అయ్యా.. మాది ఏ కులం? | Srikakulam People Tell Their Problems To The Minister Dharmana Krishna das | Sakshi
Sakshi News home page

అయ్యా.. మాది ఏ కులం?

Published Sat, Aug 3 2019 9:15 AM | Last Updated on Sat, Aug 3 2019 9:15 AM

Srikakulam People Tell Their Problems To The Minister Dharmana Krishna das - Sakshi

సాక్షి,  జలుమూరు(శ్రీకాకుళం) : ఆయ్యా మేము ఏ కులానికి చెందుతామో అధికారులు నిర్దారించలేకపోతున్నారు.. పల్స్‌ సర్వే(ప్రజాసాధికార సర్వే)లో కులం స్థానంలో ఇతరులుగా నమోదు చేస్తున్నారు.. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కొంతమందికి ఎస్టీలుగా ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం మమ్మల్ని పూర్తిగా విస్మరించింది. కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు పొందలేకపోతున్నామని పలువురు ఏనేటి కొండ కులాలకు చెందిన వారు తమ ఆవేదనను మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు వివరించారు. జలుమూరులో శుక్రవారం మంత్రిని కలిసి తమ గోడు వెల్లబుచ్చారు.

జిల్లాలో కోటబొమ్మాళి, మందస, జలుమూరు, సంతబొమ్మాళి, పలాస, ఇచ్ఛాపురం తదితర మండలాల్లో ఏనేటి కొండ జాతులకు చెందిన సుమారు 3వేల కుటుంబాలు జీవిస్తున్నాయని ఆ సంఘం నాయకుడు పాలకి కిరణ్‌కుమార్‌ మంత్రికి వివరించారు. తమ ఆచార, వ్యవహారాలు, సాంప్రదాయాలు గిరిజనుల మాదిరిగా ఉండడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎస్టీలుగా గుర్తించి కులధ్రువీకరణ పత్రాలు జరీ చేసిందన్నారు. కానీ టీడీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేయడంతో తామంతా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు, తమ పిల్లలకు స్కాలర్‌షిప్‌లు అందక, ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. తమకు కులధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. మంత్రి స్పందిస్తూ జిల్లాలో ఇలా ఎంతమంది ఉన్నారో గుర్తించి సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

స్టాఫ్‌నర్సుల సమస్యలు పరిష్కరించాలని వినతి
శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో పనిచేస్తున్న స్టాఫ్‌నర్సుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా స్టాఫ్‌నర్సుల సంఘం ప్రతినిధులు మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు వినతిపత్రం అందజేశారు. నరసన్నపేటలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం మంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. 500 పడకల ఆస్పత్రిని 700 పడకలకు విస్తరించారని, కానీ ఆమేరకు స్టాఫ్‌నర్సుల నియామకం చేపట్టకపోవడంతో రోగులకు పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోతున్నామన్నారు. 254 మంది నర్సులు ఉండాల్సి ఉండగా 80 మంది వరకు డిప్యుటేషన్లపై ఇతర చోట్ల పనిచేస్తున్నారని అన్నారు. డిప్యుటేషన్ల రద్దయ్యేలా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో సంఘం అధ్యక్షురాలు ఎన్‌వీ లక్ష్మి, నిర్మలాదేవి, రోషినీతార తదితరులు ఉన్నారు.

ఏ కులమో గుర్తించకపోవడంతో నష్టపోతున్నాం
మేము ఏ కులానికి చెందిన వారిమో ప్రభుత్వం గుర్తించకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. గతంలో ఏనేటి కొండగా గుర్తించి కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేవారు. కానీ టీడీపీ ప్రభుత్వం వాటిని నిలుపుదల చేసంది. మా పిల్లల జీవితాలకు భరోసా లేకుండాపోయింది. ప్రభుత్వం మా సమస్యను పరిష్కరించాలి.
– సంకిలి లక్ష్మి, కస్తూరిపాడు, కోటబొమ్మాళి 

కులధ్రువీకరణ పత్రాలు అందించాలి
కులం గుర్తింపు విషయంలో మేము ఇప్పటికే చాలా నష్టపోయాం. మా పిల్లలు మా మాదిరిగా కాకూడదు. ప్రజాసాధికార సర్వే చేయించి మాకు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలి. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి ఆదుకోవాలి.
– పి.కిరణ్‌కుమార్, ఏనేటి కొండ కులసంఘం నాయకుడు   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement