jalumuru
-
హుండీలో నగదు లేదని..దేవుని విగ్రహాలు ధ్వంసం
సాక్షి,జలుమూరు: డబ్బు కోసం హుండీని కొల్లకొట్టాడు. అందులో ఏమీ దొరక్కపోవడంతో ఆ కోపాన్ని సమీపంలో ఉన్న విగ్రహాలపై చూపించి ధ్వంసం చేశాడు. ఈ కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనకు సంబంధించి డీఎస్పీ ఎం.మహేంద్ర, నరసన్నపేట సీఐ ఎం.తిరుపతిరావులు జలుమూరు పోలీస్‌స్టేషన్ వద్ద విలేకరులకు వివరాలు వెల్లడించారు. జలుమూరు మండలం పద్మనాభ కొండపై లక్ష్మీదేవి, దుర్గామాత, వినాయక వాహనం ఎలుక విగ్రహాలు జూలై 24న ధ్వంసమయ్యాయని, ఇందుకు బాధ్యుడిగా సైరిగాం గ్రామానికి చెందిన చెరుకుపల్లి సంజయ్గా గుర్తించామని చెప్పారు. ఈయన తాబేళ్లు, ఉడుములు పట్టుకుని పద్మనాభ కొండపైకి వెళ్లి ఎవరూ లేకపోవడంతో ఆలయం హుండీని పగలుకొట్టాడని తెలిపారు. అందులో నగదు లేకపోవడంతో కోపానికి గురై విగ్రహాల ధ్వంసానికి పాల్పడినట్లు చెప్పారు. ఆరు నెలల క్రితం కూడా ఇదే ఆలయం హుండీని కొట్టేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు హెచ్చరించి వదిలేశారని పేర్కొన్నారు. 20 రోజుల క్రితం కూడా సంజయ్ ఇక్కడికి వచ్చినట్లు గ్రామస్తులు గుర్తించారని తెలిపారు. విగ్రహాల ధ్వంసం అనంతరం ఒడిశా వెళ్లిపోయిన ఈయన ఆధార్ కార్డుతోపాటు కుటుంబాన్ని తీసుకెళ్లేందుకు స్వగ్రామం సైరిగాం వచ్చాడని, ఈ క్రమంలోనే కొమనాపల్లి వద్ద పట్టుకున్నామని చెప్పారు. ఆలయ అర్చకుడు అగస్తి నారాయణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ ఆర్.దేవానంద్ తెలిపారు. అనంతరం కోటబొమ్మాళి కోర్టులో హాజరుపరిచామన్నారు. -
అయ్యా.. మాది ఏ కులం?
సాక్షి, జలుమూరు(శ్రీకాకుళం) : ఆయ్యా మేము ఏ కులానికి చెందుతామో అధికారులు నిర్దారించలేకపోతున్నారు.. పల్స్ సర్వే(ప్రజాసాధికార సర్వే)లో కులం స్థానంలో ఇతరులుగా నమోదు చేస్తున్నారు.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొంతమందికి ఎస్టీలుగా ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం మమ్మల్ని పూర్తిగా విస్మరించింది. కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు పొందలేకపోతున్నామని పలువురు ఏనేటి కొండ కులాలకు చెందిన వారు తమ ఆవేదనను మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు వివరించారు. జలుమూరులో శుక్రవారం మంత్రిని కలిసి తమ గోడు వెల్లబుచ్చారు. జిల్లాలో కోటబొమ్మాళి, మందస, జలుమూరు, సంతబొమ్మాళి, పలాస, ఇచ్ఛాపురం తదితర మండలాల్లో ఏనేటి కొండ జాతులకు చెందిన సుమారు 3వేల కుటుంబాలు జీవిస్తున్నాయని ఆ సంఘం నాయకుడు పాలకి కిరణ్‌కుమార్ మంత్రికి వివరించారు. తమ ఆచార, వ్యవహారాలు, సాంప్రదాయాలు గిరిజనుల మాదిరిగా ఉండడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టీలుగా గుర్తించి కులధ్రువీకరణ పత్రాలు జరీ చేసిందన్నారు. కానీ టీడీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేయడంతో తామంతా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు, తమ పిల్లలకు స్కాలర్షిప్లు అందక, ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. తమకు కులధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. మంత్రి స్పందిస్తూ జిల్లాలో ఇలా ఎంతమంది ఉన్నారో గుర్తించి సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. స్టాఫ్‌నర్సుల సమస్యలు పరిష్కరించాలని వినతి శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో పనిచేస్తున్న స్టాఫ్‌నర్సుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా స్టాఫ్‌నర్సుల సంఘం ప్రతినిధులు మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు వినతిపత్రం అందజేశారు. నరసన్నపేటలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం మంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. 500 పడకల ఆస్పత్రిని 700 పడకలకు విస్తరించారని, కానీ ఆమేరకు స్టాఫ్‌నర్సుల నియామకం చేపట్టకపోవడంతో రోగులకు పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోతున్నామన్నారు. 254 మంది నర్సులు ఉండాల్సి ఉండగా 80 మంది వరకు డిప్యుటేషన్లపై ఇతర చోట్ల పనిచేస్తున్నారని అన్నారు. డిప్యుటేషన్ల రద్దయ్యేలా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో సంఘం అధ్యక్షురాలు ఎన్వీ లక్ష్మి, నిర్మలాదేవి, రోషినీతార తదితరులు ఉన్నారు. ఏ కులమో గుర్తించకపోవడంతో నష్టపోతున్నాం మేము ఏ కులానికి చెందిన వారిమో ప్రభుత్వం గుర్తించకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. గతంలో ఏనేటి కొండగా గుర్తించి కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేవారు. కానీ టీడీపీ ప్రభుత్వం వాటిని నిలుపుదల చేసంది. మా పిల్లల జీవితాలకు భరోసా లేకుండాపోయింది. ప్రభుత్వం మా సమస్యను పరిష్కరించాలి. – సంకిలి లక్ష్మి, కస్తూరిపాడు, కోటబొమ్మాళి కులధ్రువీకరణ పత్రాలు అందించాలి కులం గుర్తింపు విషయంలో మేము ఇప్పటికే చాలా నష్టపోయాం. మా పిల్లలు మా మాదిరిగా కాకూడదు. ప్రజాసాధికార సర్వే చేయించి మాకు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలి. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి ఆదుకోవాలి. – పి.కిరణ్‌కుమార్, ఏనేటి కొండ కులసంఘం నాయకుడు -
కాలువను మింగేసిన కరకట్ట!
సాక్షి, జలుమూరు (శ్రీకాకుళం): కరకట్టల నిర్మాణ పనుల పుణ్యమా అని నగిరికటకం వద్ద ఉన్న వంశధార ఓపెన్ హెడ్ కాలువ కనుమరుగు కానుంది. బ్రిటీష్ కాలంలో (1865) తవ్విన ఈ కాలువ పొడవు 16.7కిలో మీటర్లు. సుమారు 2,720 ఎకరాలకు సాగునీరు అందేది. వంశధార నదిని కరకవలస వద్ద అనుసంధానం చేసి జలుమూరు మండలం వరకే ఈ కాలువను పరిమితం చేశారు. కరకవలస, శ్రీముఖలింగం, నగిరికటకం, అచ్చుతాపురం, కొమనా పల్లి, తిమడాం, సురవరం, సైరిగాంతోపాటు మరికొన్ని గ్రామాల్లో రెండు పంటలకు నీరందించేదని ఆయా గ్రామాల రైతులు చెబుతున్నారు. 1982లో వంశధార నది వరదలు, నీటి ప్రవాహం ఎక్కువ అవ్వడంతో కరకవలస వద్ద కొంత అడ్డుకట్ట వేశారు. 10 ఆర్, 7 ఆర్, 11 ఆర్, 12 ఆర్, మురికి కాలువలు నుంచి ప్రవహించే నీరు ఈ కాలువలో కలిసి పంట పొలాలను వరద బారీ నుంచి రక్షించేది. ప్రస్తుతం ఈ కాలువ కనుమరుగవ్వడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు కిలో మీటర్ల మేర కప్పేశారు.. సుమారు రూ.56 కోట్లతో వంశధార కరకట్ట నిర్మాణం 2010 నుంచి జరుగుతోంది. ఈ కరకట్టల నిర్మాణంలో డిజైన్లు కూడా సరిగ్గా చూడకుండా ఆమోదం తెలిపారు. రైతుల అభ్యర్థనలు కనీసం సంబంధిత గుత్తేదారు పట్టించుకోకుండా 150 ఎళ్ల చరిత్ర గల ఈ కాలువకు కరకట్టతో కప్పేసి పూర్తిగా తెరమరుగు చేయడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ కాలువ కరకవలస నుంచి శ్రీముఖలింగం వరకు సుమారు ఐదు కిలో మీటర్లు కప్పేశారు. నెట్వర్క్ సిస్టంతో అభివృద్ధి జరిగేనా? నరసన్నపట డివిజన్ పరిధిలోని ఐదు ప్రధాన ఓపెన్ హెడ్ కాలువలతోపాటు బైరి ఓపెన్ హెడ్ కాలవ, మేజర్ కాలువ, అనుబంధ కాలువల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.68 కోట్లు మంజూరైంది. కాలువల్లో ఆక్రమణలు తొలగించడం, పురాతన కాలువలను సైతం అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు చేశారు. ఈ పనుల్లో నగిరికటకం కాలువ కూడా ఉంది. ఈ కాలువ అభివృద్ధికి సుమారు 2.88 కోట్లు మంజూరయ్యాయి. గత పదేళ్లుగా ఈ కాలువ అభివృద్ధికి నిధులు మంజూరవ్వడం, సాంకేతిక సమస్యలు రావడం, అంచనాలు పెంచడం వంటివి జరిగాయి. గత టీడీపీ ప్రభుత్వంలో కూడా కొంత వరకు పనులు చేశారే తప్ప.. కాలువ కనుమరుగు అవుతుందని రైతులు చెప్పినా సంబంధిత అధికారులు పట్టించుకోలేదు. ఇంత జరుగుతున్నా వంశధార అధికారులు నగిరికటకం కాలువ పరిస్థితి చూడలేదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారుల సూచనలు పాటిస్తాం.. కరకట్టతో కప్పేసిన కాలువ పనులు మళ్లీ ఎలా చేస్తారు? రైతులకు ఎలా సాగు నీరందిస్తారని హిరమండలం డివిజన్ డీఈఈ ప్రభకరరావును సాక్షి వివరణ కోరింది. అక్కడ అంచనాలు తయారు చేసే సమయంలో తాను లేనని చెప్పారు. ఉన్నాతాధికారుల సూచనలతో పనులు చేస్తామన్నారు. అదేచోట వంశధార నదికి అనుసంధానంగా కాలువను తెరిపించేందుకు ప్రయత్నిస్తామన్నారు. -
పాడు నిద్ర ప్రాణం తీసింది
జలుమూరు: పాడు నిద్ర ప్రాణం తీసింది. రోజంతా కష్టపడి రాత్రి వేళ నిద్రపోతున్న వ్యక్తి పైనుంచి టిప్పర్ దూసుకెళ్లడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘటన వంవధార నది కరకట్టల నిర్మాణా పనుల్లో భాగంగా కొమనాపల్లి సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రాజాం మండలం పెనుబాక గ్రామానికి చెందిన చీడి రమణ(35) ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కరకట్టల పనుల్లో భాగంగా రమణ తనకున్న బుల్డోజర్తో మట్టిని సరిచేసే పనుల్లో మంగళవారం సాయంత్రం వరకూ పాల్గొన్నాడు. రాత్రికి కరకట్టల గట్టు మీదే పడుకొన్నాడు. ఇదే సమయంలో గట్టుకు మట్టి వేసే పనిలో భాగంగా మాకీయవలసకు చెందిన టిప్పర్ డ్రైవర్ మంత్రి దాలయ్య వెనుక నుంచి మట్టి వేస్తూ వాహనంతో రమణను గమనించకుండా అతని పైనుంచి వెళ్లిపోయాడు. దీంతో రమణ శరీరం నుజ్జునుజ్జు అయి..అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కొంతమంది మాట్లాడుతూ కరకట్టల నిర్మాణ పనులు చేసే వారంతా ఎప్పుడు గట్టుపైనే నిద్రిస్తారన్నారు. మంగళవారం రాత్రి కూడా శ్రీముఖలింగం గ్రామానికి చెందిన చింతం రాంబాబు, చీడి రమణ ఒకే చోట పడుకున్నారని చెప్పారు. అయితే వాహనం వస్తున్న శబ్దానికి తెలివి తెచ్చుకొని రాంబాబు పక్కకు వెళ్లగా రమణపై నుంచి టిప్పర్ వెళ్లిపోయినట్టు తెలిపారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే నా భర్త మరణానికి కారణం! కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే నా భర్త మరణించాడని రమణ భార్య సరోజిని రోదిస్తూ చెప్పింది. బుల్డోజర్ అద్దెతోపాటు పని చేసినందుకు వేతనం కూడా మూడు నెలలుగా చెల్లించలేదని వాపోయింది. ఎప్పుడు ఫోన్ చేసినా కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తే ఇంటికి వస్తానని తన భర్త చెప్పేవాడని..ఇంతలోనే తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడని విలపించింది. ఇంత ప్రమాదం జరిగినా సంబంధిత కాంట్రాక్టర్ పత్తా లేకుండా పోయాడని మృతుని బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. కాంట్రాక్టర్ వస్తే గాని రమణ మృతదేహన్ని తీసుకెళ్లమని తేల్చి చెప్పి గొడవకు దిగారు. దీంతో పోలీసులు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. విగత జీవిగా పడి ఉన్న తండ్రి మృతదేహాన్ని చూసిన రమణ కొడుకు మణికంఠ, కూతురు హేమలతాలు కన్నీరుమున్నీరయ్యారు. సరోజిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ డి.విజయ్‌కుమార్ తెలిపారు. -
అర్హులమైనా అన్యాయం చేస్తారా?
జలుమూరు: అన్నీ అర్హతలు ఉన్నాయి.. రుణ మాఫీకి అవసరమైన ఆధార్, రేషన్ కార్డులు, బ్యాంక్ ఖాతా జిరాక్స్‌లు అందజేశాం.. అయినా బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం మూలంగా రుణమాఫీకి దూరం అయ్యాం.. అని పలు గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం అల్లాడ ఐఓబీ బ్యాంకు ముందు అల్లాడ, తిమడాం, రామదాసుపేట, అల్లాడపేట, గొటివాడ, సైరిగాం, మహ్మద్‌పురం, అందరం, రామకృష్ణాపురం, పాగోడు తదితర గ్రామాల రైతులు గురువారం ఆందోళన చేశారు. ఆగస్టు నుంచి అన్ని ధ్రువ పత్రాల జిరాక్సు కాపీలు పట్టుకుని అధికారుల చుట్టూ తిరిగి దరఖాస్తు చేసుకున్నా రుణమాఫీ మాత్రం వర్తింపజేయలేదని మండిపడ్డారు. 15 గ్రామాలు పరిధిలో మూడు వేల మంది రైతులకు రుణ మాఫీ అందలేదన్నారు. బ్యాంక్ మేనేజర్‌కి తెలుగు రాకపోవడం.. ఆయన హిందీలో మాట్లాడడం, అది రైతులకు అర్థం కాకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తిందని పలువురు అన్నదాతలు పేర్కొన్నారు. తర్వాత బ్యాంక్ మేనేజర్, బ్యాంక్ శిక్షణాధికారి ఎస్వీఎల్ పట్నాయక్‌ను రైతులు చుట్టిముట్టారు. దీంతో బ్యాంక్ అధికారులు తమ రీజనల్ అధికారులతో ఫోన్లో సంప్రదించారు. హుద్‌హుద్ తుపాను వల్ల నెట్వర్క్ దెబ్బతిని సాంకేతిక సమస్య వచ్చిందని.. అలాగే 25 నుంచి 30 శాతం మంది రైతులు అవసరమైన వివరాలు ఇవ్వలేదని బ్యాంక్ అధికారులు చెప్పుకొచ్చారు. పూర్తి వివరాలిచ్చిన రైతులకైనా రుణమాఫీ వర్తించాలి కదా అని రైతులు ప్రశ్నించినప్పుడు బ్యాంక్ అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. ఇంటర్నెట్ పూర్తిగా పని చేయిడం లేదని, రైతులు ఖాతాలు అప్లోడ్ చేసేటప్పుడు సాఫ్ట్వేర్ తెరుచుకోకపోవడం వల్ల సరిగ్గా ఆన్లైన్ చేయిలేకపోయామని, బ్యాంకు రీజనల్ అధికారులతో మాట్లాడి రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని బ్యాంక్ మేనేజర్ బిశ్వాల్ ప్రసాద్ తెలిపారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. -
వెంటాడి... వేటాడి...
జలుమూరు: వారంతా దగ్గరి బంధువులే. చిన్న పొలం విషయమై తలెత్తిన తగాదా నాలుగేళ్లుగా కక్షలు, కార్పణ్యాలకు కారణమైంది. చివరకు ప్రత్యర్థులు వెంటాడి వేటాడడంతో అన్నయ్య దారుణ హత్యకు గురవగా తమ్ముడు ప్రాణాపాయ స్థితిలో శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. జలుమూరు మండలం పెద్దదూగాంలో సోమవారం ఉదయం జరిగిన సంఘటన వివరాలు ఇవీ... అన్నదమ్ములైన ధర్మాన లచ్చుమయ్య(40), భాస్కరరావు ఉదయం 6.20 గంటలకు పొలం పనులకు బయలుదేరారు. గ్రామ శివార్లకు వచ్చేసరికి సందుల్లోంచి నాగలితో ఎడ్లు వెళ్లలేవని లచ్చుమయ్య మరో తోవలో పొలం వైపు వెళ్లాడు. భాస్కరావు ఇంకో తోవలో వెళుతుండగా ప్రత్యర్థులు ధర్మాన ముఖలిం గం, కుమారుడు వెంకటరమణ, భార్య తవిటమ్మ మారణాయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో భాస్కరరావు చేయి విరిగిపోగా పక్కటెముకలు తీవ్రం గా గాయాలు తగిలాయి. ఆయన కాపాడాలంటూ కేకలు వేయగా చుట్టుపక్కల వారు రావడంతో ప్రత్యర్థులు పారిపోయారు. విషయం తెలిసిన లచ్చుమ య్య కుమారుడు భానుప్రసాద్ తన తండ్రికీ అపా యం ఉందని అడ్డతోవలో సైకిల్‌పై పొలం వైపు వెళ్లాడు. భాస్కరరావు తప్పించుకోవడంతో ప్రత్యర్థులు లచ్చుమయ్యను వెంటాడి వేటాడారు. కత్తి, బల్లెంతో తల, నడుము, వీపు, చేయిపై పలుసార్లు పొడిచారు. ఆ సమయంలో అక్కడకు చేరిన భానుప్రసాద్‌ను కూడా హతమార్చడానికి ప్రయత్నించగా ఆయన తప్పించుకుని గ్రామంలోకి వచ్చాడు. ఇం తలో చుట్టుపక్కల రైతులు, కూలీలు కేకలు వేయడం తో దుండగులు లచ్చుమయ్యను వదిలి వెళ్లిపోయారు. కొనూపిరితో ఉన్న లచ్చుమయ్యను ఇంటికి తీసుకువచ్చిన కొద్దిసేపటికే ప్రాణం విడిచాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. చిన్నపాటి వివాదమే... లచ్చుమయ్య, ముఖలింగంలు దగ్గర బంధువులే. అయితే పొలం గట్టు విషయంలో నాలుగేళ్లుగా గొడవపడుతుండేవారని గ్రామస్తులు తెలిపారు. తరచూ గట్టు కొట్టి పొలం కలుపుకోవడం, కళ్లాల వద్ద కొట్లాడుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయని చెప్పారు. ముఖలింగం ఆది నుంచి వివాదస్పదడని, రెండేళ్లు క్రితం ధర్మాన ఈశ్వరరావు అనే వ్యక్తిని కళ్లం తగాదాలో తలపగలు కొట్టాడని పేర్కొన్నారు. పోలీస్ పికెట్ గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. లచ్చుమయ్య కుటంబానికి రక్షణ ఏర్పాటు చేసినట్లు నరసన్నపేట సీఐ అర్.వి.వి.ఎస్.ఎన్.చంద్రశేఖర్ తెలిపారు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. క్లూస్, డాడ్ స్క్వాడ్ గుండాలు చెరువు వద్ద కొలతలు, మృతుడు లచ్చుమయ్య రక్తపు మరకలు ఆనవాళ్లు తీసుకున్నారు. అడిషనల్ ఎస్పీ శ్రీదేవిరావు, క్లూస్ టీమ్ సీఐ కోటేశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. జలుమూరు ఎస్ఐ డి.విజయ్‌కుమార్ కేసు నమోదు చేయగా సీఐ దర్యాప్తు చేస్తున్నారు. -
టీడీపీ దిగజారుడు రాజకీయం !
జలుమూరు, న్యూస్‌లైన్: చల్లవానిపేట, అల్లాడ ప్రాథమిక సహకార సం ఘాల అధ్యక్షులను తప్పించేందుకు కుట్ర జరుగుతున్నట్టు తెలిసింది. ఎన్నికల అనంతరం ఇటీవల టీడీపీలో చేరిన ఓ మండల నాయకుడు మం త్రాంగంతో వీరిపై అవిశ్వాసం తీర్మానం పెట్టి గద్దె దించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. చల్లవానిపేట, అల్లాడ పీఏసీఎస్‌లకు అధ్యక్షులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు ఉండడంతో వీరిని ఎలాగైనా తప్పించేందుకు కొంతమంది టీడీపీ నాయకుల సహకారంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు వారం రోజల క్రిందట పథక రచన జరిగినట్టు సమాచారం. వాస్తవంగా ‘దేశం’ అధినాయకత్వానికి అవిశ్వాస తీర్మాన పద్ధతి ఇష్టం లేకపోయినా అంతా దగ్గరుండీ నేను నడిపిస్తానని మండల నాయకుడు భరోసా ఇచ్చినట్టు తెలిసింది. గతంలో కూడా మండల సర్పంచ్ల అధక్షుడి ఎన్నికల్లో కూడా ఇదే నాయకుడు టీడీపీకి చెందిన సర్పంచ్ల వర్గానికి ఓ వ్యక్తిని అధ్యక్షుడిగా చేసేందుకు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ వైఎస్ఆర్ సీపీ సర్పంచ్‌లు చాక చక్యంగా తిప్పికొట్టడ ంతో అప్పట్లో మిన్నకుండి పోయాడు. జలుమూరు మండలంలో బలంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్‌ను దెబ్బతీసే విధంగా ఈ నాయకుడు ఇప్పుడు పావులు కదుపుతున్నారు. అల్లాడ సొసైటీలో మొత్తం 13 టీసీలు ఉన్నారు. వీరిలో ఏడుగురు అవిశ్వాస తీర్మాన పత్రాలపై సంతకాలు చేసి జిల్లా కేంద్రంలోని సెంట్రల్ బ్యాంక్ డీఅర్కు ఇప్పటికే నోటీసీలు ఇచ్చారు. చల్లవానిపేట సొసైటీలో కూడా 13 సభ్యులు ఉండగా, అవిశ్వాస తీర్మానం చేసేందుకు 8 మంది నోటీసులు పంపారు. అయితే నోటీసులు పంపేందుకుఏడుగురు సరిపోతారు కానీ అవిశ్వాసం పెట్టేందుకు మాత్రం కోరమ్ సభ్యులు 9 మందికి తక్కువగా ఉండకూడదని సొసైటీ అధికారులు చెబుతున్నారు. కాగా కొద్ది రోజుల కిందటే అధికారంలోకి వచ్చిన టీడీపీ అప్పుడే దిగజారుడు రాజకీయాలకు పాల్పడడంపై పలువురు మండిపడుతున్నారు. -
లేబర్ మేస్త్రీ కొడుకు సివిల్స్ విజేత
జలుమూరు : మండలంలోని జోనంకి పంచాయతీ గంగాధరపేటకు చెందిన పూజారి కృష్ణారావు సివిల్ సర్వీస్-2013లో 776 ర్యాంక్ సాధించారు. జిల్లాతోపాటు స్వగ్రామానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారు. తండ్రి అప్పలనాయడు వృత్తిరీత్యా లేబర్ మేస్త్రీ. తల్లి భూదేవి గృహిని. తల్లిదండ్రులిద్దరూ నిరక్షరాస్యులే. నిర్లక్షరాస్యుల ఇంట సర్వతీ పుత్రుడు జన్మించాడు. కృష్ణారావు ఉన్నత శిఖరాలను అధిరోహించి యవతీ యవకులకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన ఒకటి నుంచి ఐదో వరకు హుస్సేనుపురం పంచాయతీ తమ్మయ్యపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నారు. ఆరో తరగతి విశాఖపట్నంలో చదివారు. ఏడు నుంచి 10వ తరగతి వరకు సింహాచలం రెసిడెన్సియల్ స్కూల్లో విద్యనభ్యసించారు. ఇంటర్, డిగ్రీ కూడా విశాఖలో పూర్తి చేశారు. చెన్నైలో అప్లయిడ్ బయోలాజీ (ఎంస్సీ) పూర్తి చేశారు. కృష్ణారావు ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు సిద్ధమయ్యారు. 2011 కేంద్ర హోమంత్రిత్వ శాఖలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. లక్ష్యం కోసం నిరంతరం సాధన చేయాలి మనం ఏది సాధించాలనుకున్నామో ఆ లక్ష్యం కోసం నిరంతరం సాధన చేయాలి. అన్నిటి కంటే మన మీద మనకు నమ్మకం ప్రధానం. లక్ష్యాన్ని చేరుకునేందుకు నిజాయితీగా కష్టించి పనిచేయాలి. తరువాత విజయం మనల్ని వరిస్తుంది. నేను ఈ స్థాయికివెళ్లడానికి తల్లిదండ్రులుతోపాటు భార్య మనీషా ఎంతో సహకారం అందించారు. భార్య వృత్తిరీత్తా వైద్యురాలు. ఆమె ఎంతో బిజీగా ఉన్నా... నా బాధ్యతలను నిరంతరం గుర్తు చేసి, విజయానికి ఎంతో సహకారం అందించారు. పూజారి కృష్ణారావు, సివిల్స్ విజేత -
పదిలో పది సాధిస్తాం..!
జలుమూరు/సంతకవిటి: మా పాఠశాలలో మీ పిల్లలను చేర్పించండి.. ప్రమాణాలతో కూడిన విద్యను బోధిస్తాం.. క్రమ శిక్షణా యుత విద్యను అందిస్తాం.. పదో తరగతిలో శతశాతం ఫలితాలతో పాటు పదికి పది పాయింట్లు సాధించేలా తీర్చిదిద్దుతాం... పిల్లల భవిష్యత్‌కు బాటలు వేస్తామంటూ జలుమూరు మండలం పాగోడు, సంతకవిటి ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ప్రచారం ఆకట్టుకుంటోంది. తమపై నమ్మకం ఉంచి పాఠశాలల్లో చేర్పించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చజెబుతున్నారు. అర్హత గల ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల సొంతమని, వేలకువేలు ఫీజులు కట్టి ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణం మధ్య అవగాహనతో కూడిన విద్యను బోధిస్తున్నామని, విద్యార్థిని పరిపూర్ణుడిగా తీర్చిదిద్దుతామని చెబుతున్నారు. గత నెల విడుదలైన పదోతరగతి ఫలితాల్లో పాగోడు ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి అందవరపు శ్యామ్ సుందరరావు 10కి 10 పాయింట్లు సాధించాడని విడమర్చి చెబుతున్నారు. హెచ్ఎం ఉప్పాడ శాంతారావు, ఉపాధ్యాయులు ఎస్.వి.వెంకటరమణ, ఎం.శారద, డి.గణేష్, కె.శ్రీనివాసరావు, సీహెచ్ చంద్రభూషణరావు, టి.ఉమామహేశ్వరరావు, టి.గుప్తాలాల్, అచ్చుతరావు, అశోక్ కుమార్ పాడీ, ఎస్.శ్రీనివాసరావుల ఇంటింటి ప్రచారానికి గ్రామీణ ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రోజురోజుకూ ప్రవేశాలు పెరుగుతున్నాయి. సంతకవిటిలో హెచ్ఎం త్రినాథరావు, ఆంగ్ల బోధకుడు అదపాక దామోదరరావు, ఇతర ఉపాధ్యాయులు ప్రచారం చేశారు. -
యువనాయకుల ప్రచార హోరు
జలుమూరు, న్యూస్‌లైన్: మండలంలో యువనాయకుల ప్రచారం జోరందుకుంది. యువనాయకత్వాన్ని సమర్ధించాలని, వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని సీఎం చేయూలంటూ శ్రీముఖలింగం, కరకవలస, కరకవలస కాలనీతో పాటు పలుగ్రామాలో నరసన్నపేట వైఎస్సార్ సీపీ ఎమ్మేల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం లోక్‌సభ అభ్యర్థి రెండి శాంతికి ఓటేయూలంటూ ఓటర్లను అభ్యర్థించారు. రెడ్డి శాంతి తనయడు రెడ్డి శ్రావణ్‌కుమార్, కృష్ణదాస్ తనయుడు ధర్మా రామలింగంనాయడు, మాజీ ఎంపీపీలు బగ్గు రామకృష్ణ, వెలమల కృష్ణారావు కొడుకులు బగ్గు గౌతమ్, వెలమల రాజేంద్రతో పాటు యవసర్పంచ్‌లు కనుసు రవి, పైడి విఠలరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కన్వీనర్ ధర్మాన ప్రసాద్‌లు కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. జగన్ సీఎం అరుుతే ఒనగూరే ప్రయోజనాలను తెలియజేశారు. నేతల తనయులు ప్రచారానికి రావడంతో గ్రామాల్లో సందడి వాతావరణ నెలకొంది. అడుగడుగునా ప్రజలు వీరికి స్వాగతం పలికారు. జగన్ వెంటనే ఉంటామంటూ భరోసా ఇచ్చారు. -
జనజాతర
శ్రీముఖలింగేశ్వరుని చక్రతీర్థస్నాన ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తజనం పోటెత్తించి. భక్తిపారవశ్యంతో వంశధార తీరాన్ని ముంచెత్తింది. బురద నీరు, సౌకర్యాల లేమి వంటి సమస్యలను ఏమాత్రం ఖాతరు చేయకుండా లక్షల సంఖ్యలో భక్తులు ముఖలింగేశ్వరుని దర్శనమే పరమావధిగా తరలిరావడంతో శ్రీముఖలింగం, మిరియాపల్లి తీరాలు కిటకిటలాడాయి. జలుమూరు/ఎల్.ఎన్.పేట, శ్రీముఖలింగేశ్వరుని చక్రతీర్థస్నానాలతో వంశధార నదీ తీరం శివభక్త సాగరంగా మారింది. శివనామ స్మరణతో ఘోషించింది. నాలుగు రోజులుగా జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆదివారం స్వామివారి చక్రతీర్థస్నాన ఘట్టాన్ని నిర్వహించారు. ఉదయం 11.30 గంటలకు ఆలయం నుంచి స్వామివారి తిరువీధి ప్రారంభమైంది. ఇది నదికి చేరే సరికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. సంప్రదాయం ప్రకారం ఎల్.ఎన్.పేట మండలం మిరియప్పల్లి వద్ద గ్రామానికి చెందిన లుకలాపు కుటుంబీకులు శివపార్వతుల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా జలాభిషేకం చేశారు. నేతవస్త్రాలను సమర్పించారు. బారులు తీరిన భక్తులు స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. శనివారం అర్ధరాత్రి దాటిన నుంచి స్వామివారి దర్శనం కోసం క్యూకట్టారు. దీంతో శ్రీముఖలింగం వీధులు భక్తులతో కిటకిటలాడారుు. జిల్లాతో పాటు విజ యనగరం, విశాఖ పట్నం, ఒడిశా నుంచి సుమారు మూడు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు అంచనా. ఏటా 1.50 లక్షల మంది చక్రతీర్థస్నానాల్లో పాల్గొనేవారు. ఈ ఏడాది రెట్టింపు స్థారుులో భక్తులు రావడంతో వంశధార నదిలో నీరు చాలక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. స్నానం ఘట్టం పూర్తరుున తరువాత స్వామివారిని పందిర వరకూ తీసుకెళ్లలేదు. దీంతో చాలమంది భక్తులకు ముఖలింగేశ్వరిని చూసే భాగ్యం కలగలేదు. స్వామివారిని ప్రధాన ఆలయం నుంచి తీసుకెళ్లేముందు పర్లాఖిమిడి రాజు పేరిట అర్చన చేశారు. బెంగుళూరు నుంచి తెచ్చిన పూలతో ఉత్సవవిగ్రహాలను అలంకరించారు. అనంతరం నందివాహనానికి తహశీల్దార్ పీవీఎల్ఎన్ గంగాధరరావు కొబ్బరికాయ కొట్టి తీరువీధి ప్రారంభించారు. వీఐపీలు, పోలీస్ కుటుంబ సభ్యులకే స్వామివారి దర్శన భాగ్యం కలిగింది. దీంతో సామాన్యులకు నిరాశే ఎదురైంది. చక్రతీర్థస్నానం అనంతరం స్వామివారిని అదే నంది వాహనంపై తెచ్చి ప్రధానాలయ గర్బగుడిలో యథాస్థానంలో ఉంచారు. సాయంత్రం లింగాభరణ కార్యక్రమం నిర్వహించి స్వామివారికి సంప్రోక్షణ చేశారు. కానరాని పంచాయతీ సిబ్బంది భక్తులకు పలువురు దాతలు వాటర్ ప్యాకెట్లు, పులిహోర ప్రసాదాలు అందించినా కనీసం పంచాయతీ సిబ్బంది ఎక్కడా కనిపించలేదు. టీడీపీ నాయకులు బగ్గు రమణమూర్తి, నగిరికటగాంకు చెందిన ఎం.రమణమూర్తి అన్నదానం చేశారు. సత్యసాయి సేవా సమితి సభ్యుడు పైడి శెట్టి వెంకటరమణ, శ్రీముఖలింగ ఆలయ మాజీ చైర్మన్ కె.హరిప్రసాద్‌లు తాగునీటి ప్యాకెట్లు పంపిణీ చేశారు. డీఎస్పీ పి.శ్రీనివాసరావు,ట్రైనీ డీఎస్పీ ఎం.స్నేహిత అధ్వర్యంలో 400 మంది పోలిస్ బందోబస్త్ నిర్వహించగా అదనంగా 90 మంది వరకూ ప్రత్యేక బలగాలును ఉపయోగించారు. అర్టీసీవారు శ్రీకాకుళం, టెక్కలి డిపోల నుంచి 50 వరకూ అదనపు బస్‌సర్వీసులు నడిపారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సీహెచ్ ప్రభాకరరావు, ఆలయ చైర్మన్ బి.బలరాం, అర్చకసంఘ అధ్యక్షుడు టి.పెద్దలింగన్నతో పాటు అర్చకులు పాల్గొన్నారు. విగ్రహాలు దించేందుకు వాదులాట చక్రతీర్థస్నానాలకు మిరియప్పల్లి రేవువద్ద ఏర్పాటు చేసిన పందిరి వద్దకు తీసుకువచ్చిన పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను నంది వాహనంపై నుంచి దించేందుకు పూజారులు అంగీకరించకపోవడంతో మిరియాపల్లి గ్రామానికి చెందిన లుకలాపు కుటింబీకులు నిలదీశారు. సంప్రదాయం ప్రకారం విగ్రహాలను నదిలోకి దించి స్నానమాచరించాలని పట్టుబట్టారు. దీంతో వీరిమధ్య వాదోపవాదనలు జరిగాయి. చివరికి విగ్రహాలను నదిలోకిదించి స్నానమాచరించారు. కార్యక్రమంలో మిరియప్పల్లి సర్పంచ్ లుకలాపు సుధారాణి, ఆనందరావు, తిరుమలరావు, రాజారావు, లక్ష్మీనారాయణ, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.