మాఫీ సంబురాలు | Farmers Celebrations At Telangana: Rythu Runa Mafi | Sakshi
Sakshi News home page

మాఫీ సంబురాలు

Published Fri, Jul 19 2024 6:19 AM | Last Updated on Fri, Jul 19 2024 6:19 AM

Farmers Celebrations At Telangana: Rythu Runa Mafi

రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్‌ శ్రేణులు

సాక్షి, హైదరాబాద్‌: రైతు రుణమాఫీ అమలుతో రాష్ట్రంలోని కాంగ్రెస్‌ శ్రేణులు సంబురాలు జరుపుకున్నాయి. పార్టీ రాష్ట్ర కార్యాలయమైన గాం«దీభవన్‌ మొదలు గ్రామ స్థాయిలోని రైతు వేదికల వరకు అన్ని స్థాయిల్లో పార్టీ కేడర్, నాయకులు.. రైతులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామాల స్థాయిలో టపాసులు పేల్చి, మిఠాయిలు పంచుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల చిత్రపటాలకు పాలాభిõÙకం చేశారు.

నృత్యాలు చేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ట్రాక్టర్లు, ఎడ్లబండ్ల ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, టీపీ సీసీ కార్యవర్గం పాల్గొన్నారు. నల్లగొండలో స్వయంగా ట్రాక్టర్‌ నడుపుతూ మంత్రి కోమటిరెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. రైతులకు రుణ విముక్తి కల్పించిన ఘనత కాంగ్రెస్‌దేనని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. పైసా పైసా కూడబెట్టి రైతులను రుణ విముక్తి చేస్తున్నామన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో జరిగిన కార్యక్రమానికి ఎంపీ మల్లురవి హాజరయ్యారు.  

రైతు వేదికల వద్ద కోలాహలం 
గ్రామాల్లో రైతు వేదికల వద్ద రైతులతో కలిసి కాంగ్రెస్‌ నేతలు సంబురాలు చేసుకున్నారు. క్లస్టర్‌ స్థాయిలో జరిగిన ఈకార్యక్రమాల్లో రైతులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. ఇక సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు కూడా రైతులు రైతు వేదికల వద్దకు వచ్చారు. చప్పట్ల ద్వారా ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటించారు. రైతు వేదికల వద్ద రుణమాఫీ లబి్ధదారుల జాబితాలు కూడా పెట్టడంతో కాంగ్రెస్‌ నేతల హడావుడి కనిపించింది. కాగా శుక్రవారం మండల స్థాయిలో రుణమాఫీ సంబురాలు జరగనున్నాయి. శని, ఆదివారాల్లో గ్రామ స్థాయిల్లో జరిగే ర్యాలీల కోసం పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.  

మున్షీ, యాష్కీల సమక్షంలో.. 
హైదరాబాద్‌ గాం«దీభవన్‌లో రైతు రుణమాఫీ సంబురాలు నిర్వహించారు. టపాసులు పేల్చి, డప్పు లు వాయిస్తూ, నృత్యాలు చేస్తూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున కేడర్‌ వేడుకల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్, ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి, రాష్ట్ర మత్స్యకార సొసైటీల సమాఖ్య చైర్మన్‌ మెట్టు సాయికుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధులు సత్యం శ్రీరంగం, కమల్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుయాష్కీ మీడియాతో మాట్లాడుతూ రైతు లకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేయడం దేశ చరిత్రలోనే తొలిసారని వ్యాఖ్యానించారు. రుణమాఫీ ప్రారంభించిన జూలై 18 రైతుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement