ఆధార్‌తో పట్టాదార్ పాస్ పుస్తకాల అనుసంధానం
Published Fri, Feb 7 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM
ఏలూరు, న్యూస్‌లైన్: ప్రతి పట్టాదార్ పాస్ పుస్తకాన్ని ఆధార్‌తో అనుసంధానం చేయాలని రాష్ట్ర భూపరిపాలనా శాఖ కమిషనర్ ఐవీఆర్ కృష్ణారావు అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ భూముల రక్షణ, మీ-సేవా, ఆధార్ సీడింగ్ తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ-సేవ ద్వారా రెవెన్యూ రికార్డులను మార్పు చేయడానికి వచ్చిన ఆర్జీలను నిబంధనల మేరకు సత్వరం పరిష్కరించాలన్నారు. వారికి ఎలక్ట్రానిక్ పద్ధతిలో పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని ఆదేశించారు. భూమి రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కూడా ఇ-ఎలక్ట్రానిక్ పద్ధతిలో పాస్ బుక్‌లు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లాలో సర్కార్ భూమి వివరాలను ఈ నెల 15వ తేదీలోగా పొందుపరచాలన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములను సర్కార్ భూమి వెబ్‌సైట్‌లో నమోదు పరచాలని, ప్రభుత్వ భూముల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు మాట్లాడుతూ జిల్లాలో కౌలురైతులకు రూ.137.49 కోట్లను అందజేశామన్నారు. దీనిద్వారా 55 వేల 102 మంది కౌలు రైతులకు ప్రయోజనం చేకూరిందన్నారు. జిల్లాలో లక్షా 26 వేల 178 మంది అర్హులైన కౌలు రైతులకు ఋణ అర్హత కార్డులు అందించామన్నారు. జిల్లాను రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిపేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
Advertisement
Advertisement