ఈ వారం వ్యవసాయ సూచనలు | References to the farm this week | Sakshi
Sakshi News home page

ఈ వారం వ్యవసాయ సూచనలు

Published Sun, Sep 28 2014 10:56 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

ఈ వారం వ్యవసాయ సూచనలు - Sakshi

ఈ వారం వ్యవసాయ సూచనలు

ఆముదం రైతులూ తస్మాత్ జాగ్రత్త!
 
తెలంగాణలో ఉన్న వాతావరణ పరిస్థితులు, అడపాదడపా పడుతున్న వర్షాలు, తుపాను హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని పూత, గెల దశలో ఉన్న ఆముదంలో తెగుళ్లు, పురుగులు ఆశించే అవకాశం ఉంది. రైతులు అప్రమత్తంగా ఉండాలి.
     
బూజు తెగులు గెలను ఆశించడం వల్ల ముందుగా కాయలపైన గోధుమ రంగు మచ్చలు ఏర్పడి తర్వాత అన్ని కాయలకు వ్యాపిస్తాయి. దీని శిలీంధ్ర బీజాలు గాలి ద్వారా ఒక మొక్క నుంచి మరొక మొక్కకు వ్యాపించి కాయలు మెత్తబడి, కుళ్లి రాలిపోతాయి.
     
తుపాను సూచనలు తెలిపిన వెంటనే వర్షానికి కనీసం 6-8 గంటల ముందు లీటరు నీటికి 1 గ్రా. కార్బండిజమ్ లేదా 1 గ్రా. ధయోఫినేట్ మిథైల్‌ని కలిపి మొక్క అన్ని భాగాలు తడిచేలా పిచికారీ చేయాలి. వర్షాలు తగ్గిన తర్వాత కూడా మళ్లీ ఒకసారి ఇదే మోతాదులో పిచికారీ చేయాలి.
     
వర్షాలు తగ్గిన తర్వాత నేలలో తేమ ఉంటుంది. కాబట్టి 20 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ ఎరువులను ఎకరాకు వేసినట్లయితే తర్వాత గెలలు బాగా వచ్చి నష్టాన్ని కొంత వరకు తగ్గించుకోవచ్చు.
     
నీరు నిలిచే నేలల్లో, పల్లపు ప్రాంతాల్లో వడలు తెగులు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది. తెగులు సోకి చనిపోయిన మొక్కలను ఎప్పటికప్పుడు పొలం నుంచి తొలగించి నాశనం చేసి తరువాత కార్బండిజమ్ 1గ్రా. లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లీటరు నీటిలో కలిపి మొక్కల మొదళ్ల దగ్గర భూమిని తడపాలి.
     
వేరుకుళ్లు, కాండం కొమ్మ ఉండు తెగులు నివారణకు తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే కార్బండిజమ్ 1గ్రా. ఒక లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ల దగ్గర భూమిని తడపాలి లేదా మొక్కలపై పిచికారీ చేయాలి.
     
పరాన్నజీవులు తక్కువగా ఉన్నప్పుడు కార్బరిల్ 3గ్రా. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లేదా ధయోడికార్బ్ 1.5 గ్రా. లేదా నొవాల్యూరాన్ 1 మి.లీ./లీటరు నీటికి కలిపి పురుగు ఉధృతిని బట్టి మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి.
 - డా. దండ రాజిరెడ్డి, పరిశోధన, విస్తరణ సంచాలకులు, ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం,హైదరాబాద్‌రొయ్యల సీడ్ స్టాకింగ్‌కు 15 రోజులు ఆగాలి
     
శీతాకాలపు వెనామీ రొయ్యల సాగు ప్రారంభించదలచిన రైతులు ఉష్ణో గ్రతల్లో హెచ్చుతగ్గులు కుదుటపడే వరకు ఆగాలి. అక్టోబర్ 15 తర్వాత సీడ్ స్టాకింగ్‌కు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.
     
సీడ్ వేయడానికి ఇప్పటికే నీటిని చెరువులోకి తోడినప్పటికీ.. ఆ నీటిని నిల్వగట్టుకోవాలి. 15 రోజుల తర్వాత అదే నీటిలో ఎకరానికి 100 కిలోల చొప్పున బ్లీచింగ్ పౌడర్ చల్లి సీడ్ వేసుకోవచ్చు.
     
శీతాకాలపు సాగుకు ఇసుక నేలలు, ఇనుకుడు(సీపేజీ) ఉండే నేలలు అనుకూలం. నల్లరేగడి నేలల్లో వేసవి పంటలో వేసే సీడ్‌లో 50% మాత్రమే ఈ పంటకాలంలో వేసుకోవడం లాభదాయకం.

పస్తుతం సాగు చేస్తున్న రైతులు గానీ, అక్టోబర్ 15 తర్వాత స్టాకింగ్ చేసే రైతులు గానీ మేతలో ఫిష్ ఆయిల్ లేదా ఇతర ఫ్యాట్ ఆయిల్స్‌ను కలిపి వాడటం మంచిది.
 - ఆచార్య పి. హరిబాబు,ప్రభుత్వ మత్స్యకళాశాల, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా
 
సేపు ఇంజెక్షన్లతో చేటు!

పశువు మెదడులో సోస్టీరియల్ పిట్యుటరీ అనే గ్రంథి నుంచి ఆక్సీటోసిన్ విడుదలైనప్పుడు పాల ఉత్పత్తి సహజంగా జరుగుతుంది. పాలు తీయడానికి రైతు ఉపక్రమించినప్పుడు పశువుకు సహజంగానే పాలివ్వాలన్న ఆలోచన కలుగుతుంది. సేపు (ఆక్సీటోసిన్) ఇంజెక్షన్లు ఇచ్చి పాలు పితకడం చట్టరీత్యా నేరం.
     
పాలివ్వడం అనే ప్రక్రియే ఒత్తిడితో కూడుకున్న పని.  సేపు ఇంజక్షన్ వల్ల పశువు మరింత ఒత్తిడికి గురవుతుంది.
సేపు ఇంజెక్షన్ల వల్ల పశువుకు పునరుత్పత్తి సమస్యలు తలెత్తుతాయి. 5, 6 ఈతలు చక్కగా పాలివ్వాల్సిన పశువు 3, 4 ఈతలకే ముసలిదైపోతుంది. ఇంజెక్షన్ చేసి తీసిన పాలు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర దుష్ర్పభావాలను చూపుతాయి.
 - డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ,అధిపతి, పశు పరిశోధన కేంద్రం, గరివిడి, విజయనగరం జిల్లా

చేపలపై ఒత్తిడికి కారణాలెన్నో..!
మంచినీటి చేపల సాగులో అధికోత్పత్తి సాధించడానికి రైతులు సాధారణంగా చెరువులో అధిక సంఖ్యలో చేప పిల్లల్ని వదలడం, సహజాహారం వృద్ధి కోసం ఎరువులు వేయడం, అధికంగా మేతను పెట్టడం వంటి పనులు చేస్తుంటారు.
     
వీటి వల్ల చెరువు నీటి నాణ్యత పాడై, చేపలు ఒత్తిడికి గురవుతాయి. ఈ విధమైన ఒత్తిడి దీర్ఘకాలం కొనసాగినప్పుడు, చేపలు త్వరగా వ్యాధుల బారిన పడతాయి.
     
చేపలపై ఒత్తిడికి దారితీసే కారణాలు అనేకం: ఉష్ణోగ్రత బాగా తక్కువగా ఉన్నా లేదా ఎక్కువగా ఉన్నా చేపలు ఒత్తిడికి గురవుతాయి. నీటి పీహెచ్, ప్రాణవాయువు, అమ్మోనియాలో  ఆకస్మిక మార్పులేర్పడినప్పుడు చేపలు ఒత్తిడికి గురవుతాయి. అధిక సాంద్రతలో చేపల్ని చెరువులో వేయడం, ప్లాంక్టాన్ ‘బ్లూమ్స్’ అధిక మొత్తంలో ఏర్పడి, నీరు బాగా ముదురు ఆకు పచ్చ రంగులోకి మారడం వల్ల కూడా చేపలు ఒత్తిడికి గురవుతాయి.
     
ఒత్తిడికి గురైన చేపలు మేత తినడం మాని వ్యాధులపాలవుతాయి.
 - డాక్టర్ పి. రామ్మోహన్ రావ్(98851 44557), అసిస్టెంట్ డెరైక్టర్ ఆఫ్ ఫిషరీస్, స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ, కాకినాడ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement