ఉచిత ఇసుక.. మరో మెలిక | aadhaar card link free sand | Sakshi
Sakshi News home page

ఉచిత ఇసుక.. మరో మెలిక

Published Thu, Apr 7 2016 12:31 AM | Last Updated on Mon, Aug 13 2018 3:58 PM

aadhaar card link free sand

ఆధార్‌కార్డు కావాలంటూ ప్రకటన
 మొబైల్ యాప్‌లంటూ గందరగోళం
 
 సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఉచితం.. ఉచితం.. ఇసుకను అమ్ముకుని ఆదాయాన్ని సమకూర్చుకోవాల్సిన పనిలేదంటూ బాహాటంగా ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పుడు అందుకు సవాలక్ష మెలికలు పెడుతోంది.  సరిగ్గా నెల కిందట వరకు ఇసుకను నిర్ణయించిన  ధర మేరకే సరఫరా చేయాలి. ఆమేరకే టెండర్లు వేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు అధికారులు టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తుండగా, ఇంతలో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఇసుకను ఉచితంగానే అందిస్తామంటూ ప్రకటించారు. నిత్యావసరాల మాదిరిగా ప్రజలకు ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో సామాన్య ప్రజలు ఊరట చెందారు. టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇసుక కోసం పడ్డ అష్టకష్టాలకు చెక్ పడుతుందని ఆశించారు. అయితే టీడీపీ నేతల నిర్వాకంతో ఆ ఆశలు అడియాసలయ్యాయి.
 
 జిల్లాలో గుర్తించిన పది ఇసుక ర్యాంపులను పచ్చనేతలు వారి గుప్పెట్లోకి తీసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఫలితంగా ర్యాంపుల నుంచి ఇసుకను తీసుకునేందుకు సామాన్యుడు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది. లోడింగ్ చేసేందుకూ ఇబ్బందులే ఎదురయ్యాయి. స్థానిక నేతలు చెబితేనే ఇసుక లోడింగ్‌కు అనుమతులు లభించేలా ఆయా ర్యాంపుల్లో పరిస్థితులు నెలకొన్నాయి. ఉచితంగా లభించే ఇసుకకూ ఇన్ని ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులేంటనే భావన సామాన్య ప్రజల నుంచి వ్యక్తమైంది.
 
 ఇప్పుడు ఆధార్ మెలిక
 తాజాగా ప్రభుత్వం ఉచిత ఇసుకకు ఆధార్‌కారుడ మెలిక పెట్టడం సామాన్యులను మరింత గందర గోళానికి గురిచేస్తోంది. ఆధార్ కార్డు వివరాలు నమోదుచేసి.. ఎంత ఇసుకను తీసుకెళ్లవచ్చనేదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ.. ఒక ఆధార్ కార్డుకు కొంత మొత్తంలోనే ఇసుక తీసుకెళ్లాలనే నిబంధన ఉంటే.. భారీ గృహనిర్మాణాలకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఈ ఆధార్ అనుసంధానం వల్ల  ఏం ప్రయోజనాలు ఒనగూరుతాయన్నది అర్థం కాకుండా ఉంది.
 
 ఇక సిమెంటులో కలిపేందుకే ఇసుకను తీసుకెళ్లాలనే నిబంధన కూడా ప్రజలను గందరగోళానికి గురిచేసేలా ఉంది. ఇక మొబైల్‌యాప్‌ల ద్వారా  ఇసుక సమాచారం అందిస్తామన్నది కూడా అర్థం కాకుండా ఉంది. సామాన్యులు వాడే సెల్‌ఫోన్లలో యాప్ ద్వారా సమాచారం తెలుసుకునే వీలుండదు. దీంతో ఈ యాప్‌ల గందరగోళం అవసరమా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉచిత ఇసుకంటూ ఇన్ని మెలికలు పెడుతున్న ప్రభుత్వం ముందుగా క్షేత్రస్థాయిలో ర్యాంపుల వద్ద టీడీపీ నేతల ఆగడాలను కట్టడి చేయాలని సామాన్య జనం కోరుతున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement