అర్హులమైనా అన్యాయం చేస్తారా?
జలుమూరు: అన్నీ అర్హతలు ఉన్నాయి.. రుణ మాఫీకి అవసరమైన ఆధార్, రేషన్ కార్డులు, బ్యాంక్ ఖాతా జిరాక్స్‌లు అందజేశాం.. అయినా బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం మూలంగా రుణమాఫీకి దూరం అయ్యాం.. అని పలు గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం అల్లాడ ఐఓబీ బ్యాంకు ముందు అల్లాడ, తిమడాం, రామదాసుపేట, అల్లాడపేట, గొటివాడ, సైరిగాం, మహ్మద్‌పురం, అందరం, రామకృష్ణాపురం, పాగోడు తదితర గ్రామాల రైతులు గురువారం ఆందోళన చేశారు. ఆగస్టు నుంచి అన్ని ధ్రువ పత్రాల జిరాక్సు కాపీలు పట్టుకుని అధికారుల చుట్టూ తిరిగి దరఖాస్తు చేసుకున్నా రుణమాఫీ మాత్రం వర్తింపజేయలేదని మండిపడ్డారు. 15 గ్రామాలు పరిధిలో మూడు వేల మంది రైతులకు రుణ మాఫీ అందలేదన్నారు. బ్యాంక్ మేనేజర్‌కి తెలుగు రాకపోవడం.. ఆయన హిందీలో మాట్లాడడం, అది రైతులకు అర్థం కాకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తిందని పలువురు అన్నదాతలు పేర్కొన్నారు.
తర్వాత బ్యాంక్ మేనేజర్, బ్యాంక్ శిక్షణాధికారి ఎస్‌వీఎల్ పట్నాయక్‌ను రైతులు చుట్టిముట్టారు. దీంతో బ్యాంక్ అధికారులు తమ రీజనల్ అధికారులతో ఫోన్‌లో సంప్రదించారు. హుద్‌హుద్ తుపాను వల్ల నెట్‌వర్క్ దెబ్బతిని సాంకేతిక సమస్య వచ్చిందని.. అలాగే 25 నుంచి 30 శాతం మంది రైతులు అవసరమైన వివరాలు ఇవ్వలేదని బ్యాంక్ అధికారులు చెప్పుకొచ్చారు. పూర్తి వివరాలిచ్చిన రైతులకైనా రుణమాఫీ వర్తించాలి కదా అని రైతులు ప్రశ్నించినప్పుడు బ్యాంక్ అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. ఇంటర్‌నెట్ పూర్తిగా పని చేయిడం లేదని, రైతులు ఖాతాలు అప్‌లోడ్ చేసేటప్పుడు సాఫ్ట్‌వేర్ తెరుచుకోకపోవడం వల్ల సరిగ్గా ఆన్‌లైన్ చేయిలేకపోయామని, బ్యాంకు రీజనల్ అధికారులతో మాట్లాడి రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని బ్యాంక్ మేనేజర్ బిశ్వాల్ ప్రసాద్ తెలిపారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.