Pattadar pass books
-
కౌలు రైతులపై సర్కారు సమ్మెట!
సాక్షి, అమరావతి: కౌలు చట్టం–2024 పేరిట రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు అన్యాయం తలపెట్టేందుకు సిద్ధమైంది. కౌలుదారుడికి సెంటు భూమి ఉన్నా కౌలు రైతుగా గుర్తించకూడదని నిర్ణయించింది. ఈ మేరకు కౌలు చట్టం–2024 పేరిట ముసాయిదాను సైతం సిద్ధం చేసింది. తద్వారా భూ యజమాని అనుమతి లేకుండానే కౌలు కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. ఈ ముసుగులో టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు, నచ్చినోళ్లకు పెట్టుబడి సాయం, రుణాలు, నష్టపరిహారం, సబ్సిడీల లబ్ధి చేకూర్చేలా తెరవెనుక ఏర్పాట్లు చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. ఈ కొత్త చట్టం విభేదాలకు ఆజ్యం పోస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.తెలిసిన వ్యక్తులకే తమ భూములను కౌలుకు ఇస్తుంటామని.. తమ అనుమతితో పనిలేకుండా ప్రభుత్వం ఎవరో ఒకరికి భూములను కౌలుకు ఇచ్చినట్టుగా రాసేసుకుని.. కౌలు కార్డులు జారీచేస్తే వాస్తవ హక్కుదారులమైన తాము ఏమైపోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. కొత్త చట్టం తీసుకురావడం వెనుక కుట్ర దాగి ఉందని, తమ భూములపై ప్రభుత్వం తనకు నచ్చినోళ్లకు మేలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని వాస్తవ రైతులు ఆందోళన చెందుతున్నారు.మరోవైపు కౌలుదారులు సైతం ఈ నిబంధనపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. కౌలు చేస్తున్న సాగుదారులకు కాకుండా కొత్త నిబంధన పేరిట వేరే వ్యక్తులకు కౌలు కార్డులు జారీచేస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కౌలుదారుల్లో అత్యధికులకు 10 నుంచి 30 సెంట్ల వరకు భూమి ఉంటుందని, ఒక్క సెంటు భూమి ఉన్నా కౌలు కార్డులకు అర్హత లేదనే నిబంధన అసలుకే చేటు తెస్తుందని కౌలుదారులు ఆందోళన చెందుతున్నారు.కొత్త నిబంధనలతో అసలుకే మోసంపట్టాదార్ పాస్ బుక్ చట్టం–1971 లేదా ఇతర రెవెన్యూ చట్టాల ప్రకారం భూమిపై హక్కు కలిగి ఉండి, వెబ్‌ల్యాండ్ వంటి భూ రిజిస్టర్లలో నమోదైన కౌలు రైతులు కొత్త చట్టం ప్రకారం కౌలు కార్డులు పొందేందుకు అనర్హులు. అంటే సెంటు భూమి ఉన్నా సరే కౌలు కార్డు పొందేందుకు అనర్హులనే విషయాన్ని కొత్త చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇన్ఫర్మేటివ్ టెక్నాలజీ ద్వారా అభివృద్ధి చేసిన యాప్‌లో నమోదు చేసుకున్న వారు మాత్రమే కౌలు కార్డులు పొందేందుకు అర్హులు. అంటే.. భూమిని వాస్తవ కౌలుదారు కాకుండా వేరే వ్యక్తులు కౌలుకు చేస్తున్నట్టుగా యాప్‌లో నమోదు చేసుకుంటే వారిని కౌలు రైతుగా గుర్తించే ప్రమాదం ఉంది.యాప్‌పై అవగాహన లేని కౌలు రైతులు, అమాయకులైన కౌలు రైతులకు ఇలాంటి నిబంధనల వల్ల కీడు జరుగుతుందని రైతు, కౌలు రైతు సంఘాల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. కొత్త చట్టం పేరిట తెస్తున్న నిబంధనల్లో మరో సమస్య కూడా ఉంది. అసలు రైతు కుటుంబ సభ్యులు, వారి సమీప బంధువులు భూమిని కౌలుకు చేస్తుంటే.. అలాంటి వారు కూడా కౌలు కార్డు పొందేందుకు అనర్హులనే నిబంధన విధించారు. కౌలు రైతుల్లో ఎక్కువ మంది కుటుంబ సభ్యులు, సమీప బంధువులు సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. కొత్త చట్టం అమల్లోకి వస్తే వారంతా వాస్తవ సాగుదారులైన కౌలు రైతుగా అనర్హులవుతారు. కొత్త కౌలు చట్టాన్ని త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.ముసాయిదా ఏం చెబుతోందంటే..కౌలు చట్టం–2024 ప్రకారం భూ యజమానుల అనుమతితో పనిలేకుండా చుట్టుపక్కల రైతుల అభిప్రాయాల మేరకు గ్రామసభల్లో కౌలుదారులను గుర్తిస్తామని ప్రభుత్వం చెబుతోంది. యజమాని మూడు రోజుల్లో సమ్మతి ఇవ్వకుంటే డీమ్డ్ సమ్మితి (భూ యజమాని సమ్మతి తెలిపినట్టు)గా పరిగణించి కౌలు కార్డు జారీ చేస్తారు. ఒకవేళ తాను ఎవరికీ తన భూమిని కౌలుకు ఇవ్వలేదని భూ యజమాని అభ్యంతరం వ్యక్తం చేసినా పరిగణనలోకి తీసుకోరు. చుట్టుపక్కల రైతుల అభిప్రాయాలే ప్రామాణికంగా ఇచ్చే కౌలు కార్డుల ప్రామాణికంగానే పంట రుణాలిస్తారు. ఈ కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యే వరకు పంట రుణాలు ఇవ్వకూడదని, భూ యజమానులు గత సీజన్లో తీసుకున్న పంట రుణాలను రెన్యువల్ చేసుకున్నా, అదే సీజన్లో కొత్తగా తీసుకున్న పంట రుణాలను లాంగ్ టర్మ్ రుణాలుగా పరిగణించేలా బ్యాంకులను ఆదేశించేలా నిబంధన పెడుతున్నారు.కౌలు కార్డుల వల్ల కలిగే ప్రయోజనాలివీఅధికారిక గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో 76 లక్షల మంది రైతులున్నారు. ఇందులో 16 లక్షల మంది కౌలుదారులు. సెంటు భూమి కూడా లేకుండా వ్యవసాయం చేస్తున్న వారు 8–10 లక్షల మంది ఉంటారని అంచనా. కౌలు కార్డులు పొందిన వారు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం పొందవచ్చు. సబ్సిడీపై. విత్తనాలు, ఎరువులు పొందవచ్చు. ఎలాంటి పూచీకత్తు లేకుండా సాగు చేసే పంటలను బట్టి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రూ.1.60 లక్షల వరకు పంట రుణాలు పొందవచ్చు. సాగు చేసిన పంట ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోతే నష్టపరిహారంతో పాటు పంటల బీమా పరిహారం పొందవచ్చు.కొత్త వివాదాలకు ఆజ్యంపరిసర రైతులు మౌఖికంగా ధ్రువీకరిస్తే కౌలు కార్డులు ఇవ్వొచ్చన్న నిబంధన గ్రామాల్లో భూ యజమానులు, కౌలు రైతుల మధ్య విభేదాలకు ఆజ్యం పోస్తుందన్న వాదన వినిపిస్తోంది. అన్నదాత సుఖీభవతో పాటు ఇతర సంక్షేమ ఫలాల కోసం ఎలాంటి భూమి లేనివారు, అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు ఈ నిబంధన సాకుతో స్థానిక అధికారులను ప్రలోభపెట్టి అడ్డగోలుగా కార్డులు పొందడం, వాటిద్వారా సంక్షేమ ఫలాలు స్వాహా చేయడం వంటి అవకతవకలు జరిగే అవకాశం లేకపోలేదంటున్నారు.కార్డులు జారీచేసే వరకు రుణాలివ్వకూడదన్న నిబంధనతో సకాలంలో పంట రుణాలు పొందే అవకాశం సాగుదారులైన భూ యజమానులకు లేకుండా పోతుందంటున్నారు. డబుల్ ఫైనాన్స్ ఇవ్వలేమని, గతంలో తీసుకున్న రుణాలు రెన్యువల్ చేసుకున్న తర్వాత వాటిని లాంగ్ టర్మ్ రుణాలుగా మార్చడానికి నిబంధనలు అంగీకరించవని బ్యాంకర్లు తేల్చి చెబుతున్నారు. కౌలుదారుడు రుణం తీసుకుని చెల్లించలేని పక్షంలో, వ్యక్తిగత అవసరాల కోసం భూమిని తనఖా లేదా, అమ్ముకునేటప్పుడు తమకు ఇబ్బందికరంగా మారుతుందన్న ఆందోళనను భూ యజమానులు వ్యక్తం చేస్తున్నారు. -
కౌలు రైతుకు మేలేదీ?
వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఖరీఫ్ నుంచి అమలు చేయనున్న పెట్టుబడి సాయం పథకంపై కౌలు రైతులు నిరాశతో ఉన్నారు. పెట్టుబడి సాయాన్ని పట్టాదారులకు కాకుండా క్షేత్రస్థాయిలో పంట సాగుచేస్తున్న తమకు ఇవ్వాలని కోరుతున్నారు. పెట్టుబడి సాయం పథకంతో తమకు ఎలాంటి ప్రయోజనం లేదని తెలిసి ఆవేదన చెందుతున్నారు. భూపట్టాదారుల్లోని ధనిక రైతులు వ్యవసాయాన్ని వదిలి ఇతర రంగాల్లో స్థిరపడ్డారు. వారి భూమిని సామాన్య రైతులు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. తాము భూయజమానులకు కౌలు చెల్లిస్తుండగా, ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని వారికే ఇస్తుండటం ఏమిటని అంటున్నారు. జిల్లాలో 1,69,892 ఎకరాల సాగు భూమి జిల్లాలోని 16 మండలాల్లో 1,69,892 ఎకరాల సాగుభూమి ఉంది. ఇందులో 3,74,519 రైతులు భూములు కలిగి ఉన్నట్లు రెవెన్యూ అధికారులు రికార్డుల ప్రక్షాళనలో గుర్తించారు. భూమి కలిగిన రైతుల్లో సుమారు 50శాతానికి పైగా తమ భూములను ఇతరులకు కౌలుకు ఇస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే కౌలుకు తీసుకున్న వారు ఆయా భూములకు సంబంధించి ఎకరానికి రూ.8 నుంచి రూ.11వేల వరకు కౌలు చెల్లిస్తుండగా ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి సాయంతో భూ యజమానికి మరో రూ.4 వేలు అదనంగా లబ్ధిచేకూరనుంది. కౌలు రైతులను ఆదుకోని ప్రభుత్వం అనేక కష్టనష్టాలను ఎదుర్కొని పంటసాగు చేస్తున్న కౌలు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి పంటసాగు చేసిన సమయంలో అనుకోని విపత్తులు వచ్చి నష్టపోయిన సమయంలో సైతం తమకు ప్రభుత్వం పంటనష్ట పరిహారం అందించిన పరిస్థితులు లేవని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి ఆర్థికంగా చేయూతనందించాలని కౌలు రైతులు కోరుతున్నార సాగు చేసిన వారికే డబ్బులు ఇవ్వాలి పంట సాగు చేసిన వారికే ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి. పంటలు ఒకరు సాగు చేస్తే ఇంకొకరికి డబ్బులు ఇస్తామనటం సరైనది కాదు. డబ్బులు పట్టాదారులకే ఇవ్వటం వల్ల మాకు ఎలాంటి మేలు జరగదు. – నల్లమాస హరినాథ్, కౌలు రైతు, బయ్యారం రైతులందరికీ సాయం అందించాలి పంటలు పండించే రైతులందరికీ ప్రభుత్వం సాయం అందించాలి. పట్టాదారులకే కాకుండా కాస్తులో ఉన్న ప్రతి రైతుకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించినప్పుడే రైతులు పంటలసాగుపై దృష్టి పెడతారు. వీటితోపాటు పండించిన పంటకు గిట్టుభాటు ధర కల్పించాలి. – గౌని ఐలయ్య, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి -
పాత పద్ధతిలో పాసు పుస్తకాలు
రెండు నెలల గందరగోళానికి తెర సాక్షి, హైదరాబాద్: పట్టాదారు పాసు పుస్తకాల జారీ ప్రక్రియ పట్టాలెక్కింది. ఇప్పటి వరకు ఆటకెక్కించిన రెవెన్యూ శాఖ ఇప్పుడు మళ్లీ పాత బట్టింది. ఆన్లైన్ విధానంపై ఆలోచనను తాత్కాలికంగా విరమించింది. రెండు నెలలపాటు కొనసాగిన అయోమయానికి తెరదించింది. కొత్త పుస్తకాల ముద్రణను ప్రారంభించింది. కొత్త జిల్లాల పేర్లు ఉండేవిధంగా ముద్రణకు ఆదేశించింది. పహాణీల మాదిరిగా పట్టాదారు పాసు పుస్తకాలను కూడా ఆన్లైన్ ద్వారా అందజేయాలని గతంలో రెవెన్యూ శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించి నాటి సీసీఎల్ఏ రేమండ్‌పీటర్ కసరత్తు కూడా చేశారు. అది పూర్తికాకుండానే మాన్యువల్ పాసుపుస్తకాల జారీ నిలిపివేయాలంటూ రెవెన్యూ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. దీంతో వాటి ముద్రణ కూడా నిలిచిపోయింది. ఆన్లైన్ కోసం సాఫ్ట్వేర్ సిద్ధం కాకపోవటం, దానికి సంబంధిత సంస్థతో ఒప్పందం జరగకపోవటం, దీనికి ప్రభుత్వం నుంచి ఆమోదమూ రాకపోవటంతో ఆ కసరత్తులో జాప్యం జరిగింది. ఇంతలో రేమండ్ పీటర్ పదవీవిరమణ చేశారు. దీంతో ఈ విషయాన్ని పట్టించుకునేవారే లేకుండాపోయారు. ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రయోగాత్మకంగా ఓ మండలాన్ని ఎంపిక చేసుకుని పరిశీలిస్తారు. కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా వ్యవహరించారు. రైతుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉందని, చాలాచోట్ల ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడుతోందని తహసీల్దారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దిగొచ్చిన అధికారులు కాలం కలసి రాక ఖరీఫ్ పంటలను కోల్పోయిన రైతులు రబీపై దృష్టి సారించారు. పంట రుణాల కోసం సిద్ధమవుతుండగా పట్టాదారు పాసు పుస్తకాల సమస్య వచ్చి పడింది. కొత్తగా పాసుపుస్తకాలు అవసరమైనవారికి రుణాలు పొందే వెసులుబాటు లేకుండాపోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు సాగుకు అవసరమైన స్ప్రింక్లర్లు, డ్రిప్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వ పథకం కింద దరఖాస్తు చేసుకుని సబ్సిడీ వెసులబాటు పొందాలన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక తండ్రి నుంచి సంక్రమించిన భూములను పంచుకునే క్రమంలో వారసులకు కొత్త పాసు పుస్తకాల జారీ కావటం లేదు. భూముల క్రయవిక్రయాలకూ ఇదే ఇబ్బంది ఏర్పడింది. భూముల రిజిస్ట్రేషన్లపై కూడా దీని ప్రభావం కనిపిస్తోంది. దీంతో జనం గగ్గోలు పెడుతుండటంతో ఎట్టకేలకు అధికారులు దిగొచ్చారు. -
ఆధార్‌తో పట్టాదార్ పాస్ పుస్తకాల అనుసంధానం
ఏలూరు, న్యూస్‌లైన్: ప్రతి పట్టాదార్ పాస్ పుస్తకాన్ని ఆధార్‌తో అనుసంధానం చేయాలని రాష్ట్ర భూపరిపాలనా శాఖ కమిషనర్ ఐవీఆర్ కృష్ణారావు అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ భూముల రక్షణ, మీ-సేవా, ఆధార్ సీడింగ్ తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ-సేవ ద్వారా రెవెన్యూ రికార్డులను మార్పు చేయడానికి వచ్చిన ఆర్జీలను నిబంధనల మేరకు సత్వరం పరిష్కరించాలన్నారు. వారికి ఎలక్ట్రానిక్ పద్ధతిలో పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని ఆదేశించారు. భూమి రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కూడా ఇ-ఎలక్ట్రానిక్ పద్ధతిలో పాస్ బుక్‌లు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో సర్కార్ భూమి వివరాలను ఈ నెల 15వ తేదీలోగా పొందుపరచాలన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములను సర్కార్ భూమి వెబ్సైట్లో నమోదు పరచాలని, ప్రభుత్వ భూముల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు మాట్లాడుతూ జిల్లాలో కౌలురైతులకు రూ.137.49 కోట్లను అందజేశామన్నారు. దీనిద్వారా 55 వేల 102 మంది కౌలు రైతులకు ప్రయోజనం చేకూరిందన్నారు. జిల్లాలో లక్షా 26 వేల 178 మంది అర్హులైన కౌలు రైతులకు ఋణ అర్హత కార్డులు అందించామన్నారు. జిల్లాను రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిపేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.