రేషన్‌కార్డుకు ఆధార్ సీడింగ్‌లో అవకతవకలు
ఒక ఐడీ నంబర్ 10 కార్డులకు అనుసంధానం
ఉద్యోగులు, డీలర్లు కుమ్మక్కు
దొంగతనాలు అరికట్టేందుకు పోలీసులు ఒక మార్గాన్ని ఎంచుకుంటే.. దొంగతనాలు చేయడానికి దొంగలు మరో మార్గాన్ని చూసుకుంటారనే చందంగా ఉంది పౌరసరఫరాల శాఖ పనితీరు. బోగస్ రేషన్ కార్డులను తొలగించి ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు పౌరసరఫరాల శాఖ తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడంలేదు. డీలర్లు పౌరసరఫరాల శాఖ ఉద్యోగులు కుమ్మక్కై బోగస్ రేషన్‌కార్డులను సృష్టించి ప్రజల సొమ్మును దోచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
నెల్లూరు(రెవెన్యూ) : ఖాదర్‌బాషా ఓ ప్రైవేటు ఉద్యోగి. ఇతని ఆధార్ నంబర్ 982866757289. ఈ నంబర్‌ను 10 రేషన్ కార్డులకు అనుసంధానం చేశారు. ఎస్‌కె.మస్తాన్ యూఐడీ 731151265345ని తొమ్మిది కార్డులకు అనుసంధానం చేశారు. ఈ రెండు ఉదాహరణలే కాదు.. ఇలాంటివి జిల్లాలో అనేకం ఉన్నట్లు తెలిసింది. బోగస్ రేషన్ కార్డులను తొలగించేందుకు ప్రభుత్వం ఆధార్ సీడింగ్ చేపట్టింది. అయితే ఆధార్ సీడింగ్‌లో ఉద్యోగులు డీలర్లు చేతివాటం ప్రదర్శించారు. ఫలితంగా రేషన్‌కార్డు లేనివారి ఆధార్ నంబర్లు అనుసంధానం చేశారు. ఒక ఆధార్ నంబర్ 10 నుంచి 12 కార్డులకు అనుసంధానం చేశారు.
ఖాదర్‌బాషా అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి. అతనికి రేషన్ కార్డులేదు. ఆయన ఆధార్ నంబర్‌ను ఎనిమిది కార్డులకు అనుసంధానం చేశారు. చౌకదుకాణాల్లో అతని ఆధార్ నంబర్ అనుసంధానం చేశారు. శంకర్ అనే వ్యక్తికి సంబంధించి ఆధార్ నంబర్ తొమ్మిది కార్డులకు అనుసంధానం చేశారు. తొమ్మిది చౌకదుకాణాల్లో మస్తాన్ రేషన్ తీసుకుంటున్నట్లు రికార్డుల్లో నమోదు చేశారు. ఈ విధంగా జిల్లాలో రెండు లక్షల ఆధార్ నంబర్లు అనుసంధానం చేసినట్లు ఆరోపణలున్నాయి. వాస్తవానికి రేషన్‌కార్డులలో సభ్యులుగా ఉన్న సంగతి వారికే తెలియదు.
ఇదంతా డీలర్లు ఉద్యోగులు కలసి చేసిన చేతివాటమని ఆరోపణలున్నాయి. జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల యూనిట్లు అంటే ఎనిమిది లక్షల కిలోల బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో 1872 చౌకదుకాణాలు, 8.32 లక్షల రేషన్‌కార్డులున్నాయి. ప్రతినెలా కార్డుదారులకు 12 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. నిత్యం వందలాది లారీల రేషన్ బియ్యాన్ని జిల్లా సరిహద్దులుదాటి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నారు. కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారు.
అక్రమ రవాణాకు సంబంధించి కింది నుంచి పై స్థాయి అధికారులకు వరకు మామూళ్లు అందుతున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలను అరికట్టేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రెండేళ్ల కిందట బోగస్ కార్డులు అప్పగించాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనేక మంది డీలర్లు తమ వద్ద ఉన్న బోగస్ కార్డులను కొన్నింటిని మాత్రమే అందజేశారు. బోగస్ కార్డులు పూర్తి స్థాయిలో అందజేయకపోవడంతో రేషన్‌కార్డులకు ఆధార్ అనుసంధానం చేశారు.
డీలర్లు పరిధిలో ఉన్న కార్డుదారుల ఆధార్ నంబర్లు తీసుకొచ్చి సీడింగ్ చేయించాలని అధికారులు ఆదేశించారు. ఈ-పాస్ విధానం అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్ని సూక్తిని డీలర్లు ఆచరించారు. ఆధార్ సీడింగ్ సమయంలో కార్డులు లేని వారిని కుడా సభ్యులుగా చేసి సీడింగ్ పూర్తి చేయించారు. సీడింగ్ సమయంలో లక్షలాది మంది సభ్యులకు ఆధార్ నంబర్లు మంజూరు కాలేదు. అధికారుల ఒత్తిడి, డీలర్ల స్వలాభం కోసం సంబంధంలేని వ్యక్తుల ఆధార్ నంబర్లు అనుసంధానం చేశారు. ఈ విషయంలో ఉద్యోగులు సహకారం లేకుండా డీలర్లు బోగస్ సీడింగ్ ప్రక్రియను పూర్తి చేయలేరు.
సీడింగ్ ప్రక్రియలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగిన సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోను బోగస్ సీడింగ్ ప్రక్రియ జరిగింది. నెల్లూరు, కోవూరు, కావలి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, ఉదయగిరి తదితర మండలాల్లో బోగస్ సీడింగ్ అధికంగా జరిగినట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా ఉన్న రేషన్‌షాపుల ఆధార్ సీడింగ్‌ను పూర్తి స్థాయిలో పరిశీలిస్తే బోగస్ బండారం బయటపడుతుంది.
సాఫ్ట్‌వేర్ బోగస్..
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేందుకు ఆధార్ ప్రక్రియను ప్రవేశపెట్టారు. ఒక వ్యక్తికి సంబంధించిన ఆధార్ నంబరును ఒక పథకానికి అనుసంధానం చేయాల్సి ఉంది. వేరొక గ్రామంలో ఆ వ్యక్తి ఆధార్ నంబర్ సీడింగ్ చేస్తే సర్వర్ స్వీకరించదు. రేషన్‌కార్డులకు అదేవిధంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. బోగస్ కార్డులను తొలగించేందుకు రూపొందించిన సాఫ్ట్‌వేర్ సక్రమంగా పని చేయలేదు. డీలర్లు, ఉద్యోగులు కలసి సాఫ్ట్‌వేర్‌ను లక్ష్యంవైపు పయనించకుండా మార్చివేశారు. విచారణ చేపట్టి సంబంధిత ఉద్యోగులు, డీలర్లపై చర్యలు తీసుకోవాలని కార్డుదారులు కోరుతున్నారు.
పూర్తి స్థాయిలో పరిశీలిస్తాం : ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్
బోగస్ కార్డులను ఏరివేసేందుకే ఆధార్ అనుసంధానం చేసింది. ఆధార్ నంబర్ అనేక కార్డులకు అనుసంధానం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పూర్తి స్థాయిలో పరిశీలన చేపట్టి బోగస్ సీడింగ్‌ను తొలగిస్తాం. ఈ విధంగా చేసిన డీలర్లను సస్పెండ్ చేస్తాం. ఈ-పాస్ విధానం పూర్తి స్థాయిలో అమలైతే ప్రజా పంపిణీ వ్యవస్థ మెరుగుపడుతుంది.
చౌకబారు చేతివాటం
Published Mon, Apr 6 2015 3:07 AM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM
Advertisement
Advertisement