సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు తడిసి మోపైడెంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య ఈసారి తీవ్ర పోటీ నెలకొంది. దీంతో అభ్యర్థులు సభలు సమావేశాల నిర్వహణకు అధిక మొత్తంలో డబ్బులు వెచ్చించారు. మరోవైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు డబ్బుల పంపిణీపాటు గిఫ్ట్‌లు, చికెన్, మటన్, మందు వంటి వాటిలో ప్రలోభ పెట్టారు. ఇందుకోసం రూ.కోట్లు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కొందరు అభ్యర్థులు ధైర్యంగా ఖర్చు చేయగా, మరికొందరు అప్పులు చేసి మరీ ఖర్చు పెట్టారు. ఇంకొందరైతే ఆ ఖర్చులను తట్టుకోలేక, ఓటర్లకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేక చేతులెత్తాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.
నామినేషన్ల రోజు నాటి నుంచే..
నామినేషన్ల పర్వం ప్రారంభమైన నాటి నుంచి ఖర్చుల ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటి నుంచి అభ్యర్థులంతా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఏ ఊరికి వెళ్లినా వందలాది మందిని పిలిపించుకున్నారు. ఒక్కోక్కరికి రూ.200 నుంచి రూ.300 చెల్లించారు. గ్రామాల్లో రోజూ ఆయా పార్టీల అభ్యర్థులు కొంత మందిని టీమ్‌గా ఏర్పాటు చేసి ఇల్లిల్లూ తిరుగుతూ తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేయాలని స్టిక్కర్లు అంటిస్తూ.. కరపత్రాలు పంచుతూ ప్రచారం చేశారు.
బూత్‌ల వారీగా డబ్బుల పంపిణీ..
ప్రచార ఖర్చులకు తోడు బూత్‌లో ప్రచారం చేసే వారి ఖర్చుల నిమిత్తం రోజుకు ఒక పార్టీ బూత్‌కు రూ.5 వేల చొప్పున ఇవ్వగా, మరో పార్టీ రూ.10 వేలకు పైగా చెల్లించింది. వార్డు లీడర్లకు, ముఖ్యమైన వారికి సాయంత్రమైతే మందు పార్టీల ఖర్చు అదనంగా పెట్టుకోవాల్సి వచ్చిందని ఓ నాయకుడు వివరించారు. ఈ ఖర్చులను కొంత మంది అభ్యర్థులు తట్టుకోలేక నాలుగైదు రోజుల పాటు బూత్‌లలో డబ్బుల పంపిణీ నిలిపివేశారు.
మందు, విందులు అదనం..
నామినేషన్ల ప్రక్రియ నాటి నుంచే గ్రామాలు, వార్డుల వారీగా కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలతో పాటు ఆయా వృత్తి సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. వారికి మందు, విందు ఏర్పాటు చేశారు. కొందరు రూ.500 చొప్పున అక్కడే పంపిణీ చేశారు.
పోలింగ్‌కు ముందు డబ్బుల పంపిణీ
పోలింగ్‌కు ముందు రోజు నుంచి అభ్యర్థులు భారీగా డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఒక్కో నియోజకవర్గంలో సగటున లక్ష మందికిపైగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు అభ్యర్థులు ఓటుకు రూ.వేయి, రూ.1500 పంపిణీ చేయగా, మరికొందరు రూ.200 నుంచి రూ.800 వరకు ఇచ్చారు. వీటితో పాటు మద్యం ఆఫ్, ఫుల్ బాటిళ్లను కూడా పంపిణీ చేశారు. కొందరు రూ.2 వేల చొప్పున పంపిణీ చేస్తే.. ఇంకొందరు రూ.2,500 పంపిణీ చేసినట్లు తెలిసింది. రెండు మూడు నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులే డబ్బుల్లేక చేతులెత్తేసినట్లు చర్చ జరుగుతోంది. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయని పార్టీల కోసం ఓటర్లు చివరి వరకు ఎదురుచూసి, డబ్బులు ఇచ్చిన వారికి అనుకూలంగా వ్యవహరించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment