రుణం.. మాఫీ అయ్యేనా! | Telangana Farmers Waiting For Loan Waiver | Sakshi
Sakshi News home page

రుణం.. మాఫీ అయ్యేనా!

Published Sat, Jun 15 2019 12:40 PM | Last Updated on Sat, Jun 15 2019 12:42 PM

Telangana Farmers Waiting For Loan Waiver - Sakshi

పంట రుణాల మాఫీ కోసం అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. గతేడాది బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాల చెల్లింపునకు సమయం ఆసన్నం కావడంతో ఆందోళనలో పడ్డారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో అసలు రుణ మాఫీ ఉందా.. లేదా అని రైతులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క తీసుకున్న రుణ మొత్తాన్నిగానీ.. లేదంటే వడ్డీగానీ చెల్లించాలని రైతులకు బ్యాంకర్లు ఫోన్లు చేస్తున్నారు. దీనికితోడు ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో కొత్త రుణాల కోసం బ్యాంకుల వద్దకు వెళ్తున్న రైతులకు చేదు అనుభవం ఎదురవుతోంది. ‘పాత బకాయిలు చెల్లించండి.. లేదంటే వడ్డీ కట్టి రెన్యూవల్‌ చేసుకోండి’ అని బ్యాంకర్లు చెబుతున్నారు. ఒక్కో రైతుకు గరిష్ఠంగా రూ.లక్ష వరకు పంట రుణాణం మాఫీ చేస్తామని ప్రభుత్వం నుంచి హామీ వచ్చినప్పటికీ ఈ ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలు వెలువడకపోవడంతో ఖరీఫ్‌ పంట కాలానికి రుణ వితరణ నిలిచిపోయింది. 

సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో గత ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి రూ.880 కోట్ల వరకు పంట రుణాలు, వ్యవసాయ అనుబంధ రుణాలు పంపిణీ చేశారు. ప్రభుత్వం పేర్కొన్న నిబంధనల ప్రకారం 2018 డిసెంబరు 11వ తేదీ కన్నా ముందుగా తీసుకున్న రుణాలన్నింటికీ మాఫీ వర్తింపచేసే అవకాశముంది. ఈ మేరకు జిల్లాలో దాదాపుగా రూ.475 కోట్ల  వరకు పంట రుణాలు మాఫీ కావాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 2.72 లక్షల మంది రైతులు ఉండగా.. ఇందులో సుమారు 1.40 లక్షల మంది రైతులు రుణాలు పొందారు. వీరిలో రూ.లక్ష లోపు రుణం తీసుకున్న రైతులు 95 వేల మంది ఉండొచ్చని అంచనా. పాత రుణాలను 2018 డిసెంబరు 11 తర్వాత రెన్యూవల్‌ చేసుకున్నా మాఫీ వర్తిస్తుంది. కానీ, డిసెంబరు 11 తర్వాత రెన్యూవల్‌ చేసినా మాఫీ పరిధిలోకి తాము రామని రైతులు ఆందోళన చెందుతు న్నారు. పాత రుణాలన్నింటికీ మాఫీ వర్తిస్తుందని అధికారులు పేర్కొంటున్నా.. రైతుల్లో నమ్మకం కలగటం లేదు.
 
పెరుగుతున్న వడ్డీ భారం
పంట రుణం తీసుకున్న తేదీ నుంచి ఏడాదిలోపు వడ్డీతో సహా అసలు చెల్లిస్తే రూ.లక్ష వరకు సున్నా వడ్డీ, రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు పావలా వడ్డీ వర్తింపజేస్తారు. కాగా, రుణ మాఫీపై స్పష్టత వచ్చేవరకు అప్పు చెల్లిం చేది లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీరాయితీ రీయింబర్స్‌మెంట్‌ను సకాలంలో బ్యాంకులకు విడుదల చేయకపోవడంతో కొందరు బ్యాంకర్లు రైతుల నుంచి వడ్డీ వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహకార సంఘాలకు ఐదేళ్ల నుంచి రిబేటుని సర్కారు విడుదల చేయకపోవడం కారణంగా సంఘాలు కూడా ప్రస్తుతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఫలితంగా రైతులపై అదనపు భారం పడుతోంది. ఈ నేపథ్యంలో పంట రుణ మాఫీ మార్గదర్శకాలను త్వరితగతిన విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయమై జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రిజ్వాన్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. పంట రుణ మాఫీకి సంబంధించి మార్గదర్శకాలు తమకు ఇంకా అందలేదని సమాధానమిచ్చారు.  

రెన్యూవల్‌ చేసుకోవాలని చెబుతున్నారు 
బ్యాంకుల నుంచి రుణాలు ఇవ్వకపోవడంతో వ్యవసాయం చేసేందుకు పెట్టుబడికి డబ్బులు లేవు. గత ఏడాది మే నెలలో నా పేరు మీద ఉన్న 4ఎకరాల పొలానికి ఎస్‌బీఐ బ్యాంకులో రూ.99 వేల పంట రుణం తీసుకున్నా. రూ.లక్షలోపు పంట రుణాలు మాఫీ చేస్తారని చెప్పడంతో రెన్యూవల్‌ చేయించుకోలేదు. వారం రోజుల క్రితం పెట్టుబడి కోసం బ్యాంకుకు వెళితే ‘రుణమాఫీ తర్వాత అవుతుంది.. మొదట మీ బాకీ రెన్యూవల్‌ చేసుకోండి. రుణం పెంచి ఇస్తాం’ అని బ్యాంకు అధికారులు చెప్పారు. – బాలమోని కృష్ణయ్య, అవురుపల్లి. మాడ్గుల 

అప్పు చెల్లిస్తేనే కొత్త రుణం ఇస్తామంటున్నారు 
తలకొండపల్లి మండలం వెంకట్రావ్‌పేట్‌కు చెందిన రైతు సైదుపల్లి వెంకట్‌రెడ్డి 2014లో తలకొండపల్లి గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ నుంచి రూ.లక్ష పంట రుణం తీసుకున్నారు. ప్రభుత్వం సంవత్సరానికి 25 శాతం చొప్పున నాలుగు విడతలుగా మాఫీ చేసినా వడ్డీకే సరిపోయింది. అసలు రూ.లక్ష అలాగే మిగిలింది.  రూ.లక్షలోపు పంట రుణాన్ని మాఫీ చేస్తానని సీఎం ఇచ్చిన హామీ ఎప్పుడు అమలవుతుందోనని ఆరు నెలలుగా ఎదురుచూస్తున్నాడు. ఖరీఫ్‌ సీజన్‌ రావడంతో రుణాల కోసం బ్యాంకుల వెళ్తే.. పాత అప్పు చెల్లిస్తేనే రుణాలు ఇస్తామని బ్యాంక్‌ అధికారులు అంటున్నారు.  

మాఫీ కోసం ఎదురుచూస్తున్నాం 
నాకు మా గ్రామ శివారులో ç2ఎకరాల 14గుంటల భూమి ఉంది. గతేడాది నందిగామలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో రూ.86 వేలు పంట రుణం తీసుకున్నా. ఇవిమాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మాఫీ కోసం ఎదురుచూస్తున్న. ఖరీఫ్‌ సాగు పెట్టుబడుల కోసం బ్యాంకుకు వెళ్తే రెన్యూవల్‌ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. –ఓజిని విఠలయ్య, వీర్లపల్లి, నందిగామ మండలం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement