
సినిమా ప్రారంభానికి ముందు ప్రదర్శించే వాణిజ్య ప్రకటనల పట్ల చాలామంది ప్రేక్షకులు విసిగిపోతున్నారు. పలు నగరాల్లోని లగ్జరీ మల్టీప్లెక్స్‌ల్లో సినిమా చూసేందుకు రూ. 300 పైగా డబ్బు చెల్లించి థియేటర్‌కు వెళ్తుంటారు. అయితే, ముందుగా ప్రకటించిన సమయానికి సినిమా ప్రదర్శన ఉండదు. దీంతో వారి సమయం వృధా కావడమే కాకుండా.. ఒక్కోసారి ముందుగా వారు నిర్ణయించుకున్న పనులకు కూడా వెళ్లలేని పరిస్థితి ఎదురౌతుంది. ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొన్న బెంగళూరుకు చెందిన ఒకరు పీవీఆర్-ఐనాక్స్‌పై కేసు వేశాడు.
తన సంతోషం కోసం టికెట్ కొని సినిమాకు వెళ్తే.. పీవీఆర్-ఐనాక్స్ వారు 25 నిమిషాల పాటు యాడ్స్ వేసి తన సమయాన్ని వృథా చేశారని బెంగళూరు కన్జ్యూమర్ కోర్టులో అభిషేక్ ఎంఆర్ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. విచారించిన కోర్టు పీవీఆర్ సినిమాస్ వారికి షాకింగ్ తీర్పును వెల్లడించింది. 2023లో బెంగళూరుకు చెందిన పీవీఆర్-ఐనాక్స్‌లో 'సామ్ బహదూర్' సినిమా చూసేందుకు వెళ్లినట్లు ఫిర్యాదులో అభిషేక్ పేర్కొన్నారు. సినిమాకి ప్రారంభానికి ముందే దాదాపు 25 నిమిషాల పాటు యాడ్స్ ప్లే చేశారని ఆయన అన్నారు. దీంతో సినిమా ఆలస్యంగా ప్రారంభమైందని తెలిపారు. ఆ కారణం వల్ల సినిమా కూడా ఆలస్యంగానే పూర్తి అయ్యిందన్నారు. ఫలితంగా తాను అనుకున్న సమయానికి ఆఫీస్‌కు వెళ్లలేకపోయినట్లు కోర్టుకు ఆయన చెప్పుకొచ్చారు.
డిసెంబర్ 26, 2023న సాయంత్రం 4:05 గంటలకు షో కోసం మూడు టిక్కెట్‌లను రూ.825.66 చెల్లించి అభిషేక్ బుక్ చేసుకున్నాడు. సినిమా సాయంత్రం 6:30 గంటలకు ముగిసేలా షెడ్యూల్ చేయబడింది. తద్వారా అతను సమయానికి ఆఫీస్‌కు వెళ్లొచ్చని అనుకున్నారు. అయితే, సాయంత్రం 4 గంటలకు హాలులోకి అడుగుపెట్టినా.. 4:05 నుంచి 4:28 గంటల వరకు ప్రకటనలు మాత్రమే ప్రదర్శించారు. గతంలో కూడా తాను ఈ ఇబ్బంది ఎదుర్కొవడంతో ముందు జాగ్రత్తగా ఆ ప్రకటనలన్నీ తన ఫోన్‌లో చిత్రీకరించి వాటిని కోర్టుకు సమర్పించారు. షో టైమింగ్స్‌ను తప్పుగా చెప్పి, అక్రమంగా యాడ్స్ ప్లే చేసి లబ్ధిపొందేందుకు థియేటర్ యాజమాన్యం చూస్తుందని ఆరోపించారు. తన ఫిర్యాదులో బుక్‌మైషోను కూడా చేర్చారు.
పీవీఆర్- ఐనాక్స్‌పై కోర్టు సీరియస్ అయింది. వారిపై రూ. 1లక్ష జరిమానా విధిస్తూ బెంగళూరు కన్జ్యూమర్ కోర్టు తీర్పు ఇచ్చింది. వినియోగదారుడి విలువైన సమయాన్ని వృథా చేసే హక్కు మీకు ఎవరిచ్చారంటూ హెచ్చరించింది. ఆపై ఫిర్యాదుదారుడు అభిషేక్‌కు రూ. 50వేల నష్ట పరిహారం చెల్లించాలని తెలుపుతూ.. అతని మానసి క్షోభకు బదులుగా రూ. 8వేల పరిహారం ఆపై కేసు ఫైలింగ్ కోసం అతను చేసిన ఇతర ఖర్చులకు రూ. 10వేలు ఇవ్వాలని కోర్టు ఆదేశాలిచ్చింది. టికెట్ మీద చూపిన సమయానికే సినిమా ప్రదర్శించాలని పీవీఆర్-ఐనాక్స్‌కు బెంగళూరు కన్జ్యూమర్ కోర్టు తెలిపింది. పీఎస్ఏ (పబ్లిక్ సర్వీస్ అనౌన్స్మెంట్స్) కింద ఉన్న యాడ్స్ మాత్ర చట్ట పరిధిలోనే రన్ చేయాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment