రేషన్‌కు ‘ఆధార్’ గండం
Published Fri, Feb 28 2014 2:32 AM | Last Updated on Fri, May 25 2018 6:21 PM
సాక్షి, ఏలూరు : గ్యాస్ వినియోగదారులకు తలనొప్పిగా మారిన ఆధార్ అనుసంధానం, ఇప్పుడు రేషన్ కార్డుదారులనూ వేధిస్తోంది. రేషన్ కార్డుతో ఆధార్ అనుసంధానానికి గడువు ఈ నెలాఖరుతో ముగియనుండటమే దీనికి కారణం. రేషన్ కార్డుల్లో నమోదై ఉన్న వారిలో సుమారు 20 శాతం మంది ఇప్పటికీ ఆధార్‌తో అనుసంధానం కాలేదు. వారు మార్చి నుంచి రేషన్ అందుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో సుమారు 10 శాతం మందికి ఇప్పటికీ ఆధార్ కార్డులు లేవు.
అనుసంధానం కాకుంటే సరుకులు రానట్టే
రేషన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసుకునేందుకు ఈ నెలాఖరు వరకు మాత్రమే గడువు ఉందని పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రకటించారు. ఈ గడువు శుక్రవారంతో ముగుస్తోంది. జిల్లాలో సుమారు 12 లక్షల రేషన్ కార్డులకు సంబంధించి 35 లక్షల మంది ఆధార్ అనుసంధానం చేయించుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకూ 28.50 లక్షల మంది సీడింగ్ మాత్రమే పూర్తయింది. నేటికీ ఆరున్నర లక్షల మంది ఆధార్‌తో అనుసంధానం కాలేదు. గడువు ముగిసిన తర్వాత ఆధార్‌తో అనుసంధానం కాని రేషన్ కార్డులను రద్దు చేస్తామని పౌరసరఫరాల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే ప్రజలకే కాకుండా అధికారులకు చిక్కులు తప్పవు. అంతవరకూ తెచ్చుకోకుండా ఆధార్ లేని వారికి రేషన్ సరుకులు నిలిపివేయాలని అధికారులు యోచిస్తున్నారు.
ప్రారంభంలో పట్టించుకోలేదు
ఆధార్ కార్డు ఉంటేనే సంక్షేమ పథకాలు వర్తిస్తాయంటున్న అధికారులు కార్డును ఇవ్వడంలో అలసత్వం వహిస్తున్నారు. ప్రారంభంలో పెద్దగా పట్టించుకోకుండా ఇప్పుడు డెడ్‌లైన్‌లు విధిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఆధార్‌పై అవగాహన లేనివారు వాటిని బ్యాంకుల్లో, రేషన్ దుకాణాల్లో అనుసంధానం చేయించుకోవటానికి ఇబ్బందులు పడుతున్నారు.
‘ఆహార భద్రత’ కోసం అనుసంధానం తప్పనిసరి
త్వరలో ఆహార భద్రత పథకం జిల్లాలో అమలు చేయనుండటంతో రేషన్‌కార్డులకు ఆధార్‌తో అనుసంధానం తప్పనిసరి అని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 39లక్షల 69 వేల మంది ఆధార్ నమోదు చేయించుకోవాల్సి ఉండగా ఇప్పటి వరకూ 36 లక్షల 26 వేల మందికి ఆధార్ కార్డులొచ్చాయి. 3.37 లక్షల మంది ఆధార్ నమోదు చేయించుకోవాల్సి ఉంది. ఓ కుటుంబం రేషన్ కార్డుపై ఫొటోలో ఉన్నవారిలో కొందరికి ఆధార్ కార్డు రాలేదు. ఎంత మందికి ఆధార్ ఉంటే అంత మందికే రేషన్ ఇస్తామంటున్నారు. ప్రస్తుతం రేషన్ బియ్యం ఒక్కొక్కరికీ 4 కేజీలు చొప్పున గరిష్టంగా కుటుంబానికి 16 కేజీలు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆహార భద్రత పథకం జిల్లాలో అమలులోకి వస్తే రేషన్ కార్డులో ఎంత మంది ఉంటే అంతమందికీ ఒక్కొక్కరికీ 5 కేజీలు చొప్పున బియ్యం ఇస్తారు. అది జరగాలంటే వారంతా ఆధార్‌తో రేషన్ కార్డును అనుసంధానం చేయించుకుని ఉండాలి. మార్చి నుంచే ఆహార భద్రత పథకం అమలు చేసే అవకాశాలున్నాయి.
గడువు పొడిగిస్తారా?
ఆధార్ గడువు పొడిగింపుపై ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడలేదు. గడువు మరో వారం పదిరోజులు పొడిగించే అవకాశం ఉందని, ప్రజలు సాధ్యమైనంత త్వరగా ఆధార్‌తో రేషన్ కార్డు అనుసంధానం చేయించుకుంటే మంచిదని జిల్లా పౌరసరఫరాల అధికారి డి.శివశంకరరెడ్డి అంటున్నారు. గ్యాస్‌కు ఆధార్ లింక్‌ను తప్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటన మాత్రమే చేసి ఊరుకుంది. దీనికి సంబంధించి నేటికీ సంబంధిత డీలర్లకు, అధికారులకు ఎలాంటి ఆదేశాలు ప్రభుత్వం నుంచి రాలేదని డీఎస్‌వో తెలిపారు. అంటే గ్యాస్ సబ్సిడీ కావాలంటే అటు బ్యాంకులోను, ఇటు గ్యాస్ కంపెనీలోనూ ఆధార్ అనుసంధానం చేయించుకోవాల్సిందే.
Advertisement
Advertisement