మోసపూరిత వైఖరిని అంతటా ప్రచారం చేస్తున్నారు
రూ.2 లక్షల రుణమాఫీపై సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు లేఖ
50 శాతం మంది రైతులకు కూడా మాఫీ కాలేదు
30 రకాల షరతులు పెట్టి రైతులను అనర్హులుగా చేశారు
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ విషయంలో తెలంగాణ రైతులతోపాటు మొత్తం దేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తప్పుదారి పట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.2 లక్షల పంట రుణాలను విజయవంతంగా మాఫీ చేసినట్టు మోసపూరిత వైఖరిని దేశవ్యాప్తంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి వైఖరిని ఎండగడుతూ హరీశ్‌రావు ఆదివారం బహిరంగలేఖ రాశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టించే విధానాలను అనుసరిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరిని దేశ ప్రజల దృష్టికి తెచ్చేందుకు లేఖ రాస్తున్నట్టు పేర్కొన్నారు.
లేఖలో ఏముందంటే....
‘రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2023 డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. హామీని నిలబెట్టుకోని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో రుణమాఫీ గడువును ఈ ఏడాది ఆగస్టు 15 వరకు పెంచింది. కానీ రూ.2 లక్షల రుణమాఫీ పూర్తిగా జరిగిందని సీఎం రేవంత్ చేసిన ప్రకటన పూర్తి అబద్ధమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. రూ.లక్ష లోపు రుణం 2.99 లక్షల మందికి, రూ.లక్షన్నర లోపు 1.30లక్షల మందికి, రూ.2లక్షల వరకు 65,231 మందికి మాత్రమే మాఫీ అయ్యింది. ఎస్‌బీఐ సమాచారం ప్రకారం 50 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ జరగలేదు. ఇతర బ్యాంకుల్లోనూ ఇదే పరిస్థితి.
రూ.2లక్షలకు పైబడి చెల్లించినా...
రూ.2 లక్షలకు పైగా రుణం ఉంటే రైతులు పైబడిన మొత్తాన్ని చెల్లిస్తే రూ.2 లక్షలు ప్రభుత్వం మాఫీ చేస్తుందని హామీ ఇచ్చింది. రైతులు ఈ మొత్తాన్ని చెల్లించినా రుణమాఫీ జరగలేని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. మరోవైపు చాలా మంది రైతులు సీఎం మాటను నమ్మి పంట రుణమాఫీకి అర్హత కోసం ప్రైవేట్ రుణాలు అధిక వడ్డీకి తీసుకున్నారు. అయితే రుణమాఫీకి ప్రభుత్వం 31 రకాల షరతులు పెట్టి రైతులను అనర్హులుగా చేశారు. బీఆర్‌ఎస్ పాలనలో రైతుబంధు ద్వారా రూ.72వేల కోట్లు ఇచ్చాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి దసరా ఇది. ఈ ఖరీఫ్ పంటకు సంబంధించిన పంట పెట్టుబడి సాయం ఇప్పటికీ ఇవ్వలేదు’అని హరీశ్‌రావు తన లేఖలో పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం కింద ఎస్‌బీఐ ఇచి్చన వివరాలు, రూ.2 లక్షలకు మించిన రుణాన్ని చెల్లించిన రైతుల బ్యాంకు రశీదులను లేఖకు జత చేశారు.
కాంగ్రెస్ మోసాలను అలయ్ బలయ్‌లో చర్చించండి
దసరాకు గ్రామాలకు వస్తున్న కుటుంబసభ్యులు, స్నేహితులతో అలయ్ బలయ్ తీసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాల గురించి చర్చించాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు హరీశ్‌రావు ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలును పక్కన పెట్టడంతోపాటు వృద్ధులకు ఆసరా పెన్షన్ కూడా పెంచలేదన్నారు. రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాల అమలు నిలిచిపోయిందని, ధాన్యం బోనస్ బోగస్‌గా మారిందని చెప్పారు. ఏటా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, నిరుద్యోగ భృతికి అతీగతీ లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment