‘ఆధార్‌తో రూ.14 వేల కోట్ల ఆదా’
న్యూఢిల్లీ: రేషన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానించడం ద్వారా రూ.14 వేల కోట్లను ఆదా చేసినట్లు కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ వెల్లడించారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 18 కోట్ల రేషన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానించి నకిలీ వాటిని తొలగించామని తెలిపారు. గురువారం ఢిల్లీలో ప్రారంభమైన ‘ఇండియా ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ సమావేశం–2017’లో మంత్రి ప్రసంగించారు. అవినీతిని అరికట్టడానికి ఈ–పీఓఎస్‌లను ఏర్పాటు చేసి అన్ని చౌక ధరల దుకాణాలను కంప్యూటరీకరిస్తామని చెప్పారు.
ఆహార ధాన్యాలు పాడవకుండా ఉండటానికి, అవి సమయానికి మార్కెట్ చేరడానికి సమర్థవంతమైన రవాణా వ్యవస్థ ఉండాలని సూచించారు. జాతీయ ఉమ్మడి మార్కెట్‌ను రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. రైలు, రోడ్డు, జల మార్గాల మధ్య అనుసంధానత ఏర్పడితే రైతు తన పంటను సమయానికి మార్కెట్‌కు చేర్చి, మెరుగైన ధర పొందుతాడని అన్నారు. ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ, రోడ్డు, రవాణా శాఖ సహాయ మంత్రి మన్‌సుఖ్ ఎల్ మాండవీయ తదితరులు పాల్గొన్నారు.