న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్‌లో మల్టిప్లెక్స్ స్క్రీన్‌ల ఆపరేటింగ్ సంస్థ ఐనాక్స్ లీజర్ నికర నష్టం మరింత పెరిగి, రూ. 88 కోట్లకు చేరింది. కోవిడ్–19 సెకండ్ వేవ్ కట్టడిపరమైన ఆంక్షల కారణంగా సినిమా ప్రదర్శన వ్యాపారం దెబ్బతినడమే ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో నష్టం రూ. 68 కోట్లు. సమీక్షాకాలంలో కంపెనీ మొత్తం వ్యయాలు రూ. 95 కోట్ల నుంచి రూ. 170 కోట్లకు పెరిగాయి. ఐనాక్స్ లీజర్‌కు దేశవ్యాప్తంగా 70 నగరాల్లో 156 మల్టీప్లెక్స్‌ల్లో 658 స్క్రీన్‌లు నిర్వహిస్తోంది.
2021 జూలై నుంచి వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి అనుమతులు వచ్చే కొద్దీ క్రమంగా మల్టిప్లెక్స్‌లను తెరుస్తున్నట్లు తెలిపింది. క్యూ2లో కొత్తగా ఆరు స్క్రీన్‌లతో రెండు ప్రాపర్టీలు జతయినట్లు ఐనాక్స్ గ్రూప్ డైరెక్టర్ సిద్ధార్థ్ జైన్ తెలిపారు. అనిశ్చితితో కూడుకున్న పలు త్రైమాసికాల తర్వాత ఈ క్వార్టర్‌లో తిరిగి కార్యకలాపాల పునరుద్ధరణ దిశగా ప్రయాణం ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. సుమారు 10 శాతం ఆక్యుపెన్సీ రేటు, సగటు టికెట్ ధర రూ. 178, ఒక్కో వ్యక్తి చేసే వ్యయం (ఎస్‌పీహెచ్) రూ. 92గా నమోదైందని, ఇది కోవిడ్ పూర్వ స్థాయికి దాదాపు సమానమని జైన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment