ఇక కార్డుల కోత!
- వచ్చే నెల 15 తర్వాత సర్వే
- పింఛన్ల గుర్తింపు తరహాలోనే ప్రక్రియ
- రాజకీయ జోక్యంపై ప్రజాసంఘాల ప్రతినిధుల ఆందోళన
- జనవరిలో కొత్త కార్డుల పంపిణీకి కసరత్తు
విజయవాడ : ఆధార్ సీడింగ్ పేరుతో ఇప్పటికే లక్షలాది మంది పేదలకు రెండు నెలలుగా రేషన్ బియ్యంలో కోత విధిస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు ఏదో ఒక కారణం చూపి కార్డులనే తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు పింఛన్ల ఏరివేతకు అనుసరించిన విధానంలోనే సర్వే చేపట్టాలని నిర్ణయించింది. డిసెంబరు 15వ తేదీ తర్వాత ఈ సర్వే నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. జన్మభూమి కార్యక్రమం ముగిసిన తర్వాత దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించే అవకాశం ఉంది. సర్వే అనంతరం బోగస్ కార్డులను తొలగించి, ఆ తర్వాత కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి జనవరి నుంచి కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సర్వేకు సంబంధించిన సమాచారం ప్రభుత్వం ఉన్నతాధికారులకు అందించింది.
ప్రభుత్వ కసరత్తు ఫలించేనా..
జిల్లాలో 2,150 చౌకధరల దుకాణాలున్నాయి. ప్రస్తుతం జిల్లాలో తెల్లకార్డులు 10,46,106, ఏఏవై కార్డులు 66,649, అన్నపూర్ణ కార్డులు 466 ఉన్నాయి. గత ఏడాది రచ్చబండలలో 50వేల వరకు కొత్త కార్డుల కోసం దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం జరుగుతున్న జన్మభూమిలో కూడా రేషన్ కార్డుల కోసం భారీగానే దరఖాస్తులు అందుతున్నాయి. దీంతో ఒక్కో కుటుంబానికి నలుగురు చొప్పున లెక్కిస్తే కార్డులకు, జిల్లా జనాభాకు పొంతన ఉండటం లేదని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.
ఆధార్ అనుసంధానం వల్ల కొన్ని బోగస్ కార్డులు బయటపడుతున్నప్పటికీ, కొందరు పెద్ద రైతులు, డబ్బు ఉన్నవారు కూడా తెల్లకార్డులు కలిగి ఉన్నట్లు సమాచారం. మరోవైపు అనేకమంది డీలర్లు వేల సంఖ్యలో కార్డులను తమ వద్ద పెట్టుకుని సరకులను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్న విషయం పలు సందర్భాల్లో వెలుగులోకి వచ్చింది. విజయవాడలో ఏఎస్‌వోల సంతకాలు కూడా ఫోర్జరీ చేసి దొంగ రేషన్ కార్డులు సృష్టించిన ఘనటలు అనేకం ఉన్నాయి.
ఇటీవల గుడివాడలో నకిలీ రేషన్ కార్డులు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో రేషన్ డీలర్ల పాత్ర కూడా ఉందని తేలింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బోగస్ కార్డుల ఏరివేతకు సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. పింఛన్ల గుర్తింపు కోసం చేపట్టిన తరహాలోనే సర్వే ప్రక్రియ కొనసాగితే స్థానిక నేతలు ఇష్టానుసారంగా కార్డులు తొలగించే పరిస్థితి ఉంటుంది.
కొందరి బోగస్ కార్డులను కొనసాగించే అవకాశముంటుంది. కాబట్టి ప్రభుత్వ కసరత్తు ఫలించేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ జోక్యం లేకుండా అధికారులకే పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తే బోగస్ కార్డులను ఏరివేసి అర్హులకు లబ్ధి చేకూర్చే అవకాశం ఉంటుందని ప్రజాసంఘాల ప్రతినిధులు చెబుతున్నారు.
అందరికీ కొత్త కార్డులు ఇవ్వాలి..
బోగస్ కార్డుల ఏరివేత, కొత్త కార్డుల మంజూరుతోపాటు పాత కార్డుల స్థానంలో అందరికీ కొత్త కార్డులు మంజూరు చేయాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పాత కార్డుల్లో చనిపోయినవారి పేర్లు తొలగించాలని, కొత్తగా ఇంట్లో సభ్యులైన వారి పేర్లు చేర్చాలని సూచిస్తున్నారు. అలా చేసినప్పుడే వాస్తవ లబ్ధిదారులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.