దూరం...దూరం | mmts declining popularity | Sakshi
Sakshi News home page

దూరం...దూరం

Published Mon, Nov 16 2015 11:41 PM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

mmts declining popularity

ఎంఎంటీఎస్‌కు తగ్గుతున్న ఆదరణ
ఆరు నెలల్లో 9 శాతం తగ్గిన ఆక్యుపెన్సీ
రాకపోకల్లో జాప్యం,
బస్‌లకు లింక్ లేకపోవడమే కారణం

 
సిటీబ్యూరో:  నగర ప్రయాణికులకు ఎంఎంటీఎస్ రైళ్లు రానురానూ దూరమవుతున్నాయి. నగర జనాభా, విస్తరిస్తున్న కాలనీలకు అనుగుణంగా వీటి ప్రయాణికుల సంఖ్య పెరగాల్సి ఉండగా... అందుకు విరుద్ధంగా కొంతకాలంగా తగ్గుముఖం పడుతోంది. ఒకప్పుడు నిత్యం లక్షా 60 వేల మంది ప్రయాణికులు ఉంటే... ఇప్పుడు ఆ సంఖ్య లక్షా 30 వేలకు తగ్గింది. ఆక్యుపెన్సీ రేషియో 9 శాతం పడిపోయినట్లు ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్త ప్రకటించడం గమనార్హం. రాకపోకల్లో జాప్యంతో చాలా మంది ఐటీ ఉద్యోగులు, ఇతర వర్గాల ప్రయాణికులు ఎంఎంటీఎస్‌కు దూరమయ్యారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం హైటెక్ సిటీకి రాకపోకలు సాగించే సుమారు 100 మంది ఉద్యోగులు రైళ్ల జాప్యం కారణంగా హైటెక్ సిటీకే తమ నివాసాలను మార్చుకోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. 2003లో ఈ రైళ్లను ప్రవేశపెట్టినప్పుడు రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని, అర నిమిషమైనా ఆలస్యానికి తావు లేకుండా నడపాలని  లక్ష్యంగా నిర్దేశించారు. కానీ అనతి కాలంలోనే ఆ లక్ష్యం నీరుగారింది.

ఎందుకు తగ్గిపోతున్నాంటే...
 ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వరకు, నాంపల్లి నుంచి ఫలక్‌నుమా, లింగంపల్లి నుంచి నాంపల్లి వరకు వివిధ మార్గాల్లో నడుస్తున్న ఎంఎంటీఎస్ రైళ్లకు ఒక ప్రత్యేక లైన్ లేదు. ప్రధాన రైళ్లు ప్లాట్‌ఫామ్ నుంచి వెళితే తప్ప ఇవి ముందుకు కదలలేవు. దీంతో నిత్యం అరగంట నుంచి 45 నిమిషాల వరకు ఆలస్యంగా నడుస్తున్నాయి.ఒక్క సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి మార్గంలో తప్ప మిగతా రూట్లలో ఎంఎంటీఎస్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల కూడా రైళ్ల రాకపోకల్లో జాప్యం నెలకొంటోంది.  చాలా స్టేషన్‌లలో ఒకేవైపు బుకింగ్ కౌంటర్‌లు ఉండడం వల్ల టిక్కెట్ తీసుకున్న ప్రయాణికులు ప్లాట్‌ఫామ్‌కు మరోవైపునకు సకాలంలో చేరుకోలేక రైళ్లు అందుకోలేకపోతున్నారు.

 బస్ కనెక్టివిటీ లేదు...
  నగరంలోని 26 ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్‌లలో చాలా వాటికి సరైన బస్సు సదుపాయం లేదు. వీటిలో పయనించాలంటే కనీసం 2, 3 కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. లేదా ఆటోల్లో వెళ్లాలి. ఎంఎంటీఎస్ చార్జీలతో పోల్చుకుంటే ఆటో చార్జీలు చాలా ఎక్కువ. దీంతో బస్సుల్లో వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నారు.  లింగంపల్లి, చందానగర్, బోరబండ, నేచర్‌క్యూర్ హాస్పిటల్, ఆర్ట్స్ కాలేజీ, ఉప్పుగూడ, ఫలక్‌నుమా, తదితర స్టేషన్‌లకు బస్సులు అందుబాటులో లేవు.నగరంలో 2003 నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంఎంటీఎస్‌కు, ఆర్టీసీకి మధ్య సరైన సమన్వయం లేకపోవడం గమనార్హం.ప్రధాన రహదారులకు ఆనుకొని ఉన్న లకిడికాఫూల్, ఖైరతాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ వంటి కొన్ని స్టేషన్‌లు మినహా మూడొంతుల స్టేషన్‌లకు రోడ్డు సదుపాయం లేదు. ఆటోలు మాత్రమే వెళ్తాయి. లేదంటే కాలినడకే.

 అడుగులు ఇలా...
  పెరుగుతున్న జనాభా, రోడ్లపై వాహనాల రద్దీ, ప్రయాణికుల అవసరాలు, అన్నిటికీ మించి నగరాన్ని పట్టిపీడిస్తున్న వాహన కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఎంఎంటీఎస్‌కు శ్రీకారం చుట్టింది. మొదటి దశలో సుమారు రూ.69.50 కోట్ల వ్యయంతో 2003లో ఈ రైళ్లు పట్టాలెక్కాయి.  25 వేల మంది ప్రయాణికులు, 30 సర్వీసులతో ప్రారంభమైన ఎంఎంటీఎస్ ప్రస్తుతం 121 సర్వీసులకు పెరిగాయి.సగటున 1.4 లక్షల మంది ఈ రైళ్లను వినియోగించుకుంటున్నారు.  హైటెక్ సిటీ నుంచి పాత నగరం వరకు సాఫ్ట్‌వేర్ నిపుణులు, ప్రభుత్వ, ప్రైవేట్  ఉద్యోగులు, చిరు వ్యాపారులు, కూలీలు, తదితర అన్ని వర్గాలకు ఈ రైళ్లు ఉపయోగకరంగా ఉన్నాయి.
 
 తగ్గిపోతున్న ప్రయాణికుల సంఖ్య
 గత 7 నెలల కాలంలో సగటు ప్రయాణికుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు, 2014 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు నమోదైన గణాంకాల ప్రకారం ఒక్క మేలో తప్ప మిగతా అన్ని నెలల్లోనూ ప్రయాణికుల సంఖ్య తగ్గుతూనే ఉంది. గత సంవత్సరం సెప్టెంబర్‌లో రోజుకు 1.61 లక్షల మంది పయనిస్తే ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఆ సంఖ్య 1.47 లక్షలకు పడిపోయింది.

 ప్రాధాన్యం పెరగాలి :
 ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్లకు దీటుగా ఎంఎంటీఎస్ రైళ్లకు ప్రాధాన్యం పెంచాలి. ఎక్స్‌ప్రెస్‌ల కోసం ఎంఎంటీఎస్‌లను నిలిపివేయడం వల్ల బాగా ఆలస్యమవుతోంది. దీంతో  ప్రయాణికులు ఎంఎంటీఎస్ వైపు రావడానికి వెనుకడుగు వేస్తున్నారు.
 బాలకిషోర్, సాఫ్ట్‌వేర్ నిపుణులు
 
 నిర్వహణలో నిర్లక్ష్యం తొలగిపోవాలి :
 ఎంఎంటీఎస్ రైళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం తొలగిపోవాలి. ఒకప్పటి కంటే ఇప్పుడు పారదర్శత పెరి గింది. కానీ ఇంకా పెరగాలి. వేల సంఖ్యలో రైళ్ల కోసం ఎదురు చూస్తున్నారనే స్పృహ చాలా ముఖ్యం.
 విజయరాఘవన్, సాఫ్ట్‌వేర్ నిపుణులు
 
 బుకింగ్ కౌంటర్‌లు పెంచాలి:

 నగరంలోని 26 ఎంఎంటీఎస్ స్టేషన్‌లలో చాలా వర కు ప్లాట్‌ఫామ్‌కు ఒకవైపే టిక్కెట్ బుకింగ్ కౌంటర్‌లు ఉన్నా యి. రెండో వైపు  లేవు. దీం తో ప్రయాణికులు సకాలంలో రైలును అందుకోలేక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆశ్రయించవలసి వస్తోంది.                 సీతారామ్,హైటెక్ సిటీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement