ఏలూరు రూరల్ :సమస్యలు సృష్టించడం.. ఆనక తామే వాటిని పరిష్కరించి ఓట్లు.. నోట్లు దండుకోవడం కొల్లేటి ప్రాంత ప్రజాప్రతినిధులకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. కొల్లేరు ప్రజల అమాయకత్వం.. వారి మంచితనం స్వార్థపరులకు కాసులు కురిపిస్తున్నాయి. కొల్లేరు అభయారణ్య పరిధిలో ఉన్న భూముల్లో చేపల చెరువులు తవ్వుకోమని ఆ ప్రాంత ప్రజలను ప్రోత్సహించిన ప్రజాప్రతినిధులు భారీగా సొమ్ములు దండుకున్నారు. ఆ తరువాత చెరువులు తవ్వడం చట్టవిరుద్ధమంటూ అధికారులను ఉసిగొల్పుతున్నారు. ఆనక అధికారులను ప్రసన్నం చేసుకుని కొల్లేటి వాసులతో రాయ‘బేరాలు’ సాగించి.. అభయారణ్య భూ ములను కేటాయించినట్టుగా తప్పుడు పత్రాలు ఇస్తూ మభ్య పెడుతున్నారు. తరచూ ఇదే తంతు కొనసాగుతోంది. తాజాగా ఏలూరు మండలం ప్రత్తికోళ్లలంకలోని అభయారణ్య పరిధిలో తవ్విన 460 ఎకరాల్లోని చెరువులను ధ్వంసం చేస్తామంటూ అధికారులతో నోటీసులు జారీ చేయించారు. ఈ పరిణామంతో ఆందోళనకు గురవుతున్న కొల్లేటి వాసులకు తాము అండగా ఉంటామని, అభయారణ్య భూములకు పట్టాలు ఇప్పిస్తామంటూ ఓ ప్రజాప్రతినిధి అనుయాయులు మోసగిస్తున్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు కాపీలు సిద్ధం చేసుకోవాలని, త్వరలోనే పట్టాలు వచ్చేస్తాయంటూ అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. పట్టాలు ఇప్పించే విషయమై తమ నాయకుడు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతున్నారని.. ఇందుకు భారీ సొమ్ము ఖర్చవుతోందని నమ్మిస్తున్నారు. అభం, శుభం తెలియని కొల్లేటి పేదలు వారి మాటలు నిజమనుకుని మరోసారి మోసపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అభయారణ్య భూముల్ని ఎలా ఇస్తారు
అభయారణ్య పరిధిలోని భూములకు పట్టాలు ఇవ్వడం అనేది సాధ్యం కాని విషయం. అటవీ చట్టం ప్రకారం ఆ భూములను ఎవరికీ ఇచ్చే పరిస్థితి ఉండదు. నిజంగా ఆ భూములను ప్రజలకు కేటాయించి పట్టాలు ఇస్తే సుప్రీంకోర్టు అదేశాలను ధిక్కరించడమే అవుతుంది. అదే జరిగితే అధికారులు తమ ఉద్యోగాలను పణంగా పెట్టాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఆ భూములకు సంబంధించి పట్టాలు ఇప్పిస్తామంటూ పెద్దల ద్వారా నాయకులు అక్కడి ప్రజలను నమ్మిస్తున్నారు. అధికారులను బుజ్జిగించి తప్పుడు పట్టాలు ఇప్పించడం, అనుకున్న కార్యం నెరవేరిన అనంతరం చెరువులను ధ్వంసం చేయాలంటూ అధికారులను ఉసిగొల్పటం తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నాయకులు కొల్లేరులో చేస్తున్న పని ఇలాంటిదేనని గతంలో వీరి చేతుల్లో మోసపోయిన పలువురు అంటున్నారు. విషయాలన్నీ తెలిసిన పెద్దలు సైతం గ్రామ ప్రజలను బలి పశువులను చేస్తున్నారని వాపోతున్నారు. ఈ వ్యవహారాల వెనుక డబ్బు అనే స్వార్థం ఉందంటున్నారు.
పెద్దలే.. గద్దలై..
Published Fri, May 1 2015 5:18 AM | Last Updated on Fri, May 25 2018 6:12 PM
Advertisement
Advertisement