
ఈ ఏడాది జనవరి 1వ తేదీలోపు రిజిస్ట్రేషన్ అయిన వ్యవసాయ భూములకు వర్తింపు
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసా విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం ఆఖరు వరకు భూములు కొనుగోలు చేసి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులందరికీ ‘రైతుభరోసా’కింద ఎకరానికి రూ. 6వేలు అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు జనవరి 1వ తేదీ లోపు పట్టాదార్‌పాస్ పుస్తకాలు పొందినవారు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించింది.
కొత్తగా దరఖాస్తు తప్పనిసరి
జనవరి 1వ తేదీ వరకు పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందినవారు రైతుభరోసా పథకానికి వ్యవసాయ విస్తరణాధికారి వద్ద దరఖాస్తు చేసుకోవాలి. పట్టాదారు పాస్‌పుస్తకం జిరాక్స్ లేదా ధరణి(భూభారతి)లో రిజిస్ట్రేషన్ రోజు ఇచ్చి న డ్రాఫ్ట్ పాస్ బుక్ కాపీని, పట్టాదారు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్‌ను జతచేసి దరఖాస్తు చేసుకోవాలి. వ్యవసాయ భూముల డేటా వ్యవసాయ విస్తరణాధికారుల వద్ద ఉండడంతో వారు దాన్ని సరిచూసుకొని రైతుభరోసాకు లింక్ చేస్తారు. ఇప్పటికే రైతుబంధు తీసుకుంటున్న వారికి ఆటోమేటిక్‌గా ఆర్థికసాయం అందుతుంది. వారెవరూ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల దరఖాస్తులకు చివరి గడువు తేదీని ప్రకటించలేదు.