'ఆధార్' ఉంటేనే ఉల్లి.. లేదంటే లొల్లి
ఏలూరు: ఆధార్ కార్డు ఉంటేనే ఉల్లిపాయలు.. లేదంటే లేదు. ఇదేంటి అనుకుంటున్నారా ? ఔనండీ! తాజాగా ఉల్లి పాయలకూ 'ఆధార్' లింకు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఆధార్ కార్డు ఉంటేనే సబ్సిడీతో ఉల్లిపాయలు ఇస్తారట. ఈ పరిస్థితి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలోని రైతు బజార్లో శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. రైతు బజార్లో శనివారం నుంచి సబ్సిడీతో కిలో ఉల్లిపాయలు రూ.20 కి ఇస్తామని ప్రభుత్వం ప్రచారం చేసింది. దాంతో వినియోగదారులు ఎంతో ఉత్సాహంతో అక్కడికి వచ్చారు. విక్రయదారులు మాత్రం ఆధార్ కార్డు ఉంటేనే సబ్సిడీ వర్తిస్తుందని తేల్చి చెప్పారు. ఆధార్ లేని వారికి సబ్సిడీ ఉల్లిపాయలు ఇవ్వడానికి కుదరదని చెప్పారు.
దాంతో సగానికి పైగా జనం నిరాశతో ఇళ్లకు వెళ్లారు. కొంతమంది ఏటీఎం కార్డు చూపించినా కూడా.. తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలని చెప్పారు. అక్కడ విక్రయించే వాటిలో నాసిరకం ఉల్లిపాయలు ఎక్కువగా ఉన్నాయని.. ఇంటికి వెళ్లే లోపే సగానికి పైగా పడేయాల్సి వస్తుందని ఓ వినియోగదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు.