మల్టిఫ్లెక్స్లో పాప్కార్న్ ఇక దొరకదా?
హైదరాబాద్ : నగరంలో మల్టిఫ్లెక్స్లు ఎంతైనా కొంచెం కాస్ట్లీనే... పార్కింగ్ కాస్ట్.. సినిమానే కాదు.. ఇటు పాప్కార్న్ వంటి తినే స్నాక్స్ ధరలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. ఈ ధరల మోతను భరించలేని కొందరు హైదరాబాదీలు మల్టిఫ్లెక్స్లో పాప్కార్న్ను బాయ్కాట్ చేయాలని సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు. సినిమా హాల్స్లో పాప్కార్న్ ధరలు మరీ చుక్కలు చూపిస్తున్నాయని, మిడ్ సైజ్ ప్యాక్ ధర రూ.190, టబ్ రూ.270 వరకు ఉంటున్నాయని వాపోతున్నారు. జీహెచ్ఎంసీ ప్రమేయంతో మల్టిఫ్లెక్స్లో రేట్లను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. మీడియం ప్యాక్ రూ.210 అంటే, ఒక్కో కార్న్ ధర ఒక్క రూపాయి అన్నమాట. ఇంత భారీ మొత్తంలో ధరలను ఎవరు నిర్ణయించారని సినిమా చూడటానికి వెళ్తున్న ప్రేక్షకులు వర్తకులను ప్రశ్నిస్తున్నారు. ఈ ధరలు మరీ ఎక్కువగా ఉన్నాయని వర్తకులతో వాదనకు దిగుతున్నారు. అయినా మల్టిఫ్లెక్స్లో ధరలు మాత్రం దిగిరావడం లేదని ప్రేక్షకులు చెబుతున్నారు.
ఒక్క పాప్కార్న్ ప్యాక్ ధర రూ.50 కంటే మించదని, ఇతరాత్ర వ్యయాలను కలుపుకున్నా.. వర్తకులు అదనంగా రూ.20 నుంచి రూ.30 చార్జ్ చేయొచ్చని ప్రేక్షకులంటున్నారు.కానీ వర్తకులు మరీ ఘోరంగా 300 శాతం అదనపు రేట్ విధిస్తున్నారని పేర్కొంటున్నారు. దీంతో సులభంగా ఒక్క షోకు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు వర్తకులు ఆర్జిస్తున్నారని చెప్పారు. ప్రేక్షకులకు ధరలు బాదుతూ రోజుకి లక్షల్లో వీరు అక్రమంగా సంపాదిస్తున్నారని పలువురు వాపోతున్నారు.
ఈ ధరలపై విసుగెత్తిన కొందరు హైదరాబాదీలు సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు. మల్టిఫ్లెక్స్లో ధరలు దిగిరావాలని, లేనిపక్షంలో వాటిని బాయ్కాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.అయితే ధరలు తగ్గించమని అడగడానికి బదులుగా..పాప్కార్న్ కొనుగోలు చేయడం మానేయడంటూ వారిపై వర్తకులు మండిపడుతున్నారు. మల్టిఫ్లెక్స్లో తినే ఉత్పత్తులపై ధరలు నిర్ణయించడానికి జీహెచ్ఎంసీకి ఎలాంటి పాత్ర లేదని, ఇవి బిల్డింగ్ ఓనర్కు, కాంట్రాక్టర్కు మధ్య కుదిరిన ఒప్పందం అంటూ ఖరాకండీగా చెబుతున్నారు. ప్రేక్షకుల డిమాండ్ కు దిగొవచ్చి జీహెచ్ఎంసీ మల్టిఫ్లెక్స్లో వర్తకులు విధిస్తున్న ఈ స్నాక్ ఐటమ్స్ ధరలు నియంత్రిస్తుందో లేదో చూడాలి.