్లీప్లెక్స్ వంటి వాటిపై దృష్టి సారిస్తాయి. నగరంలో ప్రస్తుతం 26 ఎంఎంటీఎస్ స్టేషన్లు ఉన్నాయి. రెండో దశ పూర్తయితే 5 స్టేషన్లు ప్రారంభం కానున్నాయి. వీటిలో హైటెక్‌సిటీ, లింగంపల్లి, లక్డీకాపూల్, సంజీవయ్య పార్కు, బేగంపేట్, మలక్‌పేట్ వంటి స్టేషన్ల పరిధిలోని రైల్వే స్థలాల్లో ఈ తరహా షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్లు నిర్మించనున్నారు. ప్రస్తుతం నగరంలోని వివిధ మార్గాల్లో ప్రతిరోజూ 121 ఎంఎంటీఎస్ సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతిరోజూ 1.5 లక్షల మంది ప్రయాణికులు ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకుంటున్నారు. చార్జీలు పెరిగే అవకాశం.. ఎంఎంటీఎస్ సేవలను ప్రైవేటీకరించడం వల్ల ప్రయాణ చార్జీలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. రైల్వే స్థలాలను కమర్షియల్‌గా అభివృద్ధి చేయడం వల్ల టికెట్టేతర ఆదాయం లభిస్తుంది. 40 శాతం ఆదాయం టికెట్లపైన, మిగతా 60 శాతం టికెట్టేతర రూపంలో లభించే విధంగా ప్రైవేటీకరణ చర్యలు ఉంటాయి. స్థలాలను, రైళ్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల రైల్వేలపైన నిర్వహణ భారం తగ్గుతుంది. పైగా ప్రైవేట్ సంస్థల నుంచి లీజు రూపంలోనూ, అద్దెల ద్వారా ఆదాయం లభిస్తుంది. ఈ వ్యూహంతో పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ చర్యలను ప్రోత్సహిస్తున్నారు. కానీ రైల్వే కార్మిక, ఉద్యోగ సంఘాలు ఈ చర్యలను గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. నిధులు విడుదలలో జాప్యం.. నగర శివార్లను కలుపుతూ చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో ఫేజ్ చివరి దశకి చేరుకుంది. సికింద్రాబాద్–బొల్లారం, సికింద్రాబాద్–ఘట్కేసర్, మౌలాలి–సనత్‌నగర్, తెల్లాపూర్–పటాన్చెరు తదితర మార్గాల్లో రైల్వే లైన్ల విద్యుదీకరణ, లైన్ల డబ్లింగ్ పూర్తయింది. పలు చోట్ల ప్లాట్‌ఫామ్‌ల ఎత్తు పెంపు పనులను పూర్తి చేశారు. కొత్త స్టేషన్ల నిర్మాణం కూడా చివరి దశకు చేరుకుంది.త్వరలో రెండో ఫేజ్ కూడా అందుబాటులోకి రానుంది. రెండో దశ కోసం కొత్త రైళ్లు రావాల్సి ఉంది. కొత్త రైళ్లు వస్తే తప్ప రెండో దశ పట్టాలపైకి ఎక్కే అవకాశం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర సర్కార్ నుంచి అందాల్సిన సుమారు రూ.450 కోట్లకు పైగా నిధులు ఇంకా అందకపోవడం వల్లనే జాప్యం చోటుచేసుకుంటున్నట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.ఎంఎంటీఎస్ మొదటి, రెండో దశ ప్రాజెక్టుల్లో రైల్వే శాఖ 1/4 చొప్పున, రాష్ట్రం 2/3 చొప్పున నిధులను అందిస్తున్నాయి. ప్రైవేటీకరణ తప్పనిసరైతే ఈ ఒప్పందం ఎలా ఉంటుందనే అంశంపైనా స్పష్టత రావాల్సి ఉంది. -
మల్టిఫ్లెక్స్‌లో పాప్‌కార్న్ ఇక దొరకదా?
హైదరాబాద్ : నగరంలో మల్టిఫ్లెక్స్‌లు ఎంతైనా కొంచెం కాస్ట్లీనే... పార్కింగ్ కాస్ట్.. సినిమానే కాదు.. ఇటు పాప్‌కార్న్ వంటి తినే స్నాక్స్ ధరలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. ఈ ధరల మోతను భరించలేని కొందరు హైదరాబాదీలు మల్టిఫ్లెక్స్‌లో పాప్‌కార్న్‌ను బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు. సినిమా హాల్స్‌లో పాప్‌కార్న్ ధరలు మరీ చుక్కలు చూపిస్తున్నాయని, మిడ్ సైజ్ ప్యాక్ ధర రూ.190, టబ్ రూ.270 వరకు ఉంటున్నాయని వాపోతున్నారు. జీహెచ్ఎంసీ ప్రమేయంతో మల్టిఫ్లెక్స్‌లో రేట్లను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. మీడియం ప్యాక్ రూ.210 అంటే, ఒక్కో కార్న్ ధర ఒక్క రూపాయి అన్నమాట. ఇంత భారీ మొత్తంలో ధరలను ఎవరు నిర్ణయించారని సినిమా చూడటానికి వెళ్తున్న ప్రేక్షకులు వర్తకులను ప్రశ్నిస్తున్నారు. ఈ ధరలు మరీ ఎక్కువగా ఉన్నాయని వర్తకులతో వాదనకు దిగుతున్నారు. అయినా మల్టిఫ్లెక్స్‌లో ధరలు మాత్రం దిగిరావడం లేదని ప్రేక్షకులు చెబుతున్నారు. ఒక్క పాప్‌కార్న్ ప్యాక్ ధర రూ.50 కంటే మించదని, ఇతరాత్ర వ్యయాలను కలుపుకున్నా.. వర్తకులు అదనంగా రూ.20 నుంచి రూ.30 చార్జ్ చేయొచ్చని ప్రేక్షకులంటున్నారు.కానీ వర్తకులు మరీ ఘోరంగా 300 శాతం అదనపు రేట్ విధిస్తున్నారని పేర్కొంటున్నారు. దీంతో సులభంగా ఒక్క షోకు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు వర్తకులు ఆర్జిస్తున్నారని చెప్పారు. ప్రేక్షకులకు ధరలు బాదుతూ రోజుకి లక్షల్లో వీరు అక్రమంగా సంపాదిస్తున్నారని పలువురు వాపోతున్నారు. ఈ ధరలపై విసుగెత్తిన కొందరు హైదరాబాదీలు సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు. మల్టిఫ్లెక్స్‌లో ధరలు దిగిరావాలని, లేనిపక్షంలో వాటిని బాయ్‌కాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.అయితే ధరలు తగ్గించమని అడగడానికి బదులుగా..పాప్‌కార్న్ కొనుగోలు చేయడం మానేయడంటూ వారిపై వర్తకులు మండిపడుతున్నారు. మల్టిఫ్లెక్స్‌లో తినే ఉత్పత్తులపై ధరలు నిర్ణయించడానికి జీహెచ్ఎంసీకి ఎలాంటి పాత్ర లేదని, ఇవి బిల్డింగ్ ఓనర్‌కు, కాంట్రాక్టర్‌కు మధ్య కుదిరిన ఒప్పందం అంటూ ఖరాకండీగా చెబుతున్నారు. ప్రేక్షకుల డిమాండ్ కు దిగొవచ్చి జీహెచ్ఎంసీ మల్టిఫ్లెక్స్‌లో వర్తకులు విధిస్తున్న ఈ స్నాక్ ఐటమ్స్ ధరలు నియంత్రిస్తుందో లేదో చూడాలి.