పింఛన్లకు కత్తెర | Pensions scissors | Sakshi
Sakshi News home page

పింఛన్లకు కత్తెర

Published Fri, Sep 19 2014 12:55 AM | Last Updated on Fri, May 25 2018 6:12 PM

పింఛన్లకు కత్తెర - Sakshi

పింఛన్లకు కత్తెర

  • పండుటాకులపై ప్రభుత్వం పడగ!
  •  నేడు,రేపు లబ్ధిదారుల ఇళ్లకు ‘రాజకీయ’ తమ్ముళ్లు
  •  అర్హులను పక్కన పెట్టి అనుయాయుల ఎంపిక?
  •  సామాజిక పింఛనుదారుల్లో గుబులు
  • ఆసరా లేని పండుటాకుల నోట్లో మట్టి కొట్టడానికి సర్కారు సిద్ధమైంది. అర్హతల పరిశీలన పేరుతో సామాజిక పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులను కుదించాలని నిర్ణయించింది. సమగ్ర సర్వే పేరుతో పింఛన్‌దారుల నోటికాడ ముద్దను లాగేసుకోడానికి కుయుక్తులు పన్నుతోంది. అక్టోబర్ 2 నుంచి ప్రారంభమయ్యే పింఛన్ల వారోత్సవాల్లో భాగంగా వడపోతకు ప్రభుత్వం జీవో నంబర్ 135ను జారీ చేసింది. పెన్షన్‌దారుల అర్హతలు నేరుగా పరిశీలించడానికి శుక్ర, శనివారాల్లో ప్రత్యేక ‘రాజకీయ’ కమిటీలను లబ్ధిదారుల ఇళ్లకు పంపిస్తోంది. ఆధార్‌కార్డుల అనుసంధానంతో బోగస్‌లను గుర్తించినప్పటికీ తాజాగా మరోసారి ఇంటింటా సర్వే వెనుక కుట్ర దాగి ఉందన్న వాదన ఉంది. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది.
     
    విశాఖ రూరల్ : వృద్ధులు, వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ.1,500 చొప్పున అక్టోబర్ 2వ తేదీ నుంచి పెన్షన్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈలోగా వీరి సంఖ్యను వీలైనంత తగ్గించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 19, 20 తేదీల్లో ఓ సమగ్ర సర్వే చేపడుతోంది. ఇందుకు గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలను నియమించింది.  

    కేవలం రెండు రోజుల్లో ఇంటింటా సర్వే సాధ్యమేనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 3.2 లక్షల పెన్షన్‌దారులు ఉన్నారు. వీరి వివరాలు ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియ నెలల తరబడి కొనసాగుతోంది. ఇప్పటి వరకు 2.94 లక్షల మంది లబ్ధిదారుల నుంచి ఆధార్‌కార్డులను సేకరించారు. ఇటువంటి పరిస్థితుల్లో రెండు రోజుల్లో 3.2 లక్షల మంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి విచారణ చేపట్టడం సాధ్యమా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    రెండు రోజులు సర్వే అనంతరం ఈ నెల 21న కొత్త వారి నుంచి దరఖాస్తుల ఆహ్వానం, వాటిని వెంటనే పరిశీలించి 22, 23 తేదీల్లో అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇంత హడావుడిగా ఒకటి రెండు రోజుల్లో లక్షల మందిని విచారించడం జరగని పని. ఈ కమిటీలు ఇంటింటికి వెళతాయో? లేదా రచ్చబండ తరహాలో ఒక చోట ఉండి లబ్ధిదారులను అక్కడే రప్పిస్తారో స్పష్టత లేదు. దీనిపై శుక్రవారం గ్రామాల్లో దండోరా వేయనున్నారు.
     
    రాజకీయ ప్రమేయం
     
    సర్వే కమిటీ సభ్యుల్లో గ్రామ సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ సభ్యులు, వార్డు కౌన్సిలర్, సామాజిక కార్యకర్తలు ఉన్నారు. ఈ కమిటీలో టీడీపీకి చెందినవారే అధికం. తమకు ఓటేయలేదనే అనుమానం ఉన్న వారికి పెన్షన్‌రాకుండా చేసే అవకాశం ఉంటుందని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులను పక్కనపెట్టి, తమకు ఇష్టం వచ్చిన వారికి కొత్తగా పింఛన్లు మంజూరు చేయించేలా రాజకీయ నేతలు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
     
    ఆధారాలు చూపకపోతే పెన్షన్ కట్
    సర్వే చేసే రెండు రోజుల పాటు లబ్ధిదారులు అందుబాటులో లేకపోతే వారి పెన్షన్ నిలిపివేయనున్నారు.
     
     రేషన్‌కార్డు ఉండి పెన్షన్ పొందుతూ ఆధార్‌కార్డు లేని వారికి అనర్హులుగా గుర్తించే అవకాశముంది.
     
     పింఛను పొందే లబ్ధిదారులకు రెండున్నర ఎకరాల మాగాణి, ఐదు ఎకరాల మెట్టభూమి ఉంటే అనర్హులుగా గుర్తిస్తారు.
     
     నాలుగు చక్రాల వాహనం ఉన్నా అనర్హులే అవుతారు.
     
     ఒకే కుటుంబంలో ఇద్దరికి పెన్షన్లు ఉంటే ఒకరికి రద్దు చేస్తారు.
     
     ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందుతూ సామాజిక పెన్షన్ తీసుకుంటున్నా రద్దు చేస్తారు.
     
     ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తూ నెలవారీ జీతం తీసుకుంటున్న వారు, అవుట్‌సోర్సింగ్ పద్ధతిపై ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న వారు అనర్హులు.
     
     స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ పొందుతూ సామాజిక పెన్షన్ తీసుకుంటున్న వారికి నిలిపివేస్తారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement