కరకవలస వద్ద నగిరికటకం ఓపెన్ హెడ్ కాలువపై నుంచి నిర్మించిన కరకట్ట
సాక్షి, జలుమూరు (శ్రీకాకుళం): కరకట్టల నిర్మాణ పనుల పుణ్యమా అని నగిరికటకం వద్ద ఉన్న వంశధార ఓపెన్ హెడ్ కాలువ కనుమరుగు కానుంది. బ్రిటీష్ కాలంలో (1865) తవ్విన ఈ కాలువ పొడవు 16.7కిలో మీటర్లు. సుమారు 2,720 ఎకరాలకు సాగునీరు అందేది. వంశధార నదిని కరకవలస వద్ద అనుసంధానం చేసి జలుమూరు మండలం వరకే ఈ కాలువను పరిమితం చేశారు. కరకవలస, శ్రీముఖలింగం, నగిరికటకం, అచ్చుతాపురం, కొమనా పల్లి, తిమడాం, సురవరం, సైరిగాంతోపాటు మరికొన్ని గ్రామాల్లో రెండు పంటలకు నీరందించేదని ఆయా గ్రామాల రైతులు చెబుతున్నారు. 1982లో వంశధార నది వరదలు, నీటి ప్రవాహం ఎక్కువ అవ్వడంతో కరకవలస వద్ద కొంత అడ్డుకట్ట వేశారు. 10 ఆర్, 7 ఆర్, 11 ఆర్, 12 ఆర్, మురికి కాలువలు నుంచి ప్రవహించే నీరు ఈ కాలువలో కలిసి పంట పొలాలను వరద బారీ నుంచి రక్షించేది. ప్రస్తుతం ఈ కాలువ కనుమరుగవ్వడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఐదు కిలో మీటర్ల మేర కప్పేశారు..
సుమారు రూ.56 కోట్లతో వంశధార కరకట్ట నిర్మాణం 2010 నుంచి జరుగుతోంది. ఈ కరకట్టల నిర్మాణంలో డిజైన్లు కూడా సరిగ్గా చూడకుండా ఆమోదం తెలిపారు. రైతుల అభ్యర్థనలు కనీసం సంబంధిత గుత్తేదారు పట్టించుకోకుండా 150 ఎళ్ల చరిత్ర గల ఈ కాలువకు కరకట్టతో కప్పేసి పూర్తిగా తెరమరుగు చేయడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ కాలువ కరకవలస నుంచి శ్రీముఖలింగం వరకు సుమారు ఐదు కిలో మీటర్లు కప్పేశారు.
నెట్‌వర్క్ సిస్టంతో అభివృద్ధి జరిగేనా?
నరసన్నపట డివిజన్ పరిధిలోని ఐదు ప్రధాన ఓపెన్ హెడ్ కాలువలతోపాటు బైరి ఓపెన్ హెడ్ కాలవ, మేజర్ కాలువ, అనుబంధ కాలువల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.68 కోట్లు మంజూరైంది. కాలువల్లో ఆక్రమణలు తొలగించడం, పురాతన కాలువలను సైతం అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు చేశారు. ఈ పనుల్లో నగిరికటకం కాలువ కూడా ఉంది. ఈ కాలువ అభివృద్ధికి సుమారు 2.88 కోట్లు మంజూరయ్యాయి. గత పదేళ్లుగా ఈ కాలువ అభివృద్ధికి నిధులు మంజూరవ్వడం, సాంకేతిక సమస్యలు రావడం, అంచనాలు పెంచడం వంటివి జరిగాయి. గత టీడీపీ ప్రభుత్వంలో కూడా కొంత వరకు పనులు చేశారే తప్ప.. కాలువ కనుమరుగు అవుతుందని రైతులు చెప్పినా సంబంధిత అధికారులు పట్టించుకోలేదు. ఇంత జరుగుతున్నా వంశధార అధికారులు నగిరికటకం కాలువ పరిస్థితి చూడలేదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఉన్నతాధికారుల సూచనలు పాటిస్తాం..
కరకట్టతో కప్పేసిన కాలువ పనులు మళ్లీ ఎలా చేస్తారు? రైతులకు ఎలా సాగు నీరందిస్తారని హిరమండలం డివిజన్ డీఈఈ ప్రభకరరావును సాక్షి వివరణ కోరింది. అక్కడ అంచనాలు తయారు చేసే సమయంలో తాను లేనని చెప్పారు. ఉన్నాతాధికారుల సూచనలతో పనులు చేస్తామన్నారు. అదేచోట వంశధార నదికి అనుసంధానంగా కాలువను తెరిపించేందుకు ప్రయత్నిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment