చోడవరం : గ్రామాల్లో ఎవరికి పింఛను ఉందో.. ఎవరిని తొలగించారో తెలియని అయోయ పరిస్థితి నెలకొంది. వెబ్ సైట్లలో తప్పుడు సమాచారం ఉంచడం వల్లే అర్హులైన వేలాది మంది అర్హులు అనర్హులుగా పరిగణింపబడుతున్నట్లు వెల్లడవుతోంది. చోడవరం మండలంలో సుమారు 10,500 పింఛన్లు ఉండగా, 3 వేల వరకు తొలగిస్తూ ఎస్‌ఆర్‌డీహెచ్ (హైదరాబాద్) నుంచి ఆదేశాలు అందాయి. వాస్తవానికి ఇంతమంది లబ్ధిదారులు అనర్హులు కారు. ఈ విషయం ప్రస్తుతం జరుగుతున్న జన్మభూమి-మా ఊరు సభల్లో వెలుగుచూస్తుండటంతో ఆయా శాఖల అధికారులు అయోమయంలో పడ్డారు.
ఆధార్, రేషన్ కార్డులు వంటి ఆరు వెబ్ సైట్ల ఆధారంగా రెవెన్యూ శాఖ ఇచ్చిన వెబ్ ల్యాండ్ డేటాను ఆధారంగా చేసుకొని ఎస్‌ఆర్‌డీహెచ్ పింఛను అనర్హుల జాబితాను తయారు చేసింది. వెబ్‌ల్యాండ్ డేటాలో అన్నీ తప్పులే ఉన్నాయని, ఎకరా భూమి ఉన్న రైతుకు కూడా 5 ఎకరాలు ఉన్నట్టు చూపించినట్లు తేటతెల్లమవుతోంది. సోమవారం దుడ్డుపాలెంలో జరిగిన సభలో ఈ వాస్తవం బయటపడటంతో అధికారులు ఖంగుతున్నారు. ఈ గ్రామంలో 34 మంది లబ్ధిదారులు పింఛన్‌కు అనర్హులుగా జన్మభూమి సభలో ప్రకటించారు. ఒక్కొక్కరికి 5 ఎకరాల పల్లం భూమి ఉన్నట్లు వెబ్‌ల్యాండ్ డేటాలో నమోదైనందున తొలగించామని అధికారులు చెప్పడంతో బాధిత లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో అధికారులు బాధిత లబ్ధిదారుల భూమి వివరాలు పాసుపుస్తకాలల్లో పరిశీలించగా ఒకొక్కరికీ ఎకరా, రెండెకరాలకు మించి లేదు. దీనిపై చర్చించిన అధికారులు వెబ్‌ల్యాండ్ డేటా సమాచారంలో తప్పులున్నట్టుగా గుర్తించి, తొలగించిన వారిలో 30 మందిని పింఛనుకు అర్హులుగా తిరిగి గుర్తించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇదే తరహాలో అన్ని గ్రామాల్లో అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలిసింది.
జాడలేని జాబితాల ప్రదర్శన
పింఛను తొలగింపు జాబితాలు గ్రామాల్లో పంచాయతీల వద్ద వేలాడదీయాల్సి ఉండగా ఆ తరహా చర్యలు ఎక్కడా కనిపించలేదు. ఒకొక్క గ్రామంలో వందలాది పింఛన్లు తొలగించారు. ఎవరికి పింఛను ఉందో... ఎవరికి పోయిందో తెలియని పరిస్థితి నెలకొంది. ముందస్తు సమాచారం లేకపోవడంతో లబ్ధిదారులు తమ పేర్లు ఉన్నట్టు భావిస్తున్నారు. గ్రామానికి ఎన్ని తొలగించారనే జాబితా అధికారుల వద్ద ఉన్నప్పటికీ వారు కూడా గోప్యంగా ఉంచి, జన్మభూమి సభల్లో జనం తిరుగుబాటు లేకుండా చేసుకొని వెళ్లిపోతున్నారు. తొలగించిన జాబితా ప్రదర్శించకుండా అధికారులు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారంటూ బాధిత పింఛన్ దారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
సమస్యలపై నిలదీసిన జనం
చోడవరం : మండలంలోని లక్కవరం, దుడ్డుపాలెం గ్రామాల్లో సోమవారం నిర్వహించిన జన్మభూమి-మా ఊరు సభల్లో ప్రలు సమస్యలపై అధికారులను ప్రజలు నిలదీశారు. లక్కవరం సభలో రైతులు మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న రైవాడ కుడి కాలువ పూర్తిచేయాలంటూ అధికారులను నిలదీశారు. దీంతో ఇరిగేషన్ అధికారులు మాట్లాడుతూ రూ.9 కోట్లతో ప్రతిపాదన పంపామని వివరణ ఇచ్చారు. తాగునీటి సమస్యపైనా ప్రజలు ప్రశ్నించగా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు స్పందిస్తూ రూ.4.5లక్షలతో మంచినీటి ట్యాంక్‌కు ప్రతిపాదన పంపామన్నారు. అసంఘటిత కార్మికులకు 50 ఏళ్లకే పింఛన్లు ఇవ్వాలంటూ జీఓ ఉన్నప్పటికీ మంజూరు చేయలేదని కొందరు కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అధికారులు అక్కడ మొక్కలు నాటారు.
30మంది పింఛన్ల పునరుద్ధరణ
దుడ్డుపాలెం సభలో పింఛన్ల రద్దుపై బాధితులు ఆగ్రహం వ్యక్తంచేయగా అధికారులు రికార్డులు పరిశీలించారు. తొలగించిన 34మందిలో 30మంది అర్హులుగా గుర్తించినట్టు అధికారులు తెలిపారు. అనకాపల్లి ఆర్డీఓ వసంతరాయుడు, ఎంపీపీ గూనూరు కొండతల్లి, జెడ్పీటీసీ కనిశెట్టి మచ్చిరాజు, తహశీల్దార్ శేషశైలజ, సర్పంచ్ గణపతిరాజు శారదాదేవి, ఎంపీటీసీలు ఒబలరెడ్డి నారాయణమ్మ, మిడతాడ రామయ్యమ్మ, బూపతిరాజు సన్యాసిరా తదితరులు పాల్గొన్నారు.
తప్పుడు ‘డేటా’తో పింఛన్ల కోత!
Published Tue, Oct 7 2014 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM
Advertisement