సాక్షి,సిటీబ్యూరో: ఎంఎంటీఎస్ రైళ్లలో శుక్రవారం రైల్వే రక్ష క దళాలు విస్తృత తనిఖీలు నిర్వహించాయి. ప్రయాణికుల భద్రతపై దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అసంతృప్తిని వ్యక్తం చేసిన నేపథ్యంలో అప్రమత్తమైన వివిధ విభాగాలు ఆ అంశంపైనే ప్రధానంగా దృష్టి సారించాయి. రైల్వేస్టేషన్లు, ఎంఎంటీఎస్ రైళ్లలో భద్రతా సిబ్బందిని పెంచారు. ముఖ్యంగా మహిళా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని పలు ఎంఎంటీఎస్ రైళ్లలో ఆర్‌పీఎఫ్ నిర్వహించిన తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన పలువురు ప్రయాణికులను పోలీసులు అదుపులోకి తీసుకొని జరిమానాలు విధించారు. మొత్తం 79 మందిని విచారించి రూ.10 వేల వరకు జరిమానా విధించినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. కొందరు వృద్ధులు, చిన్నారులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు పేర్కొన్నారు.