
చెన్నై: అన్నాడీఎంకేలో ఆధిపత్య ముసలం ఆగలేదు.. మళ్లీ తారాస్థాయిలో రాజుకుంది. పళనిస్వామి, పన్నీరు సెల్వంలో ఎవరో ఒకరు పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాలంటూ ఇరు వర్గాల మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. జూన్ 14వ తేదీన జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశం నుంచి ఈ ముసలం మరింతగా ముదిరింది. ఈ తరుణంలో.. జయలలిత సమాధి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
జయలలిత సమాధి వద్ద కిరోసిన్ పోసుకుని ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పళనిస్వామి అన్నాడీఎంకే అధ్యక్షుడిగా ఉండడానికి వీల్లేదంటూ వీరంగం సృష్టించాడు. అన్నాడీఎంకే అధినేతగా జయలలిత పేరే ఉండాలంటూ డిమాండ్ చేశాడు. కార్యకర్తను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ భేటీకి ముందు పార్టీలో వర్గపోరు మరోసారి బయటపడింది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ కో-కోఆర్డినేటర్ పళనిస్వామి(EPS), మాజీ డిప్యూటీ సీఎం.. పార్టీ కోఆర్డినేటర్ పన్నీరుసెల్వం వర్గీయులు వాళ్ల వాళ్ల డిమాండ్‌లతో రచ్చకెక్కుతున్నారు. జూన్ 23న(గురువారం) జరగబోయే మీటింగ్‌లో పార్టీ అంతా ఒక్కరి నాయకత్వంలోనే నడవాలని పళనిస్వామి తీర్మానం చేయనున్నాడు.
అదే సమయంలో.. తన సంతకం లేకుండా జనరల్ బాడీ ఆ తీర్మానం ఆమోదించడానికి వీల్లేదంటూ పన్నీర్ సెల్వం వాదిస్తున్నాడు. ఈ మేరకు బుధవారం ఎన్నికల కమిషన్‌ను కలిసి తన పాయింట్‌ను వినిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు జనరల్ కౌన్సిల్ భేటీ జరగకుండా అడ్డుకునేందుకు పోలీసులను ఆశ్రయించాడు ఆయన. అయితే.. ఈ భేటీ జరగకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ మద్రాస్ హైకోర్టులో మాజీ మంత్రి బెంజిమన్ ఓ పిటిషన్ దాఖలు చేయగా.. మంగళవారం ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది హైకోర్టు. నిర్వహణ ఉండాలా? వద్దా? అనేది పార్టీ జనరల్ కౌన్సిల్‌కు సంబంధించిన నిర్ణయమని, దానిని ఆపాలని ఆదేశించలేమని బెంచ్ స్పష్టం చేసింది. అంతేకాదు.. భేటీకి హాజరయ్యే సభ్యులను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని పోలీసులను ఆదేశించింది మద్రాస్ హైకోర్టు. ఈ తరుణంలో అన్నాడీఎంకే వర్గపోరు వేడి.. అక్కడి రాజకీయాలను హీటెక్కిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment