22,37,848 ఖాతాలకు రూ.17,933.19 కోట్ల నిధులు విడుదల చేశామన్న మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
ఏదైనా కారణంతో మాఫీకాని రైతుల వివరాలు సేకరిస్తాం
అలాంటివారు వ్యవసాయ అధికారులకు తగిన రికార్డులు సమర్పించాలి
ఫిర్యాదులను నెల రోజుల్లో పరిశీలించి అర్హులకు రుణమాఫీ వర్తింపజేస్తాం
రాజకీయ నేతల తప్పుడు ప్రచారం నమ్మొద్దని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్/ నల్లగొండ టౌన్: తాము ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో రూ.2 లక్షలలోపు రుణాలున్న రైతులందరికీ రుణమాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. రాష్ట్రంలోని 3,292 బ్యాంకుల బ్రాంచీలు, 909 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుంచి సేకరించిన పంట రుణాల వివరాలతో.. డిసెంబర్ 9వ తేదీని కటాఫ్‌గా తీసుకుని రుణమాఫీ అమలు చేశామని వివరించారు.
ఈ మేరకు శనివారం మంత్రి తుమ్మల ఒక ప్రకటన విడుదల చేశారు. రుణమాఫీ విధివిధానాలను ప్రకటించిన మూడు రోజుల్లోనే తొలివిడత కింద రూ.లక్ష లోపు రుణాలున్న 11.50లక్షల మంది రైతులకు రూ.6,098.93 కోట్లు, రెండో విడతలో రూ.1.50 లక్షలలోపు రుణాలున్న 6,40,823 ఖాతాదారులకు రూ.6190.01 కోట్లు, పంద్రాగస్టు నాడు రూ.2లక్షలలోపు రుణాలున్న 4,46,832 ఖాతాల్లో రూ.5,644.24 కోట్లు.. కలిపి మొత్తంగా 22.37 లక్షల ఖాతాల్లో రూ.17,933.19 కోట్లను జమ చేయడం ద్వారా వారందర్నీ రుణవిముక్తులను చేశామని తెలిపారు.
తగిన రికార్డులిస్తే మాఫీ చేస్తాం..
రేషన్‌కార్డు కేవలం కుటుంబ నిర్ధారణ కోసమే పరిగణనలోకి తీసుకున్నామని, అది మాఫీకి ప్రామాణికం కాదని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఆధార్‌కార్డులో తప్పులు, రేషన్‌కార్డు లేనివారు, ఇతర కారణాలతో రూ.2 లక్షల్లోపు రుణమాఫీ కాని వారు దగ్గరలోని వ్యవసాయ అధికారిని సంప్రదించి, తగిన రికార్డులు సమర్పిస్తే త్వరలో రుణమాఫీ వర్తింపజేస్తామని వివరించారు. రూ.2 లక్షల కంటే అధికంగా రుణాలున్నవారు.. సదరు అధిక మొత్తాన్ని బ్యాంకు లో జమచేస్తే, వారికి రుణమాఫీ చేయడానికి సిద్ధమవుతున్నామని తెలిపారు.
కానీ రైతులను అయోమయానికి గురిచేసేలా ప్రతిపక్ష నాయకులు ప్రవర్తించడం దురదృష్టకరమని మండిపడ్డారు. తొలి, రెండో విడతలలో తప్పులు దొర్లిన 7,925 ఖాతాలను సరిచేసి, వాటికి సంబంధించిన 44.95 కోట్ల నిధులను ఇప్పటికే విడుదల చేశామని మంత్రి పేర్కొన్నారు. ఇక కొన్ని బ్యాంకుల నుంచి సాంకేతిక సమ స్యల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.70,000 నుండి రూ.80,000లోపు రుణాలున్న ఖాతాలకు సంబంధించిన వివరాలు కూడా తెప్పించుకుంటున్నట్టు వివరించారు.
ప్రతిపక్ష నేతలు ని జంగా రైతు సంక్షేమాన్ని కోరేవారే అయితే.. ముందుగా వారు గత పదేళ్లలో చెల్లించకుండా వదిలేసిన రుణాల వివరాలు తెప్పించుకొని చెల్లించాలని వ్యా ఖ్యానించారు. గత ప్రభుత్వం చెల్లించని పలు పథ కాల బకాయిలను తాము చెల్లించామని తెలిపారు.
రుణమాఫీపై అర్థంలేని విమర్శలు
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థంలేనివని మంత్రి తుమ్మల మండిపడ్డారు. శనివారం నల్లగొండలోని ఎన్‌జీ కళాశాల మైదానంలో రైతుబడి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అగ్రి షో’ను శనివారం ఆయన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.
రూ.2 లక్షలకు మించి ఉంటే ముందు కట్టండి
ఆ తర్వాత రుణమాఫీ చేస్తామంటూ రైతులకువ్యవసాయ శాఖ సూచన
సాక్షి, హైదరాబాద్: రూ.2 లక్షలకు మించి రుణాలున్న రైతులు.. అదనపు సొమ్మును బ్యాంకులో కట్టాలని, మిగతా రెండు లక్షలను ప్రభుత్వం మాఫీ చేస్తుందని వ్యవసాయ శాఖ పేర్కొంది. ఉదాహరణకు ఒక రైతుకు రూ.2.10 లక్షల రుణముంటే.. అదనంగా ఉన్న రూ.10 వేలు బ్యాంకులో జమ చేస్తే, తర్వాత ప్రభుత్వం రూ.2 లక్షలను బ్యాంకులో జమ చేస్తుందని తెలిపింది. ఈ మేరకు శనివారం రాత్రి ఒక ప్రకటన జారీ చేసింది.
ఆధార్, పాస్‌బుక్, రేషన్‌కార్డు తదితర వివరాలు సరిగా లేనివారి రుణమాఫీ పెండింగ్‌లో ఉందని తెలిపింది. రైతులు మండల వ్యవసాయ అధికారిని కలిసి, వివరాలను సరిచేసుకుంటే వారి ఖాతాల్లో రుణమాఫీ సొమ్ము జమ అవుతుందని ప్రకటించింది. బ్యాంకులు, ఖాతాల్లో పలు సాంకేతిక పొరపాట్ల వల్ల దాదాపు 22 వేల ఖాతాల్లో వేసిన డబ్బులు వెనక్కి వచ్చాయని... ఆ తప్పులను సరిచేసి, ఇప్పటికే 8 వేల ఖాతాలకు తిరిగి నిధులు పంపిస్తున్నామని తెలిపింది.
అందువల్ల రూ.2 లక్షలలోపు రుణాలుండి ఇప్పటికీ మాఫీ కాని రైతులు మండల వ్యవసాయ అధికారిని కలిసి, అందుకు కారణం తెలుసుకోవాలని సూచించింది. కుటుంబ నిర్ధారణ జరగని కారణంగా రుణమాఫీ కాలేదని ఫిర్యాదులుంటే అధికారులు క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేస్తారని.. ఆ రైతు కుటుంబంలోని వారి ఆధార్ కార్డులు, ఇతర వివరాలను తీసుకుని పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారని వివరించింది. రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను నెలరోజుల్లోగా పరిశీలించి, అర్హులైన వారికి రుణమాఫీ వర్తింపజేస్తామని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment