రుణమాఫీ నిధుల కోసం అన్నదాతల నిరీక్షణ
* ఖరీఫ్ ప్రారంభానికి సమీపిస్తున్న గడువు
* రెండో విడత 25 శాతం సొమ్ము వస్తేనే రుణాలు రెన్యువల్ చేస్తామంటున్న బ్యాంకర్లు
* జిల్లాకు మంజూరు కావాల్సింది రూ.447.5 కోట్లు
మోర్తాడ్: పంట రుణాల మాఫీకి సంబంధించిన రెండో విడత 25 శాతం సొమ్ము కోసం రైతులు నిరీక్షిస్తున్నారు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి సమయం దగ్గర పడుతుండటంతో కొత్త పంటల సాగు కోసం రైతులు రుణాలను రెన్యువల్ చేయించుకోవాలి. అయితే రెండో విడత మాఫీ సొమ్ము జమ అయ్యూకనే రుణాలు రెన్యువల్ చేస్తామని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రూ. లక్ష వరకు పంట రుణాలను రెన్యువల్ చేస్తామని ఎన్నికల ముందు కేసీఆర్ హమీ ఇచ్చిన విషయం విదితమే. తర్జన భర్జనల అనంతరం పంట రుణాల మాఫీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
ఒకేసారి రూ.లక్ష రుణం మాఫీ కాకుండా నాలుగు విడతల్లో నిధులను కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. చివరకు గత సంవత్సరం అక్టోబర్‌లో తొలి విడతగా 25 శాతం రుణం మాఫీ సొమ్మును ప్రభుత్వం కేటాయించింది. జిల్లాలో 3.62 లక్షల మంది రైతులు పంట రుణాల మాఫీకి అర్హత సాధించారు. వారికి రూ.1,790 కోట్ల రుణాలు మాఫీ అయ్యూయి. ఇందులో తొలి విడతగా 25 శాతం అంటే రూ.447.5 కోట్లు బ్యాంకర్లకు చేరగా, వారు అర్హులైర రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీంతో రైతు తీసుకున్న రుణం మొత్తంలో 25 శాతం తగ్గింది.
ఇక రెండో విడతలో ఇచ్చే మరో 25 శాతం కోసం గత బడ్జెట్‌లోనే ప్రభుత్వం నిధులు కేటాయించింది. కానీ ఇంకా బ్యాంకర్లకు చేర్చకపోవడంతో రుణాల రెన్యువల్‌కు బ్రేక్ పడినట్లు అయింది. త్వరలో మొదలయ్యే ఖరీఫ్ సీజన్‌లో రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాల్సి ఉంది. తొలకరి రాకతోనే పంటల సాగు పనులు మొదలు పెడతారు. సకాలంలో బ్యాంకుల్లో రుణాల రెన్యువల్ చేస్తేనే తమ చేతిలో డబ్బు ఉండి అన్ని పనులు ఊపందుకుంటాయని అంటున్నారు.
కాగా ప్రభుత్వం మాత్రం ఇంత వరకు రెండో విడత రుణ మాఫీ సొమ్ము విషయాన్ని ఇంకా స్పష్టం చేయలేదు. బ్యాంకులకు నిధులు కేటాయిస్తే వారు రైతుల రుణ ఖాతాల్లో నిధులను జమ చేస్తారు. రెండో విడత మాఫీ సొమ్ము ఆలస్యమైతే రుణాలు రెన్యూవల్ కాక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పదని రైతులు అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించినా ఇంత వరకు మాఫీ సొమ్ము బ్యాంకులకు చేరక పోవడం వల్ల రైతులు నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం తొందరగా స్పందించి రెండో విడత మాఫీ సొమ్మును బ్యాంకులకు చేర్చాలని పలువురు కోరుతున్నారు.
ఎదురుచూపులేనా?
Published Sat, May 30 2015 4:14 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement