నల్లగొండలో కోమటిరెడ్డి, భూపాల్‌రెడ్డి మధ్యే కీలక పోరు | - | Sakshi
Sakshi News home page

నల్లగొండలో కోమటిరెడ్డి, భూపాల్‌రెడ్డి మధ్యే కీలక పోరు

Published Tue, Nov 28 2023 1:38 AM | Last Updated on Tue, Nov 28 2023 8:51 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన పోలింగ్‌కు గడువు దగ్గరపడింది. 30న ఉదయం నుంచే పోలింగ్‌ జరగనుండగా.. అభ్యర్థుల పోల్‌ మేనేజ్‌మెంట్‌కు సమయం రెండు రోజులు ఉంది. మంగళవారం సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. 29వ తేదీన కూడా సభలు సమావేశాలు మినహా ఇంటింటి ప్రచారం చేసుకునే వీలు ఉంది. అయితే ఇప్పటివరకు నిర్వహించిన ప్రచారం ఆధారంగా ఇంకా తాము ఏయే పట్టణాలు, మండలాలు, గ్రామాల్లో బలహీనంగా ఉన్నామో తెలుసుకొని పార్టీ శ్రేణులను రంగంలోకి దింపాయి. కొన్ని చోట్ల నువ్వా నేనా అన్నట్లుగా, మరికొన్ని చోట్ల త్రిముఖ పోటీ ఉంది.  

నల్లగొండ జిల్లాలో మూడింట సై అంటే సై
►నల్లగొండ నియోజకవర్గంలో ఇద్దరి మధ్యే పోటీ నెలకొంది. ఇక్కడ బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థులైన కంచర్ల భూపాల్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్యే కీలక పోరు సాగుతోంది. బీజేపీ నుంచి మాదగోని శ్రీనివాస్‌గౌడ్, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ (ఏఐఎఫ్‌బీ) పార్టీ నుంచి పిల్లి రామరాజుయాదవ్‌ బరిలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ సంప్రదాయ ఓట్లు బీజేపీకే పడనుండగా, ఆయన అదనంగా ఏ మేరకు ఓట్లను సాధిస్తారన్నది పోలింగ్‌ రోజే తేలనుంది. మరోవైపు పిల్లి రామరాజుయాదవ్‌ యాదవ సామాజికవర్గంతోపాటు బీసీల ఓట్లు తనకు పడేలా ప్రయత్నిస్తున్నారు. ఈయన చీల్చే ఓట్లు.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపోటముల్లో ప్రధానం 
కానున్నాయి. 
► నకిరేకల్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిరుమర్తి 
లింగయ్య, కాంగ్రెస్‌ అభ్యర్థి వేముల వీరేశం మధ్య హోరాహోరీగా పోటీ సాగుతోంది. ఇక్కడ చేసిన అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ధీమాగా ఉండగా, కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న జోష్, మాజీ ఎమ్మెల్యేగా తనకున్న వ్యక్తిగత అనుచరవర్గ బలంతో గెలుపు సాధిస్తానన్న ధీమాతో కాంగ్రెస్‌ అభ్యర్థి ఉన్నారు. 

►   నాగార్జునసాగర్‌లోనూ ఇద్దరి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్‌ అభ్యర్థి కుందూరు జైవీర్‌రెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీ కేడర్, తన తండ్రి జానారెడ్డి చరిష్మా తనను కచ్చితంగా గెలిపిస్తుందన్న ధీమాలో ఉన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ నియోజవర్గ అభివృద్ధికి తాను తీసుకుకొచి్చన నిధులు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలే తనను గెలిపిస్తాయనే నమ్మకంతో ఉన్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ బీజేపీ, ఇతర పార్టీలు భారీ ప్రభావం చూపుతాయన్న అంచనాలు లేవు.

మిర్యాలగూడ, మునుగోడు,దేవరకొండలో ట్రయాంగిల్‌
► మిర్యాలగూడలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు తాను చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వ్యక్తిగతంగా తమకున్న పట్టుతో గెలుస్తానని భావిస్తుండగా, కాంగ్రెస్‌ అభ్యర్థి లక్ష్మారెడ్డి కూడా తన వ్యక్తిగత చరిష్మా, పార్టీ వేవ్‌ పైనే ఆధార పడ్డారు. ఇదే నియోజకవర్గం నుంచి మూడుసార్లు గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే, సీపీఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి తన వ్యక్తిగత చరిష్మాతోపాటు పార్టీకి ఉన్న బలంతో గెలుస్తానన్న ధీమాలో ఉన్నారు.
 
► మునుగోడులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, బీజేపీ అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి మధ్య పోరు నెలకొంది. ఉప ఎన్నికల తరువాత సీఎం ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గంలో చేపట్టిన చేసిన అభివృద్ధి పనులు, 
సంక్షేమ కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి భావిస్తుండగా, నియోజకవర్గంలో తనకున్న వ్యక్తిగత చరిష్మా, కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న క్రేజ్‌ తనను గెలిపిస్తుందని కాంగ్రెస్‌ అభ్యర్థి భావిస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. బీజేపీ సంప్రదాయ ఓట్లతోపాటు ఆయన చీల్చే ఇతర ఓట్లే ఈ ఎన్నికల్లో అక్కడ ప్రధానం కాబోతున్నాయి. 

► దేవరకొండలో కాంగ్రెస్‌ అభ్యర్థి బాలునాయక్, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రవీంద్రకుమార్‌ మధ్య ప్రధాన పోటీ ఉండగా, బీజేపీ అభ్యర్థి కేతావత్‌ లాలూ నాయక్‌ గట్టి పోటీ ఇస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. 

యాదాద్రిలో ముక్కోణం
►    భువనగిరి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. భువనగిరిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి తాను చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపైనే ఆశ పెట్టుకోగా, కాంగ్రెస్‌ పార్టీ నుంచి కుంభం అనిల్‌ కుమార్‌రెడ్డి తమ పార్టీకి ఉన్న వేవ్‌ పైనే ఆశ పెట్టుకున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళుతూ గెలుపొందాలని భావిస్తున్నారు. 

► ఆలేరు నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి నెలకొంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే గత పదేళ్లలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తనను మూడోసారి గెలిపిస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బీర్ల అయిలయ్య.. పార్టీ జోష్, ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని భావిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి పడాల శ్రీనివాస్‌ కూడా ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను తనను గెలిపిస్తాయన్న నమ్మకంతో ఉన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement