పాత పద్ధతిలో పాసు పుస్తకాలు
రెండు నెలల గందరగోళానికి తెర
సాక్షి, హైదరాబాద్: పట్టాదారు పాసు పుస్తకాల జారీ ప్రక్రియ పట్టాలెక్కింది. ఇప్పటి వరకు ఆటకెక్కించిన రెవెన్యూ శాఖ ఇప్పుడు మళ్లీ పాత బట్టింది. ఆన్‌లైన్ విధానంపై ఆలోచనను తాత్కాలికంగా విరమించింది. రెండు నెలలపాటు కొనసాగిన అయోమయానికి తెరదించింది. కొత్త పుస్తకాల ముద్రణను ప్రారంభించింది. కొత్త జిల్లాల పేర్లు ఉండేవిధంగా ముద్రణకు ఆదేశించింది. పహాణీల మాదిరిగా పట్టాదారు పాసు పుస్తకాలను కూడా ఆన్‌లైన్ ద్వారా అందజేయాలని గతంలో రెవెన్యూ శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించి నాటి సీసీఎల్‌ఏ రేమండ్‌పీటర్ కసరత్తు కూడా చేశారు. అది పూర్తికాకుండానే మాన్యువల్ పాసుపుస్తకాల జారీ నిలిపివేయాలంటూ రెవెన్యూ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. దీంతో వాటి ముద్రణ కూడా నిలిచిపోయింది.
ఆన్‌లైన్ కోసం సాఫ్ట్‌వేర్ సిద్ధం కాకపోవటం, దానికి సంబంధిత సంస్థతో ఒప్పందం జరగకపోవటం, దీనికి ప్రభుత్వం నుంచి ఆమోదమూ రాకపోవటంతో ఆ కసరత్తులో జాప్యం జరిగింది. ఇంతలో రేమండ్ పీటర్ పదవీవిరమణ చేశారు. దీంతో ఈ విషయాన్ని పట్టించుకునేవారే లేకుండాపోయారు. ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రయోగాత్మకంగా ఓ మండలాన్ని ఎంపిక చేసుకుని పరిశీలిస్తారు. కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా వ్యవహరించారు. రైతుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉందని, చాలాచోట్ల ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడుతోందని తహసీల్దారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.
దిగొచ్చిన అధికారులు
కాలం కలసి రాక ఖరీఫ్ పంటలను కోల్పోయిన రైతులు రబీపై దృష్టి సారించారు. పంట రుణాల కోసం సిద్ధమవుతుండగా పట్టాదారు పాసు పుస్తకాల సమస్య వచ్చి పడింది. కొత్తగా పాసుపుస్తకాలు అవసరమైనవారికి రుణాలు పొందే వెసులుబాటు లేకుండాపోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు సాగుకు అవసరమైన స్ప్రింక్లర్లు, డ్రిప్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వ పథకం కింద దరఖాస్తు చేసుకుని సబ్సిడీ వెసులబాటు పొందాలన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక తండ్రి నుంచి సంక్రమించిన భూములను పంచుకునే క్రమంలో వారసులకు కొత్త పాసు పుస్తకాల జారీ కావటం లేదు. భూముల క్రయవిక్రయాలకూ ఇదే ఇబ్బంది ఏర్పడింది. భూముల రిజిస్ట్రేషన్లపై కూడా దీని ప్రభావం కనిపిస్తోంది. దీంతో జనం గగ్గోలు పెడుతుండటంతో ఎట్టకేలకు అధికారులు దిగొచ్చారు.