వెంటాడి... వేటాడి...
జలుమూరు: వారంతా దగ్గరి బంధువులే. చిన్న పొలం విషయమై తలెత్తిన తగాదా నాలుగేళ్లుగా కక్షలు, కార్పణ్యాలకు కారణమైంది. చివరకు ప్రత్యర్థులు వెంటాడి వేటాడడంతో అన్నయ్య దారుణ హత్యకు గురవగా తమ్ముడు ప్రాణాపాయ స్థితిలో శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. జలుమూరు మండలం పెద్దదూగాంలో సోమవారం ఉదయం జరిగిన సంఘటన వివరాలు ఇవీ... అన్నదమ్ములైన ధర్మాన లచ్చుమయ్య(40), భాస్కరరావు ఉదయం 6.20 గంటలకు పొలం పనులకు బయలుదేరారు. గ్రామ శివార్లకు వచ్చేసరికి సందుల్లోంచి నాగలితో ఎడ్లు వెళ్లలేవని లచ్చుమయ్య మరో తోవలో పొలం వైపు వెళ్లాడు. భాస్కరావు ఇంకో తోవలో వెళుతుండగా ప్రత్యర్థులు ధర్మాన ముఖలిం గం, కుమారుడు వెంకటరమణ, భార్య తవిటమ్మ మారణాయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో భాస్కరరావు చేయి విరిగిపోగా పక్కటెముకలు తీవ్రం గా గాయాలు తగిలాయి.
ఆయన కాపాడాలంటూ కేకలు వేయగా చుట్టుపక్కల వారు రావడంతో ప్రత్యర్థులు పారిపోయారు. విషయం తెలిసిన లచ్చుమ య్య కుమారుడు భానుప్రసాద్ తన తండ్రికీ అపా యం ఉందని అడ్డతోవలో సైకిల్‌పై పొలం వైపు వెళ్లాడు. భాస్కరరావు తప్పించుకోవడంతో ప్రత్యర్థులు లచ్చుమయ్యను వెంటాడి వేటాడారు. కత్తి, బల్లెంతో తల, నడుము, వీపు, చేయిపై పలుసార్లు పొడిచారు. ఆ సమయంలో అక్కడకు చేరిన భానుప్రసాద్‌ను కూడా హతమార్చడానికి ప్రయత్నించగా ఆయన తప్పించుకుని గ్రామంలోకి వచ్చాడు. ఇం తలో చుట్టుపక్కల రైతులు, కూలీలు కేకలు వేయడం తో దుండగులు లచ్చుమయ్యను వదిలి వెళ్లిపోయారు. కొనూపిరితో ఉన్న లచ్చుమయ్యను ఇంటికి తీసుకువచ్చిన కొద్దిసేపటికే ప్రాణం విడిచాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
చిన్నపాటి వివాదమే...
లచ్చుమయ్య, ముఖలింగంలు దగ్గర బంధువులే. అయితే పొలం గట్టు విషయంలో నాలుగేళ్లుగా గొడవపడుతుండేవారని గ్రామస్తులు తెలిపారు. తరచూ గట్టు కొట్టి పొలం కలుపుకోవడం, కళ్లాల వద్ద కొట్లాడుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయని చెప్పారు. ముఖలింగం ఆది నుంచి వివాదస్పదడని, రెండేళ్లు క్రితం ధర్మాన ఈశ్వరరావు అనే వ్యక్తిని కళ్లం తగాదాలో తలపగలు కొట్టాడని పేర్కొన్నారు.
పోలీస్ పికెట్
గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. లచ్చుమయ్య కుటంబానికి రక్షణ ఏర్పాటు చేసినట్లు నరసన్నపేట సీఐ అర్.వి.వి.ఎస్.ఎన్.చంద్రశేఖర్ తెలిపారు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. క్లూస్, డాడ్ స్క్వాడ్ గుండాలు చెరువు వద్ద కొలతలు, మృతుడు లచ్చుమయ్య రక్తపు మరకలు ఆనవాళ్లు తీసుకున్నారు. అడిషనల్ ఎస్పీ శ్రీదేవిరావు, క్లూస్ టీమ్ సీఐ కోటేశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. జలుమూరు ఎస్‌ఐ డి.విజయ్‌కుమార్ కేసు నమోదు చేయగా సీఐ దర్యాప్తు చేస్తున్నారు.