మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
మా ప్రభుత్వాన్ని కూలుస్తామంటే చూస్తూ ఊరుకోం
నల్లగొండ: ‘కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేస్తే బీఆర్‌ఎస్ పార్టీ పునాదులు లేకుండా చేస్తాం. కాంగ్రెస్ కార్యకర్తలు పదేళ్ల పాటు కష్టపడి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. మీరు మా ప్రభుత్వాన్ని కూలగొడతామంటే చూస్తూ ఊరుకోరు’అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది.. రేవంత్ బీజేపీలోకి పోతాడు అని కేటీఆర్ అంటే.. రాజకీయాలు తెలియని బచ్చాగాడులే అనుకున్నాం. పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నీవు.. ప్రజాస్వామ్య బద్ధంగా పూర్తి మెజారీ్టతో ఏర్పడిన ప్రభుత్వం సంవత్సరంలో పడిపోతుందని ఏ విధంగా అన్నావు’అని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ప్రశ్నించారు. ‘మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఏం కుట్రలు చేస్తున్నావు.
మేము గేట్లు తెరిస్తే 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక మిగిలేది కుటుంబంలోని మీ బంధువులైన ఎమ్మెల్యేలే’అని మంత్రి అన్నారు. ‘నీ కూతురు లిక్కర్ కేసులో తీహార్ జైలులో ఉంది. ఇంకా బుద్ధి రాలేదా’అని మండిపడ్డారు. అవినీతి కేసుల్లో తండ్రీ కొడుకులు జైలుకు పోక తప్పదన్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడి, భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు విన్న నీచులని విమర్శించారు.
కేసీఆర్‌ది దొంగ దీక్ష..
కేసీఆర్ తెలంగాణ ఉద్యమం సమయంలో డీ విటమిన్ టాబ్లెట్ వేసుకుని దొంగ దీక్ష చేసి.. చావు నోట్లో తలకాయ పెట్టానని ప్రజలను మోసం చేశారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. ‘నువ్వొక పాస్‌పోర్టు దొంగవు.. డబ్బులు దోచుకున్నవు. నీలాంటోడే సీఎం అయినప్పుడు. రైతు కుటుంబం నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డి జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, ఎంఎల్‌సీగా, ఎంపీగా పనిచేశారు. ఆయన సీఎం కాకూడదా’? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ సీట్లలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ సర్కార్‌ను కూల్చడంలో కేసీఆర్ పాత్ర
‘కేసీఆర్ మమ్మల్ని వెంటాడతా అంటుండు. ఆయన ముసలోడు. మాకు ఏ కట్టే అవసరం లేదు. మేముబలంగా ఉన్నాం. మేమే వెంటాడి వేటాడతాం’అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడంలో కేసీఆర్ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. జూన్ 5 నుంచి పాలన స్పీడ్ చేస్తామని, ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. రూ.2 లక్షల రుణమాఫీని కూడా అమలు చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment