నల్లగొండ టూటౌన్ : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు డబ్బులను మంచినీళ్లలా ఖర్చు పెట్టిన విషయం బహిరంగ రహస్యమే. ప్రత్యర్థులను చిత్తు చేసి ఎలాగైనా గెలవాలనే టార్గెట్ పెట్టుకొని అభ్యర్థులు తమ పార్టీలకు చెందిన వార్డు, గ్రామ ముఖ్య నాయకుల (ఇన్‌చార్జి) ద్వారా ఓటర్లకు మద్యం, డబ్బులు, మాంసం పంపిణీ చేశారు. కానీ కొందరు చోటా నాయకులు డబ్బులు పంపిణీ చేసే సమయంలో డబ్బులను నొక్కినట్లు ఆయా పార్టీలకు చెందిన సొంత మనుషులే అభ్యర్థుల దృష్టికి తీసుకుపోయినట్లు తెలిసింది.
అవకాశంపోతే మళ్లీ దొరకదనే విధంగా కొందరు ఓటర్లకు పూర్తిస్థాయిలో పంపకాలు చేయకుండా జేబులు నింపుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నిచోట్ల జనాలను ఓటు వేయమని కూడా అడగలేదని ఓటర్లు చెబుతున్నారు. కొన్ని చోట్ల సొంత పార్టీలకు చెందిన కార్యకర్తలకు సైతం డబ్బులు పంచకపోవడంతో.. ఇన్‌చార్జిల తీరు వివాదాస్పదంగా మారింది. నల్లగొండ పట్టణంలో కొందరు ఓటర్లు వార్డు ఇన్‌చార్జిలను డబ్బుల విషయంపై నిలదీసిన ఘటనలు సైతం ఉన్నాయి.
డబ్బులు కాజేసిన వారిపై నేతల నజర్..
ఓటర్లకు పంచమని ఇచ్చిన డబ్బులు ఎంత మందికి చేరాయనే వివరాలను ఆయా పార్టీల అభ్యర్థులు సేకరిస్తున్నారు. ఒక్కో గ్రామంలో ఎంత మందికి ఇచ్చారు.. ఇవ్వకుండా నొక్కిన డబ్బులు ఎన్ని, తమ దగ్గర డబ్బులు తీసుకొని ప్రత్యర్థి పార్టీకి సహకరించిన వారెందరు అనే వివరాలను రాబడుతున్నారు. అభ్యర్థులు ఇచ్చిన డబ్బులు, వారికి వచ్చే ఓట్ల శాతం తదితర వివరాలను క్రోడీకరించడంతో పాటు స్థానిక నాయకత్వం ద్వారా సమచారం సేకరిస్తున్నారు.
డబ్బులు నొక్కి తమకు హ్యాండ్ ఇచ్చిన వారికి రానున్న రోజుల్లో చెక్ పెట్టే ప్రయత్నం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డబ్బులు నొక్కిన వారిపై ఫిర్యాదులు వెల్లువెత్తగా కొన్ని చోట్ల ఇప్పటికే సదరు నాయకులకు అభ్యర్థులు ఫోన్‌లు చేసి గట్టిగా క్లాస్ పీకినట్లు తెలిసింది. ఒకరిద్దరు అభ్యర్థులు అయితే డబ్బులు పంచని వారిపై తీవ్ర ఆగ్రహావేశాలతో అంతు చూస్తామని హెచ్చిరించినట్లు సామాజిక మాధ్యమాల్లో సైతం బహిర్గతం అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment