
విమానాశ్రయం వరకు ఎంఎంటీఎస్‌లు వద్దు!
* అక్కడికి 3.2 కి.మీ. ముందే ఆగిపోవాలి
* ఎంఎంటీఎస్ విస్తరణలో జీఎంఆర్ మడతపేచీ
* రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన దక్షిణ మధ్య రైల్వే
* రైలు దిగాక మళ్లీ ప్రైవేటు వాహనాలను ఆశ్రయించే దుస్థితి ఏంటంటూ ఆగ్రహం
* అలా చేస్తే రూ.180 కోట్ల కొత్తలైన్ నిరుపయోగమేనని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: నగరం నుంచి శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఎంఎంటీఎస్ రైళ్లు నడపాలనే దక్షిణ మధ్య రైల్వే ఆలోచనకు జీఎంఆర్ బ్రేకులు వేసింది. విమానాశ్రయం వరకు రైలు రావటానికి వీళ్లేదని, అక్కడికి 3.2 కిలోమీటర్ల దూరంలోనే స్టేషన్ నిర్మించి అక్కడి వరకే రైల్వే సేవలు పరిమితం చేయాలని మడతపేచీ పెట్టింది. ఇటీవల జీఎంఆర్-రైల్వే అధికారుల అంతర్గత భేటీలో ఈమేరకు షరతు విధించింది. సరిగ్గా ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు పట్టాలెక్కేవేళ ఈ వ్యవహారం తెరపైకి రావటంతో బిత్తరపోయిన దక్షిణ మధ్య రైల్వే దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది.
భారీ ఖర్చుతో ఎంఎంటీఎస్ లైనును విస్తరించి... విమానాశ్రయానికి 3.2 కిలోమీటర్ల దూరంలోనే ఆపేస్తే అసలు ఆ ప్రాజెక్టు లక్ష్యం నెరవేరదని, అక్కడ రైలు దిగే ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకోవాలంటే మళ్లీ ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంటుందని తాజాగా దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ తెలంగాణ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ దృష్టికి తేవ టంతో ఈ వ్యహారం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా జీఎంఆర్ షరతులు విధిస్తూ... ఎంఎంటీఎస్ రెండో దశ లక్ష్యాన్నే నీరుగారుస్తోందని ఆయన సీఎస్‌తో పేర్కొన్నారు. రైలు దిగగానే నేరుగా విమానాశ్రయంలోకి మార్గం ఉండాలని, సామగ్రి తరలించేందుకు అక్కడి నుంచే ట్రాలీల ఏర్పాటు ఉండాలని, అంతర్జాతీయంగా ఇదే పద్ధతి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. జీఎంఆర్ సంస్థ యూజవూన్యంతో మాట్లాడి విమానాశ్రయం వరకు ఎంఎంటీఎస్ రైలు వెళ్లే విధంగా చూడాలని కోరారు.
ఇదీ సంగతి...: ప్రస్తుతం ఫలక్‌నుమా వరకు ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్నాయి. ప్రాజెక్టు విస్తరణ(రెండోదశ)లో భాగంగా ఫలక్‌నుమా నుంచి శంషాబాద్ సమీపంలోని ఉందానగర్ స్టేషన్ వరకు, అక్కడి నుంచి అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పనులు చేపట్టాల్సి ఉంది. పనులు ప్రారంభించేందుకు అంతా సిద్ధమవుతున్న వేళ జీఎంఆర్ నిబంధనతో గందరగోళం నెలకొంది. కొత్త లైను, ఎలక్ట్రిఫికేషన్ తదితరాలకు సంబంధించి కిలోమీటరుకు రూ.10 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఫలక్‌నుమా నుంచి ఉందానగర్ 13 కి.మీ., అక్కడి నుంచి విమానాశ్రయం దారిలో జీఎంఆర్ సూచిస్తున్న ప్రాంతం మరో 5 కి.మీ. ఉంటుంది. వెరసి 18 కి.మీ.మేర పనులు నిర్వహించేందుకు రూ.180 కోట్ల ఖర్చవుతుంది. ఇంత ఖర్చు చేసి రైలు విమానాశ్రయానికి 3.2 కి.మీ.దూరంలోనే నిలిచిపోతే ఉపయోగమేంటని రైల్వే వాదిస్తోంది.
భవిష్యత్తు విస్తరణ అవసరాల దృష్ట్యా తనకు భూముల అవసరం ఉంటుందని, అం దులో రైల్వే స్టేషన్ నిర్మిస్తే సమస్యలు ఉత్పన్నమవుతాయనే కోణంలో జీఎంఆర్ వాదిస్తోంది. ఇందులో ప్రైవేటు టాక్సీ ఆపరేటర్ల ఒత్తిడి కూడా ఉండొచ్చని రైల్వే అభిప్రాయపడుతోంది. ఈ మొత్తం విషయాన్ని ప్రభుత్వం ముందుంచింది. ఇందులో స్పష్టత వస్తేనే పను లు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుందని, తాము పనులు చేపట్టేందుకు సర్వం సిద్ధం చేసుకున్నామని దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ గురువారం తెలిపారు.