రెల్వేస్టేషన్లలో ‘స్వైపింగ్’
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్‌లు, ఎంఎంటీఎస్ స్టేషన్‌లలో నగదు రహిత సేవలు మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. అన్ని రకాల క్రెడిట్, డెబిట్, రూపీ కార్డుల ద్వారా రైల్వే రిజర్వేషన్ టిక్కెట్‌లు పొందేందుకు దక్షిణమధ్య రైల్వే పరిధిలో మొత్తం 109 పాయింట్ ఆఫ్ సేల్ మిషన్‌లు (స్వైప్ మిషన్‌లను) సోమవారం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నగరంలో 30 స్టేషన్‌లలో ఈ సదుపాయాన్ని కల్పించారు. సికింద్రాబాద్, నాంపల్లి, బేగంపేట్, కాచిగూడ రైల్వేస్టేషన్‌లతో పాటు లింగంపల్లి, చందానగర్, హఫీజ్‌పేట్, హైటెక్‌సిటీ, బోరబండ, భరత్‌నగర్, ఫతేనగర్, నేచర్‌క్యూర్ హాస్పిటల్, సంజీవయ్యపార్కు, జేమ్స్ స్ట్రీట్, సీతాఫల్‌మండి, ఆర్ట్స్ కాలేజ్, జామై ఉస్మానియా, విద్యానగర్, మలక్‌పేట్, డబీర్‌పురా, యాకుత్‌పురా, ఉప్పుగూడ, ఫలక్‌నుమా, లక్డికాఫూల్, ఖైరతాబాద్, నెక్లెస్‌రోడ్డు స్టేషన్‌లలో ప్రయాణికులు నగదు రహిత సేవలను వినియోగించుకోవచ్చు. అలాగే హై కోర్టు, తెలంగాణ అసెంబ్లీ, మెహిదీపట్నం, మౌలాలీ జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లోని ప్యాసింజర్ రిజర్వేషన్ కౌంటర్‌లలో కూడా ఈ మిషన్‌లను ఏర్పాటు చేశారు.