
సాక్షి, సిటీబ్యూరో: మీరు రోజూ ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణం చేస్తుంటారా? అయితే మీరు నిశ్చింతగా స్టేషన్‌కు వెళ్లండి. నిర్ణీత సమయానికంటే అరగంట ఆలస్యంగా వెళ్తేనే ట్రైన్ వస్తుంది. అంతేకాదు.. ఒకవేళ వస్తుందో? రాదో? కూడా తెలియని పరిస్థితి నెలకొంది. నగరంలో కొంతకాలంగా ఎంఎంటీఎస్ రైళ్ల సమయపాలన ఇలా ఉంది మరి! నిత్యం అరగంట ఆలస్యంగా రైళ్లు నడుస్తుండగా, మరోవైపు సాంకేతిక కారణాలతో ట్రిప్పులు కూడా రద్దవుతున్నాయి. దీంతో ప్రతిరోజు ఎంఎంటీఎస్‌ను నమ్ముకొని స్టేషన్‌లకు చేరుకునే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు సకాలంలో ఆఫీస్‌లకు చేరుకోలేకపోతున్నారు. ఇక ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో అకస్మాత్తుగా ట్రిప్పులు రద్దయితే.. తర్వాత వచ్చే రైలు
కోసం మరో గంట ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. కొంతకాలంగా ఎంఎంటీఎస్ రైళ్ల సమయపాలన మెరుగుపడిందని అధికారులు చెబుతుండగా... వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగానే ఉందని ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
కారణాలు అనేకం...
నగరంలో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన రవాణా సదుపాయాన్ని కల్పించే లక్ష్యంతో పట్టాలెక్కించిన ఎంఎంటీఎస్ రైళ్లకు రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని అప్పట్లో రైల్వేశాఖ నిర్ణయించింది. కానీ పట్టాలపై ఎక్కడ ఏ చిన్న అవాంతరం వచ్చినా వెంటనే ఆగిపోయేది ఎంఎంటీఎస్ రైలునే. వందల కొద్దీ ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లు జంటనగరాల నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లి తదితర రైల్వేస్టేషన్‌లలో ప్రధాన రైళ్లకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చి ప్లాట్‌ఫామ్‌లను కేటాయిస్తారు. అందుకోసం ఎంఎంటీఎస్ రైళ్లను స్టేషన్‌లకు దూరంగా నిలిపివేస్తారు. ప్లాట్‌ఫామ్‌లపైన ఉన్న రైళ్లు కదిలితే తప్ప ఎంఎంటీఎస్ వచ్చేందుకు అవకాశం ఉండదు. సికింద్రాబాద్ స్టేషన్‌లో ఈ ఇబ్బంది ఎక్కువగా ఉంది. దీంతో ఫలక్‌నుమా–లింగంపల్లి మధ్య నడిచే రైళ్లకు బ్రేక్ పడుతోంది. అలాగే నాంపల్లి–లింగంపల్లి మధ్య నడిచే ఎంఎంటీఎస్ సర్వీసులు కూడా తరచూ స్తంభిస్తున్నాయి. మరోవైపు పట్టాలపై తరచూ చేపట్టే మరమ్మతులు కూడా ఎంఎంటీఎస్‌కు బ్రేకులు వేస్తున్నాయి. దీంతో కొన్ని మార్గాల్లో నెలల తరబడి ఎంఎంటీఎస్ సర్వీసులను పాక్షికంగా రద్దు చేస్తున్నారు. అరగంట వ్యవధిలో రెండు రైళ్లు రావాల్సిన మార్గంలో ఒక ట్రిప్పు రద్దు కావడంతో గంట సమయంలో కేవలం ఒక్క రైలుమాత్రమే వస్తోంది. అంటే రెండు రైళ్ల ప్రయాణికులు ఒకే దాంట్లో వెళ్లాల్సి వస్తోంది. పైగా ఆలస్యం తప్పడం లేదు.
ప్రాధాన్యమేదీ?
ఎంఎంటీఎస్ రైళ్లను నగరంలో 2003లో ప్రవేశపెట్టారు. ఫలక్‌నుమా–సికింద్రాబాద్–లింగంపల్లి, ఫలక్‌నుమా–నాంపల్లి–లింగంపల్లి తదితర మార్గాల్లో ప్రస్తుతం ప్రతిరోజు 121 సర్వీసులు నడుస్తున్నాయి. 1.6 లక్షల మందికి పైగా ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకుంటున్నారు. ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభించిన తొలినాళ్లలోనే ఈ రైళ్ల ప్రాధాన్యతను గుర్తించి ఎంఎంటీఎస్ కోసం ఒక ప్రత్యేక లైన్ ఉండాలని ప్రతిపాదించారు. ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, సూపర్‌ఫాస్ట్ రైళ్ల రాకపోకలతో సంబంధం లేకుండా అన్ని రూట్లలో ఒక లైన్ కేటాయించాలని అప్పట్లో అధికారులు నిర్ణయించారు. కానీ దశాబ్దాలు గడిచినా ఆ ప్రతిపాదన అమల్లోకి రాలేదు. మరోవైపు ఎంఎంటీఎస్ రెండో దశలోనూ అదే నిర్లక్ష్యం కనిపిస్తోంది. 2013లో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఎప్పటి వరకు రెండో దశ రైళ్లు నడుస్తాయో తెలియదు. నిధుల కొరత వెంటాడుతోంది. నగర శివార్లను కలుపుతూ రెండో దశను చేపట్టారు. ఘట్కేసర్, పటాన్‌చెరు, ఉందానగర్, మేడ్చల్ తదితర ప్రాంతాలను ఎంఎంటీఎస్‌తో అనుసంధానం చేసేందుకు దీన్ని నిర్మిస్తున్నారు. ఎంఎంటీఎస్ కంటే ఆలస్యంగా ప్రారంభించిన మెట్రో రైళ్లు దశల వారీగా పరుగులు తీస్తుండగా ఎంఎంటీఎస్ మాత్రం అక్కడే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment